సౌర వ్యవస్థకు ఆవల జీవం! | Scientists find promising hints of life on distant planet K2-18b | Sakshi
Sakshi News home page

సౌర వ్యవస్థకు ఆవల జీవం!

Published Fri, Apr 18 2025 12:53 AM | Last Updated on Fri, Apr 18 2025 7:32 AM

Scientists find promising hints of life on distant planet K2-18b

‘కే2–18బీ’ గ్రహంపై డీఎంఎస్, డీఎండీఎస్‌ వాయువులు  

జీవ సంబంధమైన ప్రక్రియల ద్వారానే ఉత్పత్తి అయ్యే అవకాశం  

ఎక్సోప్లానెట్‌పై జీవం ఉందనడానికి బలమైన సాక్ష్యాధారాలు లభించాయి  

వెల్లడించిన కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ సైంటిస్టులు  

అనంతమైన విశ్వంలో మన భూగోళంపైనే కాకుండా ఇంకెక్కడైనా జీవజాలం ఉందా? జీవులు మనుగడ సాగించే వాతావరణ పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం కనిపెట్టడానికి శతాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇతర గ్రహాలపై జీవుల ఉనికి ఉండొచ్చని అంచనా వేస్తున్నప్పటికీ అందుకు కచ్చితమైన ఆధారాలైతే లభించలేదు.

 గ్రహాంతర జీవులు కాల్పనిక సాహిత్యానికే పరిమితమయ్యాయి. కానీ, మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న ‘కే2–18బీ’ అనే గ్రహంపై జీవం ఉందని చెప్పడానికి బలమైన సాక్ష్యాధారాలు లభించాయని యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లోని ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌ పరిశోధకులు వెల్లడించారు. ఈ గ్రహం మన భూమి నుంచి 124 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. భూమితో పోలిస్తే 8.5 రెట్లు పెద్దది. కక్ష్యలో పరిభ్రమిస్తోంది.

 ‘నాసా’కు చెందిన జేమ్స్‌వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ ద్వారా ఈ గ్రహంపై డైమిౖథెల్‌ సల్ఫైడ్‌(డీఎంఎస్‌), డైమిౖథెల్‌ డైసల్ఫైడ్‌(డీఎండీఎస్‌) అనే రకాల వాయువుల కెమిల్‌ ఫింగర్‌ఫ్రింట్స్‌ను గుర్తించారు. ఈ రెండు రకాల వాయువులు భూమిపైనా ఉన్నాయి. 

ఇవి కేవలం జీవ సంబంధమైన ప్రక్రియల ద్వారానే ఉత్పత్తి అవుతాయి. సముద్రంలోని ఆల్గే(మెరైన్‌ ఫైటోప్లాంక్టన్‌)తోపాటు ఇతర జీవుల నుంచి ఈ వాయువుల ఉత్పత్తి అధికంగా జరుగుతుంది. దీన్నిబట్టి కే2–18బీ గ్రహంపై జీవం ఉందని తేల్చారు. అచ్చంగా భూమిపై ఉన్నట్లుగా అక్కడ జీవించి ఉన్న ప్రాణులు లేనప్పటికీ జీవసంబంధిత ప్రక్రియలు జరుగుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే, దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని పేర్కొంటున్నారు.  

మనం ఒంటరివాళ్లం కాదు: మధుసూదన్‌  
జీవుల మనుగడ సాధ్యమయ్యే మరో గ్రహం దొరికిందని చెప్పడానికి ఇది తొలి సంకేతమని యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌లో అస్ట్రోఫిజిక్స్, ఎక్సోప్లానెటరీ సైన్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నిక్కు మధుసూదన్‌ వెల్లడించారు. సౌర వ్యవస్థకు బయట జీవం ఉనికిని పరిశోధించే విషయంలో ఇదొక కీలకమైన మలుపు అని తెలిపారు. ఇతర గ్రహాలపై మన సహచర జీవులు ఉన్నాయని కచ్చితంగా చెప్పే రోజు మరికొన్ని సంవత్సరాల్లో వస్తుందని మధుసూదన్‌ స్పష్టంచేశారు. మనం ఒంటరివాళ్లం కాదన్నారు.  

హైసియన్‌ ప్రపంచాలు  
కే2–18బీ గ్రహం సబ్‌–నెప్ట్యూన్‌ తరగతికి చెందినది. అంటే ఇలాంటి గ్రహాల వ్యాసం భూమి వ్యాసం కంటే ఎక్కువ, నెప్ట్యూన్‌ వ్యాసం కంటే తక్కువ.  కే2–18బీ గ్రహం ఎలా ఏర్పడిందన్నది ప్రస్తుతానికి మిస్టరీగానే ఉంది. దీనిపై మిథేన్, కార్బన్‌డయాక్సైడ్, డైమిౖథెల్‌ సల్ఫైడ్, డైమిౖథెల్‌ డైసల్ఫైడ్‌ వాయువులు సమృద్ధిగా ఉన్నట్లు 2023లో కనిపెట్టారు. 1990 నుంచి ఇప్పటివరకు సౌర వ్యవస్థ బయట 5,800 గ్రహాలను గుర్తించారు. వీటిని ఎక్సోప్లానెట్స్‌ అని పిలుస్తున్నారు. హైసియన్‌ ప్రపంచాలు అని కూడా అంటున్నారు. వీటిలో చాలావరకు ద్రవరూపంలోని నీటి సముద్రాలతో కప్పి ఉన్నాయని, ఎక్సోప్లానెట్స్‌పై హైడ్రోజన్‌తో కూడిన వాతావరణం ఉందని చెబుతున్నారు. ఆయా గ్రహాలపై జీవులు ఉండేందుకు వంద శాతం ఆస్కారం ఉందని, వాటిని గుర్తించడమే మిగిలి ఉందని పేర్కొంటున్నారు.   

పరిశోధనల దిగ్గజం నిక్కు మధుసూదన్‌
  ఇండియన్‌–బ్రిటిష్‌ ప్రొఫెసర్‌ నిక్కు మధుసూదన్‌ ఎక్సోప్లానెట్స్‌ను గుర్తించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన సమర్పించిన ఎన్నో పరిశోధన పత్రాలు అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పలు అధ్యయనాలకు ఆయన నేతృత్వం వహిస్తున్నారు. మధుసూదన్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ–వారణాసిలో బీటెక్‌ పూర్తిచేశారు. అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ)లో ఎంఎస్, పీహెచ్‌డీ అభ్యసించారు. 2020లో వాస్ప్–19బీ అనే గ్రహంపై టైటానియం ఆౖక్సైడ్‌ను గుర్తించిన బృందంలో ఆయన కూడా ఉన్నారు. కే2–18బీ గ్రహంపై పరిశోధనలు సాగిస్తున్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement