సాక్షి, హైదరాబాద్: అప్పటిదాకా తన వెంటే ఉన్న కుమారుడు క్షణాల్లోనే విగతజీవిగా మారడంతో ఆ కన్నతల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. లిఫ్ట్‌లో ఇరుక్కుని ఐదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మధురానగర్ పరిధిలో విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. బల్లి నర్సినాయుడు, ఐశ్వర్య దంపతులు ఎల్లారెడ్డిగూడలోని కీర్తి అపార్ట్‌మెంట్స్ జి–బ్లాక్‌లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు చైత్విక్, హర్షవర్ధన్ ఉన్నారు.
మధురానగర్ కాలనీలోని శ్రీనిధి స్కూల్‌లో చైత్విక్ ఒకటో తరగతి, హర్షవర్ధన్ (5) యూకేజీ చదువుతున్నారు. బుధవారం సాయంత్రం తల్లి ఐశ్వర్య కుమారులను స్కూల్ నుంచి ఇంటికి తీసుకు వచ్చింది. కొద్ది సేపటి తర్వాత తల్లి, ఇద్దరు కుమారులు లిఫ్ట్‌లో పైఅంతస్తుకు వెళ్లారు. ఐశ్వర్య, పెద్ద కుమారుడు చైతి్వక్ లిఫ్ట్ దిగి జి–బ్లాక్‌లోని ఇంట్లోకి వెళ్లారు. హర్షవర్ధన్ మాత్రం లిఫ్ట్ దిగలేదు.
ఈ క్రమంలో లిఫ్ట్ ముందుభాగంలో ఏర్పాటు చేసి స్ప్రింగ్ డోర్ మూసుకుపోయింది. అంతలోనే లిఫ్ట్ ఒక్కసారిగా కదిలి కిందికి వెళ్లింది. స్ప్రింగ్ డోర్, ఇనుపగేట్లు మధ్య బాలుడు ఉన్నాడు. అలాగే నాలుగు, ఐదు అంతస్తుల మధ్యకు లిఫ్ట్ వచి్చంది. దీంతో హర్షవర్ధన్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడంతో తొలుత పెద్దగా కేకలు వేశాడు. అనంతరం ఊపిరి ఆడక అచేతనంగా పడిపోయాడు.
తల్లి ఐశ్వర్య బయటికి వచ్చి చూడగా హర్షవర్ధన్ రెండు అంతస్తుల మధ్య ఇరుక్కుని ఉన్నాడు. ఆమె కేకలు వేయడంతో సెక్యూరిటీ గార్డు, చుట్టుపక్కల వారు వచ్చి బాలుణ్ని అతికష్టమ్మీద బయటకు తీశారు. 108లో ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు బాలుడు హర్షవర్ధన్ మృతి చెందినట్టు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉంది.


