మళ్లీ బయోమెట్రిక్‌ బాట

Biometric System In Social Welfare Hostels - Sakshi

వచ్చే నెల నుంచి సంక్షేమ హాస్టళ్లలో తిరిగి అమలుకు నిర్ణయం 

ఇప్పటికే ఉన్న మెషీన్లలో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేషన్‌కు ఏర్పాట్లు 

రెండు, మూడు రోజుల్లో అప్‌డేషన్, ట్రయల్స్‌ ప్రక్రియ పూర్తి 

మెషీన్లు లేని హాస్టళ్లలో కొత్తవి సమకూర్చేందుకు చర్యలు 

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ హాస్టళ్లలో బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని తిరిగి ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. కోవిడ్‌–19 పరిస్థితుల నుంచి కోలుకున్న అనంతరం అక్టోబర్‌లో సంక్షేమ హాస్టళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. ముందుగా పోస్టుమెట్రిక్‌ హాస్టళ్లను పూర్తిస్థాయిలో తెరిచిన సంక్షేమ శాఖలు.. క్రమంగా ప్రీమెట్రిక్‌ హాస్టళ్లను కూడా తెరిచాయి.

విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌లైన్‌ బోధన వినేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినప్పటికీ.. 90 శాతానికిపైగా విద్యార్థులు ప్రత్యక్ష బోధనవైపే మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా పోస్టుమెట్రిక్‌ తరగతుల విద్యార్థులు రోజువారీగా కాలేజీల్లో ప్రత్యక్ష బోధనకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో సంక్షేమ వసతిగృహాలను పూర్తిగా అందుబాటులోకి తెచ్చిన అధికారులు.. వచ్చే నెల నుంచి బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు. 

సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌.. 
సంక్షేమ వసతిగృహాల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానం ఇదివరకే అమల్లో ఉంది. అయితే కోవిడ్‌ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా విద్యా సంస్థలు మూతబడడం, వాటిని తిరిగి ప్రారంభించినప్పటికీ ఎక్కువ కాలం తరగతులు కొనసాగకపోవడంతో సంక్షేమ హాస్టళ్లను తెరవలేదు. కాగా, హైకోర్టు ఆదేశాల మేరకు గత నెల నుంచి గురుకుల విద్యా సంస్థలతో పాటు సంక్షేమ శాఖలకు సంబంధించిన కాలేజీ హాస్టళ్లను ప్రారంభించారు.

అప్పటినుంచి విద్యార్థుల హాజరును మాన్యువల్‌ పద్ధతిలో తీసుకుంటున్నారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో తాజాగా బయోమెట్రిక్‌ హాజరును కొనసాగించాలని నిర్ణయించారు. ఈ విధానం అమలుతో హాజరు నమోదు పక్కాగా ఉంటుందని భావించి ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖలకు చెందిన హాస్టళ్లలో బయోమెట్రిక్‌ మిషన్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.

వీటిని తిరిగి వినియోగంలోకి తేచ్చేందుకు చర్యలు చేపట్టిన అధికారులు.. టీఎస్‌టీఎస్‌ నుంచి సాంకేతిక సహకారాన్ని కోరారు. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేషన్‌తో పాటు ట్రయల్స్‌ చేపట్టి పూర్తిస్థాయి అమలుకు చర్యలు వేగవంతం చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెబుతున్నారు. కొన్నిచోట్ల బయోమెట్రిక్‌ మెషీన్లు లేకపోవడంతో అక్కడ కొత్తగా కొనుగోలు చేసి వినియోగంలోకి తేనున్నారు. మొత్తంగా డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి విద్యార్థులంతా వేలిముద్రలతో కూడిన హాజరును ఇవ్వాల్సి ఉంటుంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top