
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. గోపనపల్లి ప్రైవేట్ భూ వివాదం కేసులో రేవంత్‌కి వ్యతిరేకంగా, ఎన్ పెద్దిరాజు దాఖలు చేసిన ట్రాన్స్‌ఫర్ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్ సోమవారం డిస్మిస్ చేసింది. అదే సమయంలో..
పిటిషన్‌లో హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై పిటిషనర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గమనించిన సీజేఐ ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. పిటిషన్ రాసిన న్యాయవాది, సంతకం పెట్టిన ఏవోఆర్‌పై చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు జడ్జిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తూనే.. పెద్దిరాజు, ఆయన అడ్వకేట్ రితేష్ పాటిల్, ఏవోఆర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణకు పిటిషనర్ పెద్దిరాజు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే..
పిటిషనర్ తరఫు న్యాయవాది రితీష్ పాటిల్ క్షమాపణ కోరుతూ.. కేసు విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలంటూ నోటీసులు సీజేఐ గవాయ్ నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై తదుపరి విచారణ ఆగస్టు 11కు వాయిదా వేశారు.
ఏం జరిగిందంటే..
గోపన్‌పల్లి గ్రామం సర్వే నంబర్ 127లోని సొసైటీకి సంబంధించిన భూమిని ఆక్రమించడంతో పాటు నిర్మాణాలను జేసీబీతో కూల్చేశారంటూ గచ్చిబౌలి పీఎస్‌లో 2016లో కేసు నమోదైంది. పెద్దిరాజు ఫిర్యాదు మేరకు.. ఈ కేసులో ఏ-1గా కొండల్ రెడ్డి(రేవంత్ సోదరుడు), ఏ-2గా ఈ.లక్ష్మయ్య, ఏ-3గా రేవంత్ రెడ్డిని చేర్చారు. ఎల్బీ నగర్‌లోని రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును కొట్టేయాలని రేవంత్ రెడ్డి 2020లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది.
వాదనలు విన్న జస్టిస్ మౌషమీ భట్టాచార్య ధర్మాసనం.. రేవంత్ రెడ్డి ఘటనా స్థలంలో లేరనే విషయాన్ని ఫిర్యాదుదారు సైతం అంగీకరించారని పేర్కొంది. తాను లేను కాబట్టి తనపై కేసు కొట్టేయాలని అడుగుతున్నారని, మిగతా వారిపై కేసుకొట్టేయాలని అడగటం లేదని వ్యాఖ్యానించింది. రేవంత్‌రెడ్డి ఆదేశాలమేరకే దూషించారనే ఆరోపిస్తున్నా ఆధారాలు లేవని తెలిపింది. ఇదే భూమికి సంబంధించి ఇదే ఆరోపణలతో గచ్చిబౌలి పీఎస్‌లో 2014లో సైతం కేసు నమోదైందని, నిందితులు-సొసైటీకి మధ్య సివిల్ వివాదమని తేలడంతో తప్పుడు కేసుగా మూసేశారని గుర్తుచేసింది. దీనిపై ఫిర్యాదుదారు పెద్దిరాజు మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించగా.. కోర్టు దాన్ని కొట్టేసిందని, దానిపై క్రిమినల్ రివిజన్ పెండింగ్‌లో ఉందని పేర్కొంది. ఈ క్రమంలో.. జులై 18వ తేదీన రేవంత్‌రెడ్డిపై నమోదు అయిన కేసును కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది.