breaking news
peddiraju
-
సుప్రీం కోర్టులో రేవంత్‌రెడ్డికి ఊరట.. పెద్దిరాజుపై సీజేఐ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. గోపనపల్లి ప్రైవేట్ భూ వివాదం కేసులో రేవంత్‌కి వ్యతిరేకంగా, ఎన్ పెద్దిరాజు దాఖలు చేసిన ట్రాన్స్ఫర్ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్ సోమవారం డిస్మిస్ చేసింది. అదే సమయంలో.. పిటిషన్లో హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై పిటిషనర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గమనించిన సీజేఐ ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. పిటిషన్ రాసిన న్యాయవాది, సంతకం పెట్టిన ఏవోఆర్‌పై చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు జడ్జిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తూనే.. పెద్దిరాజు, ఆయన అడ్వకేట్ రితేష్ పాటిల్, ఏవోఆర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణకు పిటిషనర్ పెద్దిరాజు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే.. పిటిషనర్ తరఫు న్యాయవాది రితీష్ పాటిల్ క్షమాపణ కోరుతూ.. కేసు విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలంటూ నోటీసులు సీజేఐ గవాయ్ నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై తదుపరి విచారణ ఆగస్టు 11కు వాయిదా వేశారు.ఏం జరిగిందంటే.. గోపన్‌పల్లి గ్రామం సర్వే నంబర్ 127లోని సొసైటీకి సంబంధించిన భూమిని ఆక్రమించడంతో పాటు నిర్మాణాలను జేసీబీతో కూల్చేశారంటూ గచ్చిబౌలి పీఎస్‌లో 2016లో కేసు నమోదైంది. పెద్దిరాజు ఫిర్యాదు మేరకు.. ఈ కేసులో ఏ-1గా కొండల్ రెడ్డి(రేవంత్ సోదరుడు), ఏ-2గా ఈ.లక్ష్మయ్య, ఏ-3గా రేవంత్ రెడ్డిని చేర్చారు. ఎల్బీ నగర్‌లోని రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును కొట్టేయాలని రేవంత్ రెడ్డి 2020లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. వాదనలు విన్న జస్టిస్ మౌషమీ భట్టాచార్య ధర్మాసనం.. రేవంత్ రెడ్డి ఘటనా స్థలంలో లేరనే విషయాన్ని ఫిర్యాదుదారు సైతం అంగీకరించారని పేర్కొంది. తాను లేను కాబట్టి తనపై కేసు కొట్టేయాలని అడుగుతున్నారని, మిగతా వారిపై కేసుకొట్టేయాలని అడగటం లేదని వ్యాఖ్యానించింది. రేవంత్‌రెడ్డి ఆదేశాలమేరకే దూషించారనే ఆరోపిస్తున్నా ఆధారాలు లేవని తెలిపింది. ఇదే భూమికి సంబంధించి ఇదే ఆరోపణలతో గచ్చిబౌలి పీఎస్‌లో 2014లో సైతం కేసు నమోదైందని, నిందితులు-సొసైటీకి మధ్య సివిల్ వివాదమని తేలడంతో తప్పుడు కేసుగా మూసేశారని గుర్తుచేసింది. దీనిపై ఫిర్యాదుదారు పెద్దిరాజు మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించగా.. కోర్టు దాన్ని కొట్టేసిందని, దానిపై క్రిమినల్ రివిజన్ పెండింగ్‌లో ఉందని పేర్కొంది. ఈ క్రమంలో.. జులై 18వ తేదీన రేవంత్‌రెడ్డిపై నమోదు అయిన కేసును కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. -
సీబీఐ అధికారి పెద్దిరాజుకు జాతీయ అవార్డు
పాలకోడేరు: న్యూఢిల్లీ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రధాన కార్యాలయం సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డివిజన్లో పనిచేస్తున్న డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ బండి పెద్దిరాజు 2019 సంవత్సరానికి ‘కేంద్ర హోంమంత్రి మెడల్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్’ పురస్కారానికి ఎంపికయ్యారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేతులమీదుగా సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ సమక్షంలో శనివారం న్యూఢిల్లీ విజ్ఞాన భవన్లో జరిగిన ఆల్ ఇండియా సీబీఐ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ సమావేశంలో అవార్డును అందుకున్నారు. పెద్దిరాజు పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షం (బంటుమిల్లి) గ్రామానికి చెందినవారు. ఆయన 1993లో సీబీఐలో కానిస్టేబుల్‌గా చేరారు. 2008లో ఇండియా ఉత్తమ దర్యాప్తు అధికారి గోల్డ్ మెడల్, 2017లో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్–ఐపీఎం, 2014–2018లో రెండుసార్లు అత్యుత్తమ దర్యాప్తు అధికారి అవార్డులు, 2019లో డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎక్స్‌లెన్స్ అవార్డు పొందారు. -
ఆటో బోల్తా ..వ్యక్తి మృతి
వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలోని సూర్యపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పుట్లూరు నుంచి సూర్యపల్లి వెళ్తున్న ఆటో గ్రామం సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన పెద్దిరాజు(55) మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి.ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. -
పాముకాటుతో యువరైతు మృతి
వ్యవసాయ పనుల కోసం బావి వద్దకు వెళ్లిన వ్యక్తికి పాముకాటుకు బలయ్యాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏల్చూరు గ్రామానికి చెందిన పెద్దిరాజు(28) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. బావి వద్ద ఏదో కుట్టినట్లు అనిపించి.. ఇంటికి వచ్చేశాడు. ఇంతలోనే నొటి నుంచి నురగలు రావడంతో పాటు.. మృతి చెందాడు. పాము కాటుతోనే మృతి చెందాడని వైద్యులు ధృవీకరించారు. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.