బెలుగా భలేగా.. సరుకు రవాణాలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానం

Beluga plane once again landed at Shamshabad International Airport - Sakshi

శంషాబాద్‌: సరుకు రవాణాలో ప్రపంచంలోనే అతిపెద్దదైన బెలుగా విమానం మరోసారి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. వియత్నాం నుంచి ఈజిప్ట్‌ వెళ్తున్న ఈ విమానంలో ఇంధనం నింపడంతో పాటు పైలట్‌ల విశ్రాంతి కోసం సోమవారం అర్ధరాత్రి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేశారు. తిరిగి బుధవారం రాత్రి ఇక్కడి నుంచి ఈజిప్ట్‌కి బయలుదేరింది.

గతేడాది డిసెంబర్‌ 4 రాత్రి దుబాయ్‌ నుంచి భారీ సరుకుతో థాయ్‌లాండ్‌లోని పటాయా వెళుతూ ఇంధనం, విశ్రాంతి కోసం బెలుగా శంషాబాద్‌లో  ల్యాండ్‌ అయింది. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద సరుకు రవాణా విమానాల్లో ఈ ఎయిర్‌బస్‌ బెలుగా విమానం(ఏ300–600 సూపర్‌ ట్రాన్స్‌పోర్టర్‌) ఒకటి.

విమాన ఆకారం ఉబ్బె­త్తు తలతో ఉండే బెలుగా రకం తిమింగలాలను పోలి ఉండటంతో ఆ పేరుతో ఖ్యాతిగాంచింది. రష్యన్‌ భాషలో బెలుగా అంటే తెల్లని అని అర్థం. ప్రపంచంలో ఇవి ఐదు మాత్రమే ఉన్నాయి. 

ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో..
బెలుగా విమానం పొడవు 56.15 మీటర్లు, ఎత్తు 17.24 మీటర్లు, బరువు మోసుకెళ్లే సామర్థ్యం 47 వేల కేజీలు, బెలుగా విమానాల తయారీలో యూకే, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ ఏరోస్పేస్‌ కంపెనీలు పాలు­పంచుకున్నాయి.

కాగా, అతి పెద్ద కార్గో విమానాల్లో ఒకటైన అంటోనోవ్‌ ఏఎస్‌–225 మ్రి­యా కూడా ఇంధనం, విశ్రాంతి కోసం 2016, మే 13న శంషాబాద్‌ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయింది. అయి­తే రష్యా–ఉక్రెయిన్‌ యు­ద్ధంలో మ్రి­యా విమానం ధ్వంసమైంది. మ్రియా అంటే రష్యన్‌ భాషలో కల అని అర్థం. ప్రస్తు­తం మ్రియా లేకపోవడంతో కార్గోలో బెలు­గానే అతిపెద్ద విమానంగా గుర్తిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top