
కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నగరంలో పరిస్థితిని వీక్షిస్తున్న సీఎస్ రామకృష్ణారావు
అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వర్షాలు, వరదలతో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ప్రజలు, రైతులకు ఎలాంటి సాయమైనా అందించేందుకు అందుబాటులో ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై రెండు రోజులపాటు ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి.. హైదరాబాద్‌లో గురువారం భారీగా కురిసిన వర్షాలపై ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్, విద్యుత్ విభాగం అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. విపత్తు నిర్వహణ బృందాలను సంసిద్ధంగా ఉంచాలని సూచించారు.
కాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీఎస్ గురువారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.