బాసర ఆలయంలో భారీ చోరీ | Basara Gnana Saraswati Temple Robbery News Details | Sakshi
Sakshi News home page

బాసర జ్ఞానసరస్వతి ఆలయంలో భారీ చోరీ

Jun 23 2026 6:25 AM | Updated on Jun 23 2026 10:25 AM

Basara Gnana Saraswati Temple Robbery News Details

సాక్షి, నిర్మల్: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. ఆలయ ప్రాంగణంలోని పైఅంతస్తులో ఉన్న మహంకాళి ఆలయంలో అమ్మవారి వెండి కిరీటంతో పాటు హుండీని అపహరించారు. ఆలయ గేటును పగులగొట్టి మరీ చోరీకి పాల్పడటం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది.

సోమవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు ముందుగా గుడ్డలు కప్పిన దుండగులు అనంతరం మహంకాళి ఆలయ తలుపులు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. అక్కడ ఉన్న వెండి కిరీటం, హుండీని తీసుకెళ్లి నగదును కాజేసిన తర్వాత హుండీని వ్యాసగుడి సమీపంలో పడేసి పరారైనట్లు గుర్తించారు.

మంగళవారం తెల్లవారుజామున పూజలు, అభిషేక కార్యక్రమాల కోసం ఆలయ సిబ్బంది వెళ్లగా చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆలయ తలుపులు పగిలి ఉండటాన్ని గమనించిన అర్చకులు, సిబ్బంది లోపల పరిశీలించగా వెండి కిరీటం, హుండీ కనిపించకపోవడంతో వెంటనే దేవస్థాన అధికారులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ ఘటనాస్థలిని సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ఆ సమయంలో ఆమె వెంట భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఐపీఎస్, ఇన్‌స్పెక్టర్లు రవీందర్ నాయక్, సమ్మయ్య, ఎస్‌ఐలు, ఇతర పోలీసు సిబ్బంది, దేవస్థాన అధికారులు ఉన్నారు. చోరీ జరిగిన తీరుతెన్నులు, సేకరించిన ప్రాథమిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల పరిశీలన తదితర అంశాలపై అధికారులతో సమావేశమయ్యారు. కేసును అన్ని కోణాల్లో విచారించి నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్ట్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఘటనపై క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ సహాయంతో ఆధారాలు సేకరించిన పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఆలయ భద్రత కోసం రాత్రి వేళల్లో ఆరుగురు హోం గార్డులు విధుల్లో ఉన్నప్పటికీ దుండగులు చాకచక్యంగా చోరీకి పాల్పడటం భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ఆలయ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఎస్పీ సూచించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో నిఘాను పెంచడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

కేసు ఛేదన కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని, నిందితులను త్వరలోనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బాసర ఆలయంలో చోటుచేసుకున్న ఈ ఘటన భక్తుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement