
సాక్షి, బంజారాహిల్స్: ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ యువకుడు లంచ్‌కు తన ఇంటికి వచ్చిన యువతికి మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అనంతరం, ఆమె ఫోటోలు బయటపెడతానని బ్లాక్‌మెయిల్ చేస్తూ కోటి ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో, బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–7లో నివసించే మహేంద్రవర్ధన్ అనే యువకుడికి ఫేస్‌బుక్‌లో ఓ యువతి పరిచయమైంది. తాను ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థినని మహేంద్ర ఆమెను పరిచయం చేసుకున్నాడు. 2023 ఆగస్టు 15న ఇద్దరూ కలిసి మహేంద్ర ఇంటికి లంచ్ కోసం వచ్చారు. ఆ సమయంలో ఆమెకు మత్తు మందు ఇవ్వడంతో నిద్రలోకి జారుకుంది. అదే సమయంలో యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మెళకువ వచ్చి చూసుకునేసరికి బాధితురాలు జరిగిన విషయాన్ని గమనించి షాక్‌కు గురైంది.
ఈ విషయంలో మహేంద్రవర్ధన్ కొంతకాలంగా ఆమెను బ్లాక్‌మెయిల్ చేయసాగాడు. దీంతో ఆమె రూ.20 లక్షల వరకు చెల్లించుకుంది. ఫోటోలు బయటపెడతానని, బండారం అందరికీ తెలియజేస్తానని రోజురోజుకు నిందితుడి వేధింపులు పెరిగిపోవడంతో పాటు ఇటీవల రూ. కోటి ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై బీఎన్‌ఎస్ 64(1), 308 (2), 351 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.