
కోనరావుపేట(వేములవాడ): చిన్న చిన్న భేదాలతో పలకరింపునకు దూరమైన సొంత అన్నదమ్ములను బంధువు మరణం కలిపింది. వివరాలు.. కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన మామిండ్ల నాగయ్య, మామిండ్ల రామయ్య సొంత అన్నదమ్ములు. ఇద్దరికీ 64 ఏళ్లకు పైగా వయస్సు ఉంటుంది. ఒకే ఊరిలో ఉంటున్నా చిన్నచిన్న అభిప్రాయ భేదాలతో దశాబ్ద కాలంగా ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదు. వృద్ధాప్యానికి చేరువైనా రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ములు మాట్లాడుకోక పోవడం నాగయ్య కుమారుడు శ్రీనివాస్‌ను కలచివేసింది.
ఎలాగైనా ఇద్దరినీ కలపాలని శ్రీనివాస్ కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ, సఫలం కాలేకపోయాడు. ఇదిలా ఉండగా నాగయ్య, రామయ్యల మేనల్లుడు కూన తిరుపతి నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ నెల 18న మూడో రోజు కార్యక్రమం (పిట్టకు పెట్టుడు) నిర్వహించగా, అన్నదమ్ములిద్దరూ హాజరయ్యారు.
ఈక్రమంలో ఇద్దరినీ కలపాలని శ్రీనివాస్ భావించాడు. సోదరులు మామిండ్ల అంజయ్య, శ్రీనివాస్, రాజు, తిరుపతి, ఇతర బంధువులకు చెప్పడంతో వారు సహకారం అందించారు. నాగయ్య, రామయ్యకు బంధాల ప్రాధాన్యత వివరించారు. దీంతో ఇద్దరూ చెమర్చిన కళ్లతో ఆలింగనం చేసుకున్నారు. ఆత్మీయంగా పలకరించుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ ఘటన కుటుంబాల ఐక్యతకు ప్రతీకగా సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది.
సావుదలకు పట్టింపులెందుకు..
మేము వృద్ధాప్యంలోకి వచ్చాం. కాటికి కాలుజాపిన మాకు పట్టింపులు ఎందుకు. గతంలో చిన్నచిన్న కారణాలతో దూరమయ్యాం. ఇక నుంచి ఇద్దరం కలిసే ఉంటాం.
– మామిండ్ల నాగయ్య
పొరపాట్లను వదిలిపెట్టాం
మేము ఐదుగురం అన్నదమ్ములం. ముగ్గురు ఇదివరకే చనిపోయారు. మేమిద్దరం ఉన్నాం. ఉన్న ఇద్దరం కలిసుంటే బాగుంటుందని అనిపించింది. పదేళ్లుగా దూరంగా ఉంటున్న మేము చనిపోయేవరకు కలిసే ఉంటాం.
– మామిండ్ల రామయ్య