
వినూత్న ప్రక్రియకు రవాణా శాఖ శ్రీకారం
‘సారథి’ పోర్టల్ ద్వారా సాకారం
లెర్నింగ్ దశలోనే రహదారి భద్రతపై అవగాహన
10 నిమిషాల పాటు సూచనలు, సలహాలు
ఇప్పటికే సికింద్రాబాద్‌లో.. త్వరలో ఖైరతాబాద్, ఇతర ప్రాంతాలకు విస్తరణ
సాక్షి, హైదరాబాద్: డ్రైవింగ్ లైసెన్స్ కావాలా.. అయితే రహ దారి భద్రతపై పాఠం తప్పనిసరిగా వినాల్సిందే. పది నిమి షాల పాటు ఆడియో క్లాస్ వింటేనే స్లాట్ బుక్ చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చే వాహన దారులకు ప్రాథమిక దశలోనే రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు రవాణా శాఖ ఈ వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
లెర్నింగ్ లైసెన్స్ కోసం ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకునే వారికి మొదట రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తారు. ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టిన ‘సారథి’ సాంకేతిక వ్యవస్థకు అనుగుణంగా ఈ సరికొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ‘సారథి’ పోర్టల్ ఇప్పటికే సికింద్రాబాద్ ఆర్టీఏలో వినియోగంలో ఉంది. త్వరలో ఖైరతాబాద్‌తో పాటు గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతీయ రవాణా కేంద్రాలకు ‘విస్తరించనున్నారు.
‘సారథి’ నుంచే స్లాట్
వాహనదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన పౌర సేవలను అందజేసే దిశగా ఆర్టీఏ చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా వాహనాల వివరాలను నమోదు చేసేందుకు ‘వాహన్’ వెబ్ పోర్టల్‌ను కేంద్రం అమల్లోకి తెచ్చినట్లుగానే దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన వాహనదారుల డ్రైవింగ్ లైసె న్సుల వివరాలను నమోదు చేసేందుకు హైదరా బాద్ కేంద్రంగా ‘సారథి’ని ప్రవేశపెట్టారు. 6 నెలల కాలపరిమితి కలిగిన లెర్నింగ్ లైసెన్స్ కోసం సాధా రణంగా రవాణా శాఖ వెబ్ సైట్‌లో స్లాట్ నమోదు చేసుకోవాలి.
కానీ కొత్తగా ప్రవేశ పెట్టిన విధానంలో ‘సారథి’ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వాహనదా రులు లెర్నింగ్ లైసెన్స్ కోసం పోర్టల్‌ను తెరిచిన వెంటనే రోడ్ సేఫ్టీ పాఠం ఆడియో రూపంలో వినిపిస్తుంది. వాహనాలు నడి పేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చెబు తారు. సీట్‌బెల్ట్, హెల్మెట్ వంటి రక్షణ ఉపకరణాల ప్రాధాన్యాన్ని వివరిస్తారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల చోటుచేసుకుంటున్న ప్రమాదాల తీవ్రతను తెలియజేస్తారు. ప్రమాదకరమైన మొబైల్ డ్రైవింగ్‌పై ఆన్‌లైన్ ఆడియో పాఠం అప్రమత్తం చేస్తుంది.
ఇదంతా పూర్తిగా విన్న తర్వాత మాత్రమే స్లాట్ నమోదవుతుంది. ‘కారు, బైక్ వంటి ఏ వాహనాన్ని నడపాలను కున్నా కనీస అవగాహన ఉండాలి. అందుకే ఈ పద్ధతిని అమ ల్లోకి తెచ్చాం..’ అని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిష నర్ రమేశ్ తెలిపారు. లెర్నింగ్ లైసెన్స్ కోసం నిర్వహించే పరీక్షలో రోడ్డు, ట్రాఫిక్ రూల్స్‌పై వాహనదారుల అవగాహనను తెలుసుకునే ప్రశ్నలు మాత్రమే ఉంటాయని తెలిపారు.
లెర్నింగ్ లైసెన్స్ పొందిన తరువాత 30 రోజుల నుంచి 6 నెలల్లోపు ఎప్పుడైనా శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. ఆ వ్యవధిలో శాస్త్రీయమైన పద్ధతిలో డ్రైవింగ్ నేర్చుకొనేందుకు రవాణాశాఖ అవకాశం కల్పించింది. ఒకవేళ ఆ 6 నెలల కాలపరిమితిలో కూడా నేర్చుకో లేకపోతే మరో సారి లెర్నింగ్ లైసెన్స్ గడువును పెంచుకో వచ్చు. ఇందుకో సం వాహనదారులు ఆర్టీఏకు వెళ్లవలసిన అవసరం లేదు. నేరుగా ఆన్‌లైన్‌లోనే గడువు పొడిగింపును పొందవచ్చు.
లైసెన్స్ బదిలీకి ఎన్‌ఓసీ అవసరం లేదు..
» సారథి పోర్టల్ ద్వారా మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రవాణా శాఖ చర్యలు చేపట్టింది. సాధారణంగా ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు లేదా, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి డ్రైవింగ్ లైసెన్స్ బదిలీ చేసుకోవాలంటే సదరు కార్యాలయం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) తీసుకో వాలి. దీని ఆధారంగా కొత్త జిల్లా లేదా రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎన్‌ఓసీ అవసరం లేదు.
సార థిలో దేశంలోని అన్ని డ్రైవింగ్ లైసెన్స్‌ల డేటా మొత్తం నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి వాహనదారులు ఎక్క డైనా లైసెన్సులను తీసుకోవచ్చు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఈ సదుపాయం త్వరలో అందు బాటులోకి రానుంది. రవాణా శాఖ పౌర సేవల్లో మరింత వేగాన్ని, పారదర్శకతను పెంపొందించేందుకు ‘వాహన్’, ‘సారథి’ దోహద పడతాయని జేటీసీ వివరించారు.