
హైదరాబాద్: ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఆస్టర్ ప్రైమ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఫార్మసీ కాలేజి, పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల సహకారంతో మీ గుండె ఆరోగ్యం గురించి తెలుసుకోండి అనే థీమ్‌తో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇటీవలి కాలంలో యువతలో కూడా గుండె సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సమాజాన్ని చైతన్యవంతం చేయడమే ఈ ర్యాలీ ఉద్దేశం.

కొవిడ్-19 అనంతర కాలంలో ఒత్తిడి బాగా పెరిగిపోవడం, నిశ్చల పని సంస్కృతి, సమయానికి ఆహారం తినకపోవడం, శారీరక శ్రమ ఏమాత్రం లేకపోవడం లాంటి కారణాల వల్ల పెద్ద వయసు లేకుండానే గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయని ఈ కార్యక్రమంలో పలువురు తెలిపారు. అందువల్ల ప్రజలు ఎప్పటికప్పుడు తగిన ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకుంటూ సమయానికి మందులు తీసుకోవడం, జీవనశైలి మార్పులు చేసుకుంటూ ఉండాలని ఈ ర్యాలీ ద్వారా సందేశమిచ్చారు.

ఈ సందర్భంగా ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి సీఈఓ డాక్టర్ హరి కుమార్ రెడ్డి మాట్లాడుతూ, "గుండెవ్యాధులపై పోరాటంలో ముందస్తు వైద్యపరీక్షలే అత్యంత శక్తివంతమైన ఆయుధం. ప్రతి ఒక్కరూ సమతుల్య జీవనశైలి పాటిస్తూ, ప్రతిరోజూ శారీరక వ్యాయామం చేస్తూ, ఒత్తిడిని కూడా సమర్థంగా ఎదుర్కొనేలా ఉండాలి" అని సూచించారు.

ఈ ర్యాలీలో డాక్టర్ హరి కుమార్ రెడ్డి, డాక్టర్అనుపమ, డాక్టర్ సాయి రవిశంకర్ డాక్టర్ లంకా కృష్ణ, డాక్టర్ సుష్మారాణఙ సంగం, డాక్టర్ ఎంవీఎన్ సురేష్, ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రిసిబ్బంది పాల్గొన్నారు. ఇంకా సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఫార్మసీ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ అనుపమ నేతృత్వంలో కాలేజి విద్యార్థులు హాజరయ్యారు. వీరంతా కూడా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.

ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి, సుల్తాన్ ఉల్ ఉలూమ్ కాలేజి యాజమాన్యాలు పంజాగుట్ట పోలీసులు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారం వల్లనే సమాజంలో ముందస్తు ఆరోగ్యం గురించిన సమాచారాన్ని వ్యాప్తి చెందించగలిగామన్నారు. ఈ చొరవతో ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి సమాజంలో ప్రజలంతా తమ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ప్రాధాన్యం, తమ జీవితాలను కాపాడుకోవడంపై తమ నిబద్ధతను మరోసారి చాటిచెప్పింది.