వర్క్‌ ఫ్రం హోంకు మొగ్గు!

Asia Pacific Report Survey About Work Home Is Best Or Not - Sakshi

‘వర్క్‌ ఫ్రం హోం’కు అలవాటు పడ్డామన్న 66% మంది భారతీయులు

సహచరులను మిస్సవుతున్నామన్న కొందరు ఉద్యోగులు

రియల్‌ ఎస్టేట్‌ సంస్థ జేఎల్‌ఎల్‌ ‘ఆసియా పసిఫిక్‌ రిపోర్ట్‌’లో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుండటంతో ‘ఇంటి నుంచి పనిచేసే’విధానం మరికొంతకాలం కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ‘వర్క్‌ ఫ్రం హోం’పద్ధతికి అవకాశమున్న వివిధ రంగాల ఉద్యోగులు ఇప్పటికే ఇందుకు అలవాటుపడ్డారు. వారిలో చాలా మంది మరికొంతకాలంపాటు ఇదే విధానంలో పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. అమెరికా రియల్‌ ఎస్టేట్‌ సర్వీసెస్‌ కంపెనీ జోన్స్‌ లాంగ్‌ లా సాలే ఇన్‌కార్పొరేటెడ్‌ (జేఎల్‌ఎల్‌) ‘హోం అండ్‌ అవే: ది న్యూ హైబ్రిడ్‌ వర్క్‌ ప్లేస్‌?’పేరిట వెలువరించిన ఆసియా పసిఫిక్‌ రిపోర్ట్‌లో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

కొలీగ్స్‌ను మిస్సవుతున్నాం...
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు ఇంటి నుంచి పనికి అలవాటు పడినట్టుగా జేఎల్‌ఎల్‌ నివేదిక తెలిపింది. ఈ అధ్యయనంలో భాగంగా భారత్‌లో ‘వర్క్‌ ఫ్రం హోం’ పద్ధతిలో పనిచేస్తున్న వారిని వివిధ అంశాలపై అభిప్రాయాలను అడగ్గా 82 శాతం మంది ఇంటి నుంచి బయటకు వెళ్లలేకపోతున్నామని పేర్కొన్నారు. ఆఫీసులకు వెళ్లలేకపోవడం, ప్రత్యక్షంగా మిత్రులు, సహచరులను కలుసుకోలేకపోవడాన్ని బాధాకరమైన విషయంగా అభివర్ణించారు. కరోనా వ్యాప్తి కారణంగా విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌ వల్ల ఇంటి నుంచి పనికి నెమ్మదిగా అలవాటు పడ్డామని, ఆ తర్వాత వైరస్‌ ఉధృతి పెరగడంతో ‘వర్క్‌ ఫ్రం హోం’కోసం పూర్తిస్థాయిలో సిద్ధమయ్యామని 66 శాతం మంది భారతీయులు తెలియజేశారు. ప్రతిరోజూ కొత్త అనుభవాలు, పాఠాలు నేర్చుకోవడం ద్వారా క్రమం గా తామంతా ఈ పద్ధతికి అలవాటు పడ్డట్లు వివరించారు.

‘భారత్‌వ్యాప్తంగా ఉద్యోగులు ‘రిమోట్‌ వర్కింగ్‌ సిస్టమ్‌’కు సులభంగా మారిపోయారు. ఇంటి నుంచి పనిచేసే విధానానికి విస్తృత స్థాయిలో ఆమోదం లభిస్తోంది. దీనికి అనుగుణంగా ‘న్యూ వర్క్‌ప్లేస్‌ మోడళ్ల’ను ప్రాంతీ యంగా వివిధ కార్పొరేషన్లు రూపొందించుకోవాల్సి ఉంది. కానీ మేం మాట్లాడిన వారిలో చాలా మంది ఆఫీస్‌లో పని వాతావరణాన్ని, కొలిగ్స్‌ను కలుసుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు’ అని జేఎల్‌ఎల్‌ ఇండియా హెడ్, సీఈవో రమేశ్‌ నాయర్‌ పేర్కొన్నారు. ఈ సర్వేలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సర్వే చేపట్టగా సగటున 61 శాతం మంది వృత్తి నిపుణులు ఆఫీసులకు తిరిగి వెళ్లాలని కోరుకున్నట్లు చెప్పారు. అయితే భవిష్యత్తులో వర్క్‌ ఫ్రం హోం, ఆఫీసుల్లో పనిని కలగలిపి ’హైబ్రిడ్‌ మోడల్‌’విధానాన్ని సమర్థిస్తామని భారత్‌తోపాటు ఆసియా పసిఫిక్‌ వ్యాప్తంగా ఉద్యోగులు స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top