సాక్షి, ఉప్పల్: హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నా నిషేధిత చైనా మాంజా వాడకం మాత్రం తగ్గడం లేదు. సంక్రాంతి నేపథ్యంలో వరుస మాంజా ప్రమాదాలు.. వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఉప్పల్‌లో మాంజా తగిలి.. ఏఎస్‌ఐ మెడకు తీవ్ర గాయమైంది. దీంతో, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై వివరాల మేరకు.. నగరంలోని నల్లకుంట పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ నాగరాజు మాంజా కారణంగా గాయపడ్డారు. ఎగ్జిబిషన్ డ్యూటీ కోసం ఉప్పల్‌లోని తన ఇంటి నుంచి బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఉప్పల్ పీఎస్ పరిధిలోని సౌత్ స్వరూప్ నగర్ వద్ద మాంజా ఆయన మెడకు చుట్టుకుని గొంతుకు తీవ్ర గాయామైంది. వెంటనే ఆయనను ఎల్బీనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇక, అంతకుముందు.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేటకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చైతన్య అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేతికి మాంజా చుట్టుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆయన చేయి తెగింది. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని మాదాపూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే, చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, అవగాహన లోపంతో కొందరు వినియోగిస్తుండటంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. పతంగులు ఎగురవేసే సమయంలో మాంజా తెగి రోడ్లపై గాలిలో వేలాడుతూ వాహనదారులకు ముప్పుగా మారుతోంది. చైనా మాంజా కారణంగా గతంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు.


