వాహనాలతోపాటు పరిసరాలను గమనించాలి
త్వరలో ఇదే పోలీసు విభాగ నినాదం కానుంది
‘అరైవ్–అలైవ్’ప్రారంభోత్సవంలో డీజీపీ శివధర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ‘మన వాహనం, ఎదుటి వాహనాలతోపాటు చుట్టు పక్కల ఉన్న పరిసరాలనూ గమనిస్తూ చేసేదే డిఫెన్సివ్ డ్రైవింగ్. ప్రతి ఒక్కరికీ ఇదే తారక మంత్రం కావాలి. త్వరలో పోలీసుల నినాదంగానూ మారనుంది’అని డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారి భద్రతపై అవగాహన కలి్పంచడానికి ఉద్దేశించిన ‘అరైవ్–అలైవ్’కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం ఎల్‌బీ స్టేడియంలో లాంఛనంగా ప్రారంభించారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా దీనిని ఏర్పాటు చేశారు. దాదాపు ఐదు వేల మంది పాఠశాల, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. సినీ ప్రముఖులు బాబూమోహన్, ఆది, మోన, మనో తదితరులు అతిథులుగా హాజరయ్యారు.
రూల్స్‌తోపాటు కామన్ సెన్స్ ఉండాలి
రహదారి భద్రత అనేది అందరి సమస్య. రోడ్డు ప్రమాదాల ప్రభావం ప్రతి కుటుంబం మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉంటుంది. అందరి సమస్య అయిన దీనిని ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలి. మనకు రెండు చేతులు..ఒక్కో చేతికి ఐదు వేళ్లు ఉన్నాయి. ప్రాణం మాత్రం ఒక్కటే ఉంటుంది. అది పోతే తిరిగి రాదని గుర్తుంచుకోండి. ఓ కుటుంబం పెద్దను కోల్పోతే వారికి అయ్యే నష్టం చెప్పనలవి కానిది. వాహనం నడిపేప్పుడు కేవలం రూల్స్ పాటించడమే కాకుండా కామన్‌సెన్స్ కూడా వాడాలి.
– బి.శివధర్‌రెడ్డి, డీజీపీ
ఉల్లంఘనులపై ఇక కఠిన వైఖరి
ఇకపై రహదారి నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగుతాయి. ఉల్లంఘనల్ని బట్టి చలాన్ జారీ చేయడమో, వాహనం స్వా«దీనం చేసుకోవడమో చేస్తారు. జీవన్‌దాన్ పథకం అమలులో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. ఇలాంటి అవయవాలు రవాణా చేస్తున్న వాహనాలకు గ్రీన్ చానల్ ఏర్పాటు చేయడంలో హైదరాబాద్ పోలీసులు దేశానికే రోల్ మోడల్ అయ్యారు. – సజ్జనార్, హైదరాబాద్ సీపీ
రూల్స్‌ను మన కోసమే పాటించాలి:
రహదారి భద్రత నిబంధనల్ని పోలీసు కోసం కాకుండా మనకోసమే పాటించాలి. సినిమాల్లో హీరోలు యాక్షన్ సీన్లు చేసేప్పుడు స్టంట్ మాస్టర్, రోప్స్, అంబులెన్స్‌లు అన్నీ తెర వెనుక ఉంటాయి. రియల్ లైఫ్‌లో హెల్మెట్, సీట్‌బెల్ట్, స్పీడ్ కంట్రోల్ ఇవే ఉండాలి. ప్రమాద బాధితుల్ని వీడియో తీయడం కాదు.. వారిని కాపాడి, వారికి సహాయం చేసి హీరోలు కండి. – శర్వానంద్, సినీ నటుడు


