
టోకెన్ల కోసం రైతుల మధ్య వాగ్వాదం
ఓపిక నశించి రోడ్లపైకి వచ్చి ఆందోళనలు
ఆదిలాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతుల భిక్షాటన.. మంచిర్యాల జిల్లాలో రైతులకు కుర్చీలు వేసి యూరియా పంపిణీ
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క బస్తా యూరియా దొరికినా మహాభాగ్యం అనుకుంటూ రాత్రి, పగలు క్యూలైన్లలో అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. కొన్నిచోట్ల ఓపిక నశించి ఆందోళనలకు దిగుతున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలోని రైతు వేదిక ఎదుట బుధవారం యూరియా టోకెన్ల కోసం రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కొందరు రైతు వేదికలోకి చొచ్చుకెళ్లి ఫరి్నచర్ ధ్వంసం చేశారు.హనుమకొండ జిల్లా పరకాలలో టోకెన్లు ఇచ్చి యూరియా పంపిణీ చేయకపోవడంతో వ్యవసాయ మార్కెట్ ఎదుట ఆందోళన చేశారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కె)లో రైతులు బుధవారం యూరియా కోసం భిక్షాటన చేస్తూ ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో బుధవారం సాయంత్రం రైతు సాయిల్ల రాజమల్లు యూరియా బస్తా కోసం లైన్‌లో నిలబడి సొమ్మసిల్లి పడిపోయాడు. తోటి రైతులు వెంటనే రాజమల్లును ఆసుపత్రికి తరలించారు. కాగా, మంచిర్యాల జిల్లా దండేపల్లి నెల్కి వెంకటాపూర్ పీఏసీఎస్ వద్ద రైతులకు కుర్చీలు వేసి కూర్చోబెట్టి యూరియా పంపిణీ చేశారు. రెండో విడతలో పంటకు యూరియా ఎంత మోతాదులో వేయాలనే దానిపై అధికారులు అవగాహన కూడా కల్పించారు.
యూరియా బారులు
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్‌లోని మన గ్రోమోర్ కేంద్రం వద్ద సుమారు 400 ఫీట్ల వరకు రైతులు పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఆధార్‌కార్డు జిరాక్స్ ప్రతులు లైన్‌లో ఉంచి నిరీక్షించారు. ఈ కేంద్రానికి 666 బస్తాల యూరియా రాగా ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. – సాక్షి స్టాఫ్ ఫొటో గ్రాఫర్ సూర్యాపేట