
మావోల నాయకత్వాన్ని తుద ముట్టించేలా ఎన్‌కౌంటర్లు
ఇప్పటికే 9 మంది కేంద్ర కమిటీ సభ్యుల మరణం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సగానికి పైగా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పటికైనా మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజు ఇటీవల ప్రకటించారు. ‘మరోవైపు తలను తీసేస్తే కాళ్లు చేతులు ఏ పనీ చేయలేవు.. అందుకే మేము కిందిస్థాయి కేడర్ కంటే పైస్థాయిలో ఉన్న పెద్ద తలలే టార్గెట్‌గా యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ చేపడుతున్నాం’అని నారాయణ్‌పూర్ ఎస్పీ రాబిన్‌సన్ గుడియా ఇటీవల మీడియాకు వెల్లడించారు.
పోలీస్ బాస్‌ల ప్రకటనలకు తగ్గట్టుగానే ఏడాది కాలంలో ఏకంగా తొమ్మిది మంది కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయారు. దీంతో 2026 మార్చి 31 కంటే ముందుగానే మావోయిస్టులు అంతమైపోతారనే వాదనలు జోరందుకున్నాయి.
మృతుల్లో తొలితరం నేతలే
కొండపల్లి సీతారామయ్య పీపుల్స్‌వార్ పార్టీని స్థాపించిన తొలినాళ్లలోనే ఉత్తర తెలంగాణ, దండకారణ్యం పర్‌స్పెక్టివ్ దృష్టితో పార్టీకి గెరిల్లా జోన్లు విస్తరించే పనిపై దృష్టి పెట్టారు. 1980లో బస్తర్ పంపిన తొలి బ్యాచ్‌లో కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోసా ఉండగా 1985–86లో పంపిన రెండో బ్యాచ్‌లో కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజు దాదా అలియాస్ వికల్ప్ ఉన్నారు. ఇందులో వికల్ప్, ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో వాసు పేరుతో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే మైదాన ప్రాంతాల్లో పార్టీకి కావాల్సిన అండదండలు అందిస్తూ వచ్చారు.
ఆ తర్వాత కాలంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పటి వరకు మావోయిస్టుల అగ్రనేతలు, కేంద్ర కమిటీకి సంబంధించిన ప్రస్తావనలో ఎక్కువగా 80వ దశకంలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన వారి పేర్లే ఎక్కువగా తెర మీదకు వస్తున్నాయి. అయితే, వీరి తర్వాత కాలంలో పూర్తిగా రహస్య ఆపరేషన్లు చేపట్టే బ్యాచ్ ఒకటి దండకారణ్యం వెళ్లినట్టు తెలుస్తోంది.
కరోనా తర్వాత నష్టాలు
కరోనా సెకండ్ వేవ్ తర్వాత మావోయిస్టు పార్టీ స్థితిగతుల్లో మార్పులు ఎక్కువగా వచ్చాయి. ఆపరేషన్ సమాధాన్–ప్రహార్‌తో మావోయిస్టుల సప్‌లై చెయిన్‌పై పోలీసుల నిఘా పెరిగింది. మరోవైపు వాయుమార్గంలో దాడులు కూడా ప్రారంభమయ్యాయి. వెరసి నిర్బంధం తీవ్రం కావడం, కరోనా కష్టాలతో పరిస్థితులు మారిపోవడం మొదలైంది.
» అనారోగ్య కారణాలతో రమణ, హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ, రామకృష్ణ అలియాస్ ఆర్కే, కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్‌లు మరణించారు.
» ఆ తర్వాత 2021లో మహారాష్ట్రలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మిలింద్ బాబురావు తేల్‌టుంబే చనిపోయాడు. ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత ఏకంగా తొమ్మిది మంది కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయారు.
» బెంగాల్ నుంచి ప్రశాంత్‌బోస్, శీలామరాండీలు 2021లో లొంగిపోగా ఇటీవల పోతుల కల్పన అలియాస్ సుజాత కూడా లొంగిపోయింది. మొత్తంగా కరోనా తర్వాత 17 మంది కేంద్ర కమిటీ సభ్యులను ఆ పార్టీ కోల్పోయింది.