హాహాకారాలు.. ఆర్తనాదాలు
బస్సు ఫిట్‌నెస్ లేకపోవడమే కారణమా?
పాల్వంచ కేఎల్‌ఆర్ కళాశాల
బస్సు బోల్తా
సుమారు 40 మంది విద్యార్థులకు గాయాలు
తీవ్రంగా గాయపడ్డ ఐదుగురు విద్యార్థులు
అశ్వాపురం: మండల పరిధిలోని మొండికుంట గ్రామశివారు ఎర్రమ్మగుడి సమీపంలో మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారి వెంబడి వంతెన వద్ద పాల్వంచకు చెందిన కేఎల్‌ఆర్ కళాశాల బస్సు బోల్తాపడింది. పినపాక, మణుగూరు, అశ్వాపురం మండలాల విద్యార్థులతో మణుగూరు నుంచి బయలుదేరిన బస్సు మొండికుంట గ్రామం దాటాక అటవీ ప్రాంతంలో బస్సు స్టీరింగ్ సక్రమంగా పనిచేయక అదుపు తప్పి వాగు, వంతెన పక్కకు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. ప్రమాదంలో 40 మందికిపైగా విద్యార్థులకు గాయాలయ్యాయి. ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా ఇద్దరికి చేతులు విరిగాయి. మిగిలినవారు స్వల్పంగా గాయపడ్డారు. సీఐ అశోక్‌రెడ్డి, ఎస్సై రాజేష్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను 108 వాహనాల్లో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులు గాయాలతో భద్రాచలం ఏరియా వచ్చారని, ఎవరికీ ప్రాణాపాయ పరిస్థితి లేదని వైద్యులు తెలిపారు. కాగా విద్యార్థులంతా డిప్లొమా, బీటెక్ కోర్సులు చదువుతున్నారు.
చేయి ఇరుక్కుని విలవిల్లాడిన విద్యార్థి
బోల్తా పడిన బస్సులో మణుగూరుకు చెందిన డిప్లొమా విద్యార్థి అంబికా చేయి బస్సులో ఇరుక్కుని విలవిలలాడింది. 30 నిమిషాలకు పైగా విద్యార్థి బస్సులో ఉండిపోయింది. చేయి నొప్పితో విద్యార్థి రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. జేసీబీల సహాయంతో పోలీసులు, స్థానికులు విద్యార్థినిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
తప్పిన పెను ప్రమాదం
మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారిపై ఎర్రమ్మగుడి సమీపంలో వంతెన వద్ద బస్సు బోల్తా పడింది. రెప్పపాటులో బస్సు వాగులో బోల్తాపడేది. బస్సువాగులో బోల్తా పడితే పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాపాయం ఉండేది. వాగును చూసిన స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.
కన్నీరు మున్నీరుగా విలపించిన తల్లిదండ్రులు
పిల్లలు ప్రయాణిస్తున్న బస్సు బోల్తాపడిందని సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు బయ్యారం, మణుగూరు, అశ్వాపురం తదితర ప్రాంతాల నుంచి సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. గాయాలైన విద్యార్థులను చూసి తల్లిడిల్లిపోయారు.
స్థానికుల సహాయక చర్యలు
పోలీసులతోపాటు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. స్థానికులు జేసీబీలు తెప్పించి బస్సులో ఇరుక్కున్న విద్యార్థినిని రక్షించారు. పోలీసుల సేవలను స్థానికులు శభాష్ అంటున్నారు.
ఎమ్మెల్యే పాయం దిగ్బ్రాంతి
ప్రమాదంపై పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఎమ్మెల్యే ప్రమాద ఘటన వివరాలు తెలుసుకున్నారు. భద్రాచలం ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌తో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అవసరమైతే ఖమ్మం, హైదరాబాద్ తరలించాలని, విద్యార్థుల పరిస్థితి ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు.
ఇద్దరిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు
భద్రాచలంటౌన్: ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించారు. మొత్తం 36 మంది విద్యార్థులు గాయపడగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు చెబుతున్నారు. వీరిలో స్పందన, హిర్మాయి, పూర్ణిమ ప్రస్తుతం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో అంబిక చేయి నుజ్జునుజ్జయి రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అలాగే, బస్సు క్లీనర్ నర్సింహరావుకు ఛాతీ ఎముక విరగడంతో శస్త్రచికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి ఆర్‌ఎంఓ రాజశేఖర్‌రెడ్డి వెల్లడించారు. ఆస్పత్రికి చేరుకున్న తల్లిదండ్రులు తమ పిల్లల పరిస్థితి చూసి కన్నీరుమున్నీరవగా రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య పరామర్శించారు.
మా బస్సు ఇది కాదు. రోజు ఈ బస్సు రాదు. అప్పుడప్పుడు వస్తుంది. ఈ బస్సు సమస్య ఉందని ఎప్పటి నుంచో అంటున్నారు. బస్సు స్టీరింగ్ స్టక్ అయి ప్రమాదం జరిగింది. బస్సులో 40 మందికి పైగా ఉన్నాం.
– కృష్ణమనోహర్, విద్యార్థి
బస్సు ఫిట్‌నెస్ లేకనే ప్రమాదం జరిగింది. సరైన బస్సులు నడపక కళాశాల యాజమాన్యం మా పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఫీజులు రూ. లక్షల్లో వసూలు చేస్తూ బస్సులను పట్టించుకోవడం లేదు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. – శ్రీనివాసరావు, విద్యార్థి తండ్రి
బస్ ఫిట్‌నెస్ లేకపోవడమే ప్రమాదానికి కారణమని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు భావిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉందని ఆరోపిస్తున్నారు. మరమ్మతులకు గురైన బస్సు కావడంతో స్టీరింగ్ స్టక్ అయి ప్రమాదం జరిగినట్టు సమాచారం. కళాశాల యాజమాన్యం స్టీరింగ్ కూడా సక్రమంగా లేని బస్సుతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్, కళాశాల యాజమాన్యం, సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రాజేష్ తెలిపారు.
హాహాకారాలు.. ఆర్తనాదాలు
హాహాకారాలు.. ఆర్తనాదాలు
హాహాకారాలు.. ఆర్తనాదాలు
హాహాకారాలు.. ఆర్తనాదాలు
హాహాకారాలు.. ఆర్తనాదాలు


