పురుషోత్తపట్నంలో రాపత్తు సేవ
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామివారికి వైకుంఠ ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తు సేవలు వైభవంగా జరుగుతున్నాయి. భద్రాచలం రామయ్యకు శుక్రవారం ఏపీలోని పురుషోత్తపట్నంలో రాపత్తు సేవ జరిపారు. ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని మంగళవాయిద్యాలు, భక్తుల శ్రీరామనామస్మరణ నడుమ వేడుకగా గ్రామానికి తీసుకెళ్లారు. దమ్మక్క స్వగ్రామమైన పురుషోత్తపట్నంవాసులు కోలాటాలుతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
స్వర్ణకవచాలతో మూలమూర్తుల దర్శనం
దేవస్థానంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచాలంకరణతో భక్తులకు దర్శనం ఇచ్చారు. నిత్యకల్యాణం నిమిత్తం బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. ఆతర్వాత కల్యాణంలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రతీ శనివారం భద్రగిరిలో నదీ హారతి
సూపర్‌బజార్(కొత్తగూడెం): భద్రాచలంలో శనివారం సాయంత్రం గోదావరి నదీహారతి నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. గోదావరి నది అనేక సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి కేంద్రంగా నిలిచిందని పేర్కొన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిర్వహించిన ‘ఏరు – ది రివర్ ఫెస్టివల్’లో భాగంగా ప్రారంభించిన నదీ హారతి కార్యక్రమాన్ని ప్రతీ శనివారం నిర్వహించనున్నట్లు తెలిపారు. గోదావరి నది ఔన్నత్యాన్ని ప్రజలకు మరింతగా తెలియజేయడం, ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం, పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సహించేలా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల వారు పాల్గొనాలని కలెక్టర్ ఓ ప్రకటనలో కోరారు.
స్వర్ణకవచాలతో శ్రీసీతారామ
చంద్రస్వామివారి దర్శనం


