యాష్ సొసైటీల కొట్లాట..
● సిండికేట్ కావాలంటూ సొసైటీలపై ఒత్తిడి ● తరచుగా గొడవలు.. పోలీసులకు ఫిర్యాదు
పాల్వంచ: కేటీపీఎస్ కర్మాగారంలో అత్యధిక బూడిద నిల్వలు ఉండటంతో వాటిని బయటకు పంపించేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. స్థానికంగా 110 మంది గిరిజన సొసైటీ సభ్యులకు బూడిద తరలించేందుకు అనుమతులు ఇవ్వడంతో వర్గాల మధ్య నిత్యం ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని రోజులుగా ఎవరికి వారు కాకుండా సిండికేట్ కావాలంటూ కొందరు, మిగితావారిపై ఒత్తిడి తేవడం, అడ్డుకోవడం, గొడవలకు దిగడం, లారీలను ఆపడం, పుస్తకాలు, స్లిప్పులను గుంజు కుని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వర్గాలుగా మారి గొడవలు పడుతూ పోలీసులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు. రోజువారీగా డయల్ 100కు అనేక మంది ఫిర్యాదు చేస్తున్నారు.
సిండికేట్‌కు సహకరించడం లేదని..
కేటీపీఎస్ 5, 6, 7 దశల కర్మాగారంలో ఉన్న బూ డిద తరలింపు కోసం సొసైటీలు అన్ని సుమారు 20 కంపెనీల చేతుల్లోకి వెళ్లాయి. వీరందినీ సిండికేట్ అయి ధర పెంచి అమ్ముకునేందుకు కొందరు వ్యక్తు లు ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం జెన్‌కో సంస్థ టన్ను రూ.50 ధర చొప్పున అందిస్తుండగా, నిర్వాహకులు రూ.30 కలపడంతో రూ.80 అవుతుంది. ఇక దీని ధర మార్కెట్‌లో రూ.200 వరకు అమ్ముతున్నారు. అయితే సిండికేట్ అయి ధరను పెంచి అమ్మాలనే విషయంపై వారి మధ్య సయోధ్య కుదరడం లేదు. సిండికేట్ అయితే ఇప్పటి వరకు ఈ బూడిదపై ఆధారపడి ఉన్న అనేక మంది నష్టపోయే అవకాశం ఉంది.
ఘర్షణలకు దిగుతున్న వారిపై చర్యలు శూన్యం
అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే లారీలను యాష్ పాండ్‌ల వద్ద, గేటుల వద్ద గంటల తరబడి అడ్డుకుని, ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వారి ఆగడాలకు అంతులేకుండా పోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పుస్తకాలు లాక్కుని, ఘర్షణలకు దిగు తున్నా పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే అనేక మంది వర్గాలవారీగా పోలీసులకు సైతం ఫిర్యాదు చేసుకున్నారు. ఇక లారీలు యాష్ పాండ్‌లకు వెళ్లేందుకు సరైన రహదారి కూడా లేదు. ఇక కర్మాగారంలో వందలాది ఎకరాల స్థలం ఉన్నా వచ్చే లారీలకు పార్కింగ్ స్థలం చూపించడం లేదు. దీంతో అల్లూరి సెంటర్ నుంచి కరకవాగు వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర రోడ్డు పక్కనే నిలుపుతుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లారీలపై సరైన పట్టాలు కప్పక పోవడంతో గాలికి బూడిద అధికంగా స్థానికులపై, ఇతర వాహనదారులపై పడుతుండటంతో అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై 5, 6 దశల సీఈ ఎం.ప్రభాకర్‌రావును వివ రణ కోరగా సమస్య తన దృష్టికి రాలేదన్నారు.


