‘పాడితే కంఠనాళం తెగి పడాలి..పల్లవితో అంటుకునే అగ్ని కావాలి' అని చెప్పడమే కాదు, ఆ పాటతోనే ఉద్యమాన్ని రగిలించిన ప్రముఖ రచయిత, కవి, గాయకుడు అందెశ్రీ (64) ఇకలేన్న వార్త యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజల్ని దిగ్భ్రాంతిలో ముంచేసింది. తన పదునైన గీతాలతో అగ్గి రగిలించిన అందెశ్రీ, ‘పరుగెత్తు నా పాట ప్రజల నోట’ అని గర్జిస్తూనే ఆమాటల్ని అక్షర సత్యం చేసుకున్న కారణ జన్ముడు అందె శ్రీ అంటే అతిశయోక్తి కాదు. సహజకవికోకిల, తెలంగాణా ఆత్మగౌరవ ప్రతీక ఎల్లన్నకు వేనవేల వందనాలు అంటూ తెలంగాణా సమాజం ఆయనకు అశ్రు నివాళులర్పిస్తోంది.
1961, జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు అదెశ్రీగా ప్రఖ్యాతి పొందిన అందె ఎల్లయ్య. గొర్రల కాపరిగా, తాపీమేస్త్రీగా కష్టాలను మర్చిపోయేందుకు పాడిన పాటలే ఆయనను ప్రజాకవిగా, గాయకుడిగా తీర్చదిద్దాయి. పోరాట పంథాను నేర్పాయి. ప్రశ్నించే తత్వాన్ని ఒంట బట్టించాయి. “పల్లెనీకు వందానాలమ్మో”, ‘'సూడా సక్కాని తల్లీ.. చుక్కల్లో జాబిల్లి‘' 'కొమ్మచెక్కితే బొమ్మరా... కొలిచి మొక్కితే అమ్మరా'’ “మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు” లాంటి మహత్తరమైన గీతాలు ఆసువుగా ఆయన గళం నుంచి జాలువారాయి. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ”ను రచించేదాకా ఆయన ప్రస్థానం ముక్కోటి జనాలు జనకేతనంగా మారింది.
తాపి మేస్త్రీగా అందెశ్రీ అనుభవం తెలంగాణా రాష్ట్రానికి ఇటుకలు పేర్చింది. పశువుల కాపరిగా దారి తప్పిన మందను అదిలించి జూలు విదిల్చేలా చేసింది. ఫలింగా తానే అందరినోటా పాటై పరవశిస్తున్నాడు. దగా పడిన తెలంగాణాకోసం కవిగా, కళాకారుడిగా తెలంగాణా పోరాటంలో అలుపెరుగని పోరు సల్పి తెలంగాణా పల్లెపల్లెలోనూ పల్లవించిన ఆయన మాటకు , పాటకు మరణంలేదు.
ఈ ప్రపంచంలోని మిసిసిపి, మిజోరి, అమేజాన్, నైలు వంటి మహానదుల వెంట గాలిలో గీతమై సాగిపోయాడు. ఇంగ్లీషు భాష పరిచయం లేకపోతేనేం పాటతోనే దేశాలు చుట్టొచ్చారు. ప్రపంచ నదులు ప్రవాహంలో, సంగమాలను ప్రేమించిన మట్టి మనిషి కదూ అందెశ్రీ. అమెజాన్ నదీ జన్మస్థలం, మిసిసిపి, నైలు, కాంగో, జాంబేజీ నదులను స్పృశించి తరించాడు. ‘‘నది నడిచిపోతున్నదమ్మ.. నన్ను నావనై రమ్మన్నదమ్మ గొంతెత్తడం ఆయనకు మాత్రం సాటి.
చివరి కోరిక తీరకుండానే
జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అందెశ్రీకి ఆయనకు కోటి రూపాయల నజరానా అందించింది. అలాగే ఇంటి నిర్మాణానికి 348 గజాల స్థలాన్ని కూడా కేటాయించింది. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మున్సిపాలిటీ ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో కొత్త ఇంటి నిర్మాణ పనుల్లో ఉన్నారు. ఇంటినిర్మాణం దాదాపు పూర్తి కావస్తున్న తరుణంలో ఆయన కలల సౌధాన్నిచూసుకోకముందే కన్నుముశారంటూ అందెశ్రీ బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. చివరి కోరిక తీరకుండానే వెళ్లిపోయావా మల్లన్నా అంటూ సన్నిహితులు కంట తడి పెడుతున్నారు.
అందెశ్రీని వరించిన పురస్కారాలు
ఇతనికి కాకతీయ యూనివర్శిటీ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది.
'ప్రకృతే నా పాఠశాల, వల్లే నా పంతులు' తెలిపినాడు.
గణపతి సచ్చిదానంద స్వామిచే స్వర్ణ కంకణం పొందాడు.
2006లో గంగ సినిమాకు గాను నంది పురస్కారం లభించింది.
2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్.
2015లో దాశరథి సాహితీ పురస్కారం
2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం
2022లో అందెశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం
2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం
లోక్ నాయక్ పురస్కారం
కాగా నవంబరు 10, కార్తీక సోమవారం ఉదయం 64 ఏళ్ల అందెశ్రీ తుదిశ్వాస వదిలారు. అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.


