అజీత్‌ను ఎందుకు సాగనంపారు? | Ajith Reddy transferred from key responsibilities to non priority department in CMs office | Sakshi
Sakshi News home page

అజీత్‌ను ఎందుకు సాగనంపారు?

Jun 28 2026 1:04 AM | Updated on Jun 28 2026 1:04 AM

Ajith Reddy transferred from key responsibilities to non priority department in CMs office

సీఎం పేషీలో కీలక బాధ్యతల నుంచి ప్రాధాన్యం లేని విభాగానికి బదిలీ

అజీత్‌ సూచనలను తేలిగ్గా తీసుకున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు 

నాన్‌ ఐఏఎస్‌ అధికారి కావడంతో ఆయన ఆదేశాలను లెక్కచేయని సీనియర్‌ ఐఏఎస్‌లు

శైలజా రామయ్యర్‌ను బదిలీ చేసినట్టే చేసి మళ్లీ అదే శాఖలో అదనపు బాధ్యతలు

ఐటీ, పరిశ్రమల శాఖల స్పెషల్‌ సీఎస్‌గా కొత్త సీఎస్‌కు ‘అదనపు’ భారమే

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి, ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్‌ సర్వీసెస్‌ (ఐడీఎస్‌) అధికారి బి.అజీత్‌ రెడ్డిని తప్పించి ప్రాధాన్యం లేని పోస్టుకు బదిలీ చేయడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎంగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే తనకు నమ్మకస్తుడిగా వ్యవహరిస్తారనే నమ్మకంతో అజీత్‌రెడ్డిని కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్‌పై రప్పించుకుని సీఎం పేషీలో ప్రత్యేక కార్యదర్శి హోదాతోపాటు కీలక సబ్జెక్టులనూ అప్పగించారు. రేవంత్‌ రెడ్డి భద్రత, అపాయింట్‌మెంట్లు, సీఎంఓ పాలనా వ్యవహారాలతోపాటు ఇంధన, విద్య, పరిశ్రమలు, ఐటీ, కార్మిక శాఖలను ఇప్పటివరకు అజీత్‌ పర్యవేక్షించారు. 

రేవంత్‌ మల్కాజ్‌గిరి ఎంపీగా వ్యవహరించిన సమయంలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు సీఈఓగా కొంతకాలం అజీత్‌ పనిచేశారు. ఈ సమయంలో అజీత్‌ పట్ల కలిగిన నమ్మకం ఆధారంగా ఆయనకు ప్రభుత్వంలో అత్యంత కీలక బాధ్యతలు అప్పగించినట్టు అప్పట్లో చర్చ జరిగింది. రెండున్నరేళ్లుగా రేవంత్‌ ప్రభుత్వంలో అజీత్‌ రెడ్డి కీలక పాత్రపోషించారు. ఉన్నట్లుండి ఆయన్ను సీఎంఓ నుంచి బయటకి పంపించడంతో కారణాలు ఏముంటాయని ప్రభుత్వ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది.

ఐఏఎస్‌లు లెక్క చేయడం లేదనేనా? 
సీఎం ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నా అజీత్‌రెడ్డిని కొందరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు లెక్కచేయడం లేదనే చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి వద్దే విద్యాశాఖ ఉండగా, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి యోగితా రాణా.. అజీత్‌ సూచనలను తేలిగ్గా తీసుకునేవారని తెలుస్తోంది. అజీత్‌ నాన్‌ ఐఏఎస్‌ కావడంతో మరికొంత మంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు సైతం ఆయన నుంచి ఆదేశాలు తీసుకోవడానికి ఇష్టపడ లేదని సమాచారం. 

మరోవైపు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సీనియర్‌ అధికారి ఒకరు అజీత్‌రెడ్డితో ఉన్న బంధుత్వాన్ని వినియోగించుకుని పైరవీలు చేస్తున్నట్టు సీఎం దృష్టికి వచ్చిందనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే అజీత్‌రెడ్డికి చెక్‌పెట్టాలనే ఉద్దేశంతో ఆయన్ను సీఎంఓ నుంచి బయటకు పంపించినట్టు చర్చ జరుగుతోంది. శుక్రవారం పెద్ద సంఖ్యలో ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం అజీత్‌ రెడ్డిని పరిశ్రమల శాఖ పరిధిలోని ఇన్వెస్ట్‌ తెలంగాణ విభాగం సీఈఓగా ప్రాధాన్యత లేని పోస్టులో నియమించింది. 

హైదరాబాద్‌ మెట్రో రైలు అదనపు ఎండీగా ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ శనివారం మరో ఉత్తర్వులు వెలువడ్డాయి. సీఎంఓ నుంచి సాగనంపడం పట్ల ఆయన కినుక వహించడంతో ప్రభుత్వం ఆయనకు మరో పోస్టు సైతం కట్టబెట్టినట్టు చర్చ జరుగుతోంది. 

సీఎంఓలో మరో వికెట్‌ 
సీఎంఓలో శనివారం మరో వికెట్‌ పడింది. ఒక రోజు వ్యవధిలోనే ఇద్దరిని బయటకు సాగనంపారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ కె.శ్రీనివాస రాజును గతంలో సీఎం రేవంత్‌ తన కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శి హోదాలో నియమించి ఆయనకు రవాణా, దేవాదాయ, సమాచార, ప్రజాసంబంధాలు, క్రీడలు, యువజన అభ్యుదయ శాఖలపై పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. 

తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్‌పర్సన్‌గా ఆయన్ను నియమిస్తూ మహానగర ప్రాంత, పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రేవంత్‌ పేషీలో కార్యదర్శులుగా వ్యవహరించిన షెహనవాజ్‌ ఖాసీం, చంద్రశేఖర్‌ రెడ్డితోపాటు సంయుక్త కార్యదర్శిగా వ్యవహరించిన సంగీత సత్యనారాయణను సైతం గతంలో సీఎంఓ నుంచి బయటకు పంపగా, ఆ తర్వాత తాజాగా మరో ఇద్దరిని పంపించడం చర్చనీయాంశమైంది.

కీలక పోస్టులూ అదనపు బాధ్యతలేనా?
కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చిన సంజయ్‌ జాజును అనూహ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించిన ప్రభుత్వం ఆయనకే కీలకమైన ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించింది. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఈ రెండు పోస్టుల్లో కొనసాగడం ఆయనకు భారంగా పరిణమించే అవకాశం ఉందనే చర్చ అధికారుల్లో సాగుతోంది. 

దీర్ఘకాలంగా దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరిస్తున్న శైలజా రామయ్యర్‌ను అటవీశాఖకు బదిలీ చేసి మళ్లీ దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించడంపై సీనియర్‌ అధికారుల్లో చర్చ జరుగుతోంది. సీనియర్లు చాలామంది ఉన్నా వారిని కాదని ఈ పోస్టుల్లో వీరిద్దరికి అదనపు బాధ్యతలు అప్పగించడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement