breaking news
Ajith Reddy
-
అజీత్‌ను ఎందుకు సాగనంపారు?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్ (ఐడీఎస్) అధికారి బి.అజీత్ రెడ్డిని తప్పించి ప్రాధాన్యం లేని పోస్టుకు బదిలీ చేయడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే తనకు నమ్మకస్తుడిగా వ్యవహరిస్తారనే నమ్మకంతో అజీత్రెడ్డిని కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్‌పై రప్పించుకుని సీఎం పేషీలో ప్రత్యేక కార్యదర్శి హోదాతోపాటు కీలక సబ్జెక్టులనూ అప్పగించారు. రేవంత్ రెడ్డి భద్రత, అపాయింట్మెంట్లు, సీఎంఓ పాలనా వ్యవహారాలతోపాటు ఇంధన, విద్య, పరిశ్రమలు, ఐటీ, కార్మిక శాఖలను ఇప్పటివరకు అజీత్ పర్యవేక్షించారు. రేవంత్ మల్కాజ్గిరి ఎంపీగా వ్యవహరించిన సమయంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓగా కొంతకాలం అజీత్ పనిచేశారు. ఈ సమయంలో అజీత్ పట్ల కలిగిన నమ్మకం ఆధారంగా ఆయనకు ప్రభుత్వంలో అత్యంత కీలక బాధ్యతలు అప్పగించినట్టు అప్పట్లో చర్చ జరిగింది. రెండున్నరేళ్లుగా రేవంత్ ప్రభుత్వంలో అజీత్ రెడ్డి కీలక పాత్రపోషించారు. ఉన్నట్లుండి ఆయన్ను సీఎంఓ నుంచి బయటకి పంపించడంతో కారణాలు ఏముంటాయని ప్రభుత్వ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది.ఐఏఎస్‌లు లెక్క చేయడం లేదనేనా? సీఎం ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నా అజీత్రెడ్డిని కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు లెక్కచేయడం లేదనే చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి వద్దే విద్యాశాఖ ఉండగా, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి యోగితా రాణా.. అజీత్ సూచనలను తేలిగ్గా తీసుకునేవారని తెలుస్తోంది. అజీత్ నాన్ ఐఏఎస్ కావడంతో మరికొంత మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు సైతం ఆయన నుంచి ఆదేశాలు తీసుకోవడానికి ఇష్టపడ లేదని సమాచారం. మరోవైపు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సీనియర్ అధికారి ఒకరు అజీత్రెడ్డితో ఉన్న బంధుత్వాన్ని వినియోగించుకుని పైరవీలు చేస్తున్నట్టు సీఎం దృష్టికి వచ్చిందనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే అజీత్రెడ్డికి చెక్‌పెట్టాలనే ఉద్దేశంతో ఆయన్ను సీఎంఓ నుంచి బయటకు పంపించినట్టు చర్చ జరుగుతోంది. శుక్రవారం పెద్ద సంఖ్యలో ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం అజీత్ రెడ్డిని పరిశ్రమల శాఖ పరిధిలోని ఇన్వెస్ట్ తెలంగాణ విభాగం సీఈఓగా ప్రాధాన్యత లేని పోస్టులో నియమించింది. హైదరాబాద్ మెట్రో రైలు అదనపు ఎండీగా ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ శనివారం మరో ఉత్తర్వులు వెలువడ్డాయి. సీఎంఓ నుంచి సాగనంపడం పట్ల ఆయన కినుక వహించడంతో ప్రభుత్వం ఆయనకు మరో పోస్టు సైతం కట్టబెట్టినట్టు చర్చ జరుగుతోంది. సీఎంఓలో మరో వికెట్ సీఎంఓలో శనివారం మరో వికెట్ పడింది. ఒక రోజు వ్యవధిలోనే ఇద్దరిని బయటకు సాగనంపారు. రిటైర్డ్ ఐఏఎస్ కె.శ్రీనివాస రాజును గతంలో సీఎం రేవంత్ తన కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శి హోదాలో నియమించి ఆయనకు రవాణా, దేవాదాయ, సమాచార, ప్రజాసంబంధాలు, క్రీడలు, యువజన అభ్యుదయ శాఖలపై పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్‌పర్సన్‌గా ఆయన్ను నియమిస్తూ మహానగర ప్రాంత, పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రేవంత్ పేషీలో కార్యదర్శులుగా వ్యవహరించిన షెహనవాజ్ ఖాసీం, చంద్రశేఖర్ రెడ్డితోపాటు సంయుక్త కార్యదర్శిగా వ్యవహరించిన సంగీత సత్యనారాయణను సైతం గతంలో సీఎంఓ నుంచి బయటకు పంపగా, ఆ తర్వాత తాజాగా మరో ఇద్దరిని పంపించడం చర్చనీయాంశమైంది.కీలక పోస్టులూ అదనపు బాధ్యతలేనా?కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చిన సంజయ్ జాజును అనూహ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించిన ప్రభుత్వం ఆయనకే కీలకమైన ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించింది. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఈ రెండు పోస్టుల్లో కొనసాగడం ఆయనకు భారంగా పరిణమించే అవకాశం ఉందనే చర్చ అధికారుల్లో సాగుతోంది. దీర్ఘకాలంగా దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరిస్తున్న శైలజా రామయ్యర్‌ను అటవీశాఖకు బదిలీ చేసి మళ్లీ దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించడంపై సీనియర్ అధికారుల్లో చర్చ జరుగుతోంది. సీనియర్లు చాలామంది ఉన్నా వారిని కాదని ఈ పోస్టుల్లో వీరిద్దరికి అదనపు బాధ్యతలు అప్పగించడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. -
అజిత్‌రెడ్డికి క్లీన్చిట్?
- హాలియా యువకుడి ఆత్మహత్యాయత్నం కేసు దర్యాప్తులో ముందంజ - అన్ని విషయాలు పోలీసుల ముందుంచిన ప్రధాన నిందితుడు కృష్ణారెడ్డి? సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లా హాలియాకు చెందిన వడ్డె సతీశ్‌రెడ్డి ఆత్మహత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం పేషీకి చెందిన ఇద్దరిలో అజిత్‌రెడ్డికి క్లీన్చిట్ లభించిందా? మరో వ్యక్తి గంగాధర్ ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్రెడ్డి కృష్ణారెడ్డి నుంచి ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు తీసుకున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా కృష్ణారెడ్డిని నల్లగొండ పోలీసులు విచారించగా ఆయన పలు విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. అజిత్‌రెడ్డికి డబ్బులు ఇవ్వలేదని, అతడి ప్రమేయం ఏమీ లేదని కృష్ణారెడ్డి చెప్పాడని సమాచారం. గంగాధర్‌కు లక్షల రూపాయలు ముట్టజెప్పా నని చెప్పినట్లు తెలుస్తోంది. కృష్ణారెడ్డిని ఒకట్రెండు రోజుల్లో అరెస్టు చేయడంతో పాటు, విచారణలో వెల్లడయిన అంశాలతో నివేదికను ఉన్నతాధికారులకు పంపేందుకు నల్లగొండ జిల్లా పోలీసులు సిద్ధమవుతున్నారని సమాచారం. అజిత్‌రెడ్డి పట్టించుకునేవాడు కాదు.. గత నెల 30న హాలియాకు చెందిన యువకుడు సతీశ్‌రెడ్డి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ నోట్లో కృష్ణారెడ్డి, అజిత్‌రెడ్డి, గంగాధర్ పేర్లను రాశాడు. ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి తమవద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారన్నాడు. దీంతో ఇంటెలిజెన్స్ సైతం ఈ కేసుపై ఆరా తీసింది. కేసులో ప్రధాన నిందితుడైన కృష్ణా రెడ్డిని నల్లగొండ జిల్లా పోలీసులు విచారిం చినట్టు సమాచారం. అజిత్‌రెడ్డిని గంగాధర్ పరిచయం చేశాడని, ఆ తర్వాత తనను పట్టించుకోలేదని, అజిత్‌రెడ్డికి డబ్బులు ఇవ్వలేదని కృష్ణారెడ్డి పోలీసు విచారణలో చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఒత్తిడితోనే ఐపీ నోటీసులిచ్చిన కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి విచారణలో చెప్పిన సమాచారం ప్రకారం.. ఆయన చాలా మంది వద్ద నుంచి ఉద్యోగాలిప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడు. తెలంగాణ జెన్కోతోపాటు ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కూడా ఓ వ్యక్తి వద్ద డబ్బులు తీసుకున్నాడని, హైదరాబాద్‌లోని భార్యా భర్తలను, నల్లగొండ డీఎంహెచ్‌వో కార్యా లయంలో ఓ ఉద్యోగిని కూడా ఇలాగే మోసం చేశాడని తెలుస్తోంది. మొన్నటి వరకు హైదరాబాద్‌లో ఓ ఆఫీసును కూడా నడిపించాడని సమాచారం. దీంతో పాటు చిన్నపాటి కాంట్రాక్టు పనులు చేసే కృష్ణారెడ్డి ఆ రంగంలో కూడా పలువురుకి అప్పు పడ్డాడని, అన్నివైపుల నుంచి రానున్న ఒత్తిడిని తట్టుకోలేకనే ఐపీ నోటీసులిచ్చాడని పోలీసులు చెపుతున్నారు. కొనసాగుతున్న విచారణ గంగాధర్‌కు మాత్రమే తాను లక్షల రూపాయలు ముట్టజెప్పానని కృష్ణారెడ్డి పోలీసు విచారణలో అంగీకరించాడని సమాచారం. గంగాధర్ ద్వారా తనకు అజిత్ పరిచయం అయ్యాడని, గంగాధరే తనను రెండు, మూడుసార్లు సీఎం వద్దకు కూడా తీసుకెళితే ఫొటోలు కూడా దిగానని కృష్ణారెడ్డి చెప్పాడని తెలుస్తోంది. తనకు గంగాధర్‌తో ఐదేళ్లుగా పరిచయం ఉందని, గంగాధర్ హైదరాబాద్‌లో నిర్మించిన ఓ ఇంటికి కూడా తన సహకారం ఉందని కృష్ణారెడ్డి చెప్పడంతో ఆ విషయాన్ని కూడా దర్యాప్తు చేయాలని పోలీసులు యోచిస్తున్నారు. అయితే, సతీశ్‌రెడ్డి మాత్రం కృష్ణారెడ్డికి రూ.40 లక్షల వరకు ఇచ్చానని చెపుతుండగా, ఇతరుల వద్ద నుంచి వసూలు చేసిన దాంట్లో గంగాధర్‌కు ఎంత ఇచ్చాడన్న దానిపై విచారణ జరుగుతోందని పోలీసులు చెపుతున్నారు.


