ఆదిలాబాద్‌లో యుద్ధవిమానాల గర్జన! | Air Force training facility at Adilabad | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్‌లో యుద్ధవిమానాల గర్జన!

Jun 6 2026 5:35 AM | Updated on Jun 6 2026 5:35 AM

Air Force training facility at Adilabad

భారీ వ్యూహాత్మక వైమానిక శిక్షణ కేంద్రం నిర్మాణం

రన్‌వేలు, హ్యాంగర్లు, ఏప్రాన్‌లు, రక్షణ పరికరాల నిల్వ కేంద్రాలు.. వందల సంఖ్యలో క్వార్టర్లు 

పౌర విమానాశ్రయానికి అనుబంధంగా  భారీ కేంద్రం నిర్మాణానికి ప్రణాళిక 

మరో 1,000 ఎకరాల అదనపు భూమి కావాలంటూ రక్షణశాఖ ప్రతిపాదన 

పరిహార ఖర్చు భరిస్తే సేకరిస్తామని తేల్చి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. త్వరలో స్పష్టత

ఆదిలాబాద్‌లో యుద్ధ విమానాలు గర్జించబోతున్నాయి. పట్టణానికి ఆనుకొని కొత్తగా నిర్మించబోయే పౌర విమానాశ్రయానికి అనుబంధంగా భారీస్థాయిలో భారత వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పాటు కాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన పౌర విమానాశ్రయానికి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ రన్‌వే కూడా ఉండనున్నందున ఇది ‘జాయింట్‌ ఎయిర్‌ ఫీల్డ్‌‘గా రూపొందనుందని తెలిసిందే. కానీ, శిక్షణ కేంద్రాన్ని సాధారణస్థాయిలో కాకుండా దేశంలోనే కీలక స్థావరంగా మార్చాలని తాజాగా భారత వైమానిక దళం నిర్ణయింది. యుద్ధ విమానాల శిక్షణలో దీన్ని వ్యూహాత్మక కేంద్రంగా మార్చుకోవాలని ప్రణాళిక రూపొందించింది.

ఇది భారీ స్థాయిలో ఉండనున్నందున, ఇక్కడ ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది సంఖ్య కూడా ఎక్కువగా ఉండబోతోంది. దీంతో వారి కుటుంబాల కోసం వందల సంఖ్యలో గృహాలను నిర్మించనున్నారు. శిక్షణ, యుద్ధ విమానాలకు రన్‌వేలు, వాటిని నిలిపేందుకు భారీ హ్యాంగర్లు, మూమెంట్‌ కోసం ఏప్రాన్‌లు, టాక్సీవేలు, శిక్షణ కేంద్రానికి సంబంధించిన భారీ భవనాలు, పరిపాలన కార్యాలయ భవనాలు, రక్షణ సామగ్రి నిల్వ కేంద్రాలు... వెరసి దేశంలో ప్రధాన ఎయిర్‌ఫోర్స్‌ శిక్షణ కేంద్రంగా మారబోతోంది.  – సాక్షి, హైదరాబాద్‌

చిన్న స్ట్రిప్‌ నుంచి...  
ఆదిలాబాద్‌ పట్టణానికి ఆనుకునే గతంలో వాయుసేన ఎయిర్ర్‌స్టిప్‌ ఉండేది. ఆ తర్వాత దాని కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయి. కానీ, నిజాం కాలం నాటి ఆ ఎయిర్‌స్ట్రిప్‌ పరిధిలో దాదాపు 369 ఎకరాల భూమి ఇప్పటికీ ఎయిర్‌ఫోర్స్‌ అ«దీనంలోనే ఉంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో విమానాశ్రయాలను అభివృద్ధి చేసే క్రమంలో పాత ఎయిర్‌్రస్టిప్‌ స్థానంలో పౌర విమానాశ్రయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

దీనికి అంగీకరించిన ఎయిర్‌ఫోర్స్, రాష్ట్ర ప్రభుత్వం మరో 400 ఎకరాలు ఇస్తే ఉమ్మడి విమానాశ్రయం (పౌర విమానాశ్రయం, ఎయిర్‌ఫోర్స్‌ శిక్షణ కేంద్రం)గా రూపొందించేందుకు సిద్ధమైంది. వెరసి 700 ఎకరాల్లో ఎయిర్‌బస్‌ 380 స్థాయి పెద్ద విమానాలు దిగే 9 వేల అడుగుల పొడవైన రన్‌వేను ప్రతిపాదించారు. కానీ, తాజాగా రక్షణశాఖ ఇక్కడ భా రీ వైమానిక శిక్షణ కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అదనంగా మరో వేయి ఎకరాలు సేకరించి ఇవ్వాలని ప్రతిపాదించింది.

వ్యూహాత్మక ప్రాంతం  
ఆదిలాబాద్‌ దేశానికి రక్షణపరంగా వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. ఇది ఉత్తర–దక్షిణ భారత దేశాల జంక్షన్‌గా ఉంటుంది తీర ప్రాంతాలకు దూరంగా అటవీ ప్రాంతాల మధ్యన ఉన్నందున దీన్ని రక్షిత ప్రాంతంగా భారత వాయుసేన భావిస్తోంది. దీంతో ఇక్కడ పూర్తిస్థాయి ఎయిర్‌ఫోర్స్‌ ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దుండిగల్, హకీంపేటల్లోని శిక్షణ కేంద్రాల కంటే ఇది భిన్నంగా ఉండనుందని సమాచారం.  

నిర్మాణాలు 
ఈ శిక్షణ కేంద్రంలో భాగంగా యుద్ధ విమానాలు దిగడానికి భారీ రన్‌వే, విమాన రక్షణ కేంద్రం, పైలట్లకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు, కంట్రోల్‌ రూమ్‌లతోపాటు రక్షణ సిబ్బంది నివాసానికి ఒక పెద్ద టౌన్‌షిప్‌ నిర్మించనున్నారు.

ట్రైనింగ్‌ అకాడమీ–హ్యాంగర్లు
ఫైటర్‌ జెట్స్, హెలికాప్టర్ల నిర్వహణకు భారీ హ్యాంగర్లు, అత్యాధునిక రక్షణ సామగ్రి నిల్వ కేంద్రాలు నిర్మిస్తారు. రన్‌వేకు చేరువలో ఒకేసారి ఎక్కువ సంఖ్యలో వాయుసేన విమానాలు నిలిపేందుకు ఏప్రాన్, రన్‌వేకు అనుసంధానమయ్యే టాక్సీవేలను నిర్మిస్తారు. ఇవి సాధారణ విమానాశ్రయం తరహాలో ఎక్కువ సంఖ్యలో ఉంటాయని సమాచారం.  

భూమి కావాలంటే పరిహారం ఖర్చు చెల్లించాల్సిందే... 
ప్రస్తుతం రక్షణశాఖ అ«దీనంలో 369.45 ఎకరాలు ఉండగా, మరో నాలుగొందల ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. తాజా ప్రతిపాదన ప్రకారం మరో వేయి ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందుకు భారీగా పరిహారం చెల్లించాల్సి ఉన్నందున, దాన్ని కేంద్రమే భరించాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీనిపై త్వరలో స్పష్టత రానుంది. ఆదిలాబాద్‌లో డీఫంక్ట్‌ అయిన సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధీనంలోని భూములను దీనికి వినియోగించాలని భావిస్తున్నారు.

ఫలితంగా పరిహా ర ఖర్చు తగ్గుతుందని పేర్కొంటున్నారు. దీంతోపాటు నిషానీ ఘాట్, సమీపంలోని రెండు గ్రామాల భూములను సేకరించే అంశాన్ని ప్రత్యామ్నాయంగా చూస్తున్నా రు. ఇప్పటికే రక్షణశాఖ ఈ విమానాశ్రయ పూర్తిస్థాయి మాస్టర్‌ ప్లాన్‌ను ఆమోదించాల్సి ఉంది. మాస్టర్‌ ప్లాన్‌ ఆమోదం పొందిన తర్వాత నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రస్తుత ప్రణాళిక. శంకుస్థాపన జరిగిన మూడేళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నది ఆలోచన. 

Advertisement
 
Advertisement
Advertisement