ఇంకా చిక్కని నిందితుని ఆచూకీ
కానిస్టేబుల్‌కు మెమో జారీ
హైదరాబాద్, మణికొండ: నెల రోజుల పాటు రెక్కీ వేసి ఈగల్ టీం అరెస్టు చేసిన డ్రగ్స్ వ్యాపారి సయ్యద్ మహ్మద్ ముజఫర్ ఆలీ ఆచూకీని నార్సింగి పోలీసులు కనిపెట్టలేకపోయారు. బుధవారం తెల్లవారుజామున అతను తప్పించుకున్నప్పటి నుంచి ఈగల్ టీంతో పాటు నార్సింగి పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.
పోలీస్ స్టేషన్ బాత్‌రూం వెంటిలేటర్ ద్వారా అతను బయట పడి, ఏడు అడుగుల ఎత్తు ఉన్న పోలీస్ స్టేషన్ ప్రహరీ దూకి ఔటర్ సర్వీస్ రోడ్డుపైకి పారిపోయినట్టు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. సర్వీస్ రోడ్డుపై వస్తున్న ఓ క్యాబ్‌ను ఆపి అందులో అత్తాపూర్‌లోని లెనిన్‌నగర్‌కు వెళ్లినట్టు పోలీసులు గుర్తించి క్యాబ్ డ్రైవర్‌ను విచారించిన విషయం తెలిసిందే. నిందితుని వద్ద సెల్‌ఫోన్ లేకపోవడం, అతని తల్లి, సోదరున్ని పోలీసులు ఇప్పటికే రిమాండ్‌కు తరలించడంతో అతని కదలికలను కనుక్కోవడం కష్టతరంగా మారింది.
ఉన్నతాధికారులు సీరియస్
ఈగల్ టీం శ్రమించి పట్టుకున్న నిందితుడు నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకోవటంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలిసింది. నార్సింగి ఇన్‌స్పెక్టర్‌ను మందలించడంతో పాటు వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. నిందితుడు తప్పించుకునే సమయంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ అంజయ్యకు మెమో జారీ చేసినట్టు తెలిసింది. ‘‘నిందితుడు మూత్రం వస్తుందంటూ చెప్పడంతో బాత్‌రూంకు తీసుకెళ్లాను. అతను వెంటిలేటర్ ద్వారా పారిపోతాడని ఊహించలేదు’’ అని ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చినట్టు సమాచారం.


