కరీంనగర్ డెయిరీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న ఉమ్మడి జిల్లా పాడి రైతులు.
ఈ ఆందోళన ఆరంభమే: కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వర్‌రావు
కరీంనగర్ అర్బన్: సమస్యలతోపాటు రికార్డుల్లో కరీంనగర్ డెయిరీ పేరు మార్పుపై పాడి రైతాంగం కదం తొక్కింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు, ఫ్లెక్సీలు, కళాకారుల ఆట, పాటలు, డప్పు చప్పుళ్లతో నిరసన వ్యక్తం చేసింది. కరీంనగర్ పద్మనగర్‌లోని కరీంనగర్ డెయిరీ నుంచి కలెక్టరేట్ వరకు వేలాదిమంది పాదయాత్ర నిర్వ హించి నినాదాలతో హోరెత్తించారు. కలెక్టర్ చి త్రామిశ్రాకు వినతిపత్రం అందజేశారు. కరీంనగర్ డెయిరీ చైర్మన్ సీహెచ్ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ పాడి రైతులతో నడిచే కరీంనగర్ డెయిరీని ప్రోత్సహించాల్సిందిపోయి ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగుతోందన్నారు.
సర్వే నంబర్ 194లో 22.18 ఎకరాలు కరీంనగర్ డెయిరీ భూములుండగా అందులోని 11.32 ఎకరాలను కో ఆపరేటివ్ ఫెడరేషన్ పేరిట మార్చడం దుర్మార్గమని మండిపడ్డారు. 2018 వరకు లీటరుకు రూ.4 ఇన్సెంటివ్ ఇచ్చారని, ఎనిమిదేళ్లుగా ఇవ్వకపోవడం శోచనీయమ న్నారు. భూములను వెంటనే డెయిరీ పేరిట మార్చాలని డిమాండ్ చేశారు.
టెండర్లలోనూ డెయిరీకి అన్యాయం చేశారని, లీటరు రూ.62కు ఇస్తామని టెండర్ వేస్తే లీటరుకు రూ.64.50కి ఇస్తామన్న ఫెడరేషన్‌కు ఇచ్చారని, అలాగే దేవాలయాలకు రూ.600కు ఇస్తామని డెయిరీ చెబితే.. రూ.609కి ఇస్తామన్న ఫెడరేషన్‌కు ఇచ్చారని, ఇది కక్షపూరిత చర్య కాదా? అని రాజేశ్వర్‌రావు ప్రశ్నించారు. ఈ ఆందోళన ఆరంభం మాత్రమేనని, ప్రభుత్వం స్పందించని క్రమంలో లక్షమంది రైతులతో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డెయిరీ పాలకవర్గంతోపాటు సుమారు 4 వేల మంది పాడి రైతులు పాల్గొన్నారు.


