స్కిల్ వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనం
ప్రభుత్వ నిర్ణయంపై నిరసనలు
ఇది ప్రైవేటీకరణ ప్రయత్నమేనని విద్యార్థి సంఘాలు, విద్యావేత్తల ధ్వజం...
పీపీపీ మోడ్‌లో నిర్వహిస్తే విద్యార్థులపై ఫీజుల భారమని మండిపాటు
ప్రవేశాలు, అనుబంధ గుర్తింపుపైనా అస్పష్టత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలను శక్తి (స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనీషియేటివ్స్) విభాగంలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రివర్గం దీనికి ఆమోదం తెలిపింది. అయితే, విధివిధానాలేంటో ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్ విద్య భవిష్యత్ ఏమిటనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేయడమే దీని ఉద్దేశమని ప్రభుత్వం చెబుతుండగా, ఇది ప్రైవేటీకరణ ప్రయత్నమేనని విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు నిరసన తెలుపుతున్నారు.
రాష్ట్రంలో 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యా సంస్థలున్నాయి. ప్రైవేటువి మరో 54 ఉన్నాయి. వీటన్నింటికీ సాంకేతిక విద్యామండలి అనుబంధ గుర్తింపు ఇస్తోంది. దాదాపు 60 వేల మంది విద్యార్థులు ఏటా పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరుతున్నారు. ఈ కోర్సు పూర్తయిన తర్వాత ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో నేరుగా (లేటరల్ ఎంట్రీ) ప్రవేశాలు పొందుతున్నారు. సిలబస్, బోధన ప్రణాళిక కూడా ఈ విభాగమే రూపొందిస్తోంది. ఫీజులు నామమాత్రంగానే ఉంటున్నాయి.
‘శక్తి’ఏమేరకు?
పాలిటెకిన్‌క్ విద్యను బలోపేతం చేస్తామని, ఐఐటీలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కేంద్రాలుగా మారుస్తామని ప్రభుత్వం రెండేళ్లుగా చెబుతోంది. పారిశ్రామిక భాగస్వామ్యంతో ఆధునిక సాంకేతిక విద్యను అందిస్తామని తెలిపింది. ఈ క్రమంలోనే నైపుణ్య కోర్సులను అందుబాటులోకి తెచి్చంది. కొత్తగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసింది. దీని నిర్వహణకు పూర్తిస్థాయిలో నిధులు మాత్రం ఇవ్వలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఇది నడుస్తుందని తెలిపింది. కార్పొరేట్ దిగ్గజాలను ఇందులో సభ్యులుగా చేర్చింది.
ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యను పూర్తి చేసిన, లేదా చదువుతున్న విద్యార్థులకు నైపుణ్యం ఇవ్వడం దీని లక్ష్యంగా తొలుత ప్రభుత్వం తెలిపింది. ఐటీ విభాగం పరిధిలో పనిచేసే ఈ శాఖను విద్యాశాఖ పరిధిలోకి తెస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ అనూహ్యంగా దీన్ని కారి్మక శాఖ పరిధిలోకి తెచ్చారు. ఇదే విభాగానికి సాంకేతిక విద్యామండలి ఉద్యోగులు వెళ్లాల్సి వస్తోంది. ఒకే వ్యవస్థలో పనిచేసే కాలేజీలు, ఉద్యోగులు వేర్వేరు శాఖల పరిధిలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాంకేతిక విద్యాశాఖను నిర్వీర్యం చేయడమేనన్న విమర్శలు వస్తున్నాయి. ఏఐసీటీఈ అనుమతులు, సిలబస్, ప్రవేశాలు, సాంకేతిక విద్యా ప్రమాణాల దృష్ట్యా పాలిటెక్నిక్ విద్యకు ప్రత్యేక వ్యవస్థ అవసరమని వారు అంటున్నారు.
అనేక సందేహాలు
శక్తిలో విలీనం తర్వాత సాంకేతిక విద్యాశాఖ, సాంకేతిక విద్యామండలి భవిష్యత్తు ఏమిటో తెలియడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కిల్ ఇండియా పూర్తిగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తుంది కాబట్టి పాలిటెక్నిక్ ప్రవేశాలు కూడా ఇదే రీతిలో ఉంటాయనే ఆందోళన విద్యార్థి సంఘాల నుంచి వస్తోంది. ఇదే నిజమైతే ఫీజులు భారీగా పెరిగే అవకాశం ఉంది. పాలిటెక్నిక్ కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ మండలి (ఎఫ్‌ఆర్‌సీ) ఖరారు చేస్తుంది. విద్యాశాఖ పరిధి నుంచి విడిపోతే స్కిల్ వర్సిటీ పాలక మండలి ఫీజులు నిర్ణయించే వీలుంది. ఇష్టానుసారం ఫీజులు పెంచితే ఆ వర్గాలకు సాంకేతిక విద్య దూరమయ్యే ప్రమాదం ఉందనే విమర్శలు వస్తున్నాయి.
ఇప్పటికే సాంకేతిక విద్యామండలికి రూ. కోట్లలో నిధులున్నాయి. వీటిని ఎవరికి బదలాయిస్తారు? ప్రైవేటు భాగస్వామ్యంతో ఉండే స్కిల్ వర్సిటీకా? లేదా ప్రభుత్వం పరిధిలోకి మారుస్తారా? అనేది స్పష్టత లేదు. ప్రైవేటుపరమైతే ఆస్తుల భద్రత ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉంది. ప్రవేశాల ప్రక్రియ ఎలా ఉంటుంది? ప్రవేశ పరీక్ష ఎవరు నిర్వహిస్తారు? ఇంజనీరింగ్ కాలేజీల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో ఎలాంటి మార్పులు ఉంటాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోర్సుల డిజైన్‌ను ప్రైవేటు వ్యక్తులు చేస్తే, కేవలం పరిశ్రమల అవసరాలకే అవి పరిమితమయ్యే అవకాశం ఉంటుందనే అనుమానాలూ ఉన్నాయి. ఏదేమైనా విలీనానికి ముందే స్పష్టత ఇవ్వాలని విద్యారంగ నిపుణులు కోరుతున్నారు.


