గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలకలం 

84 Female Students Sick With Food Poisoning In Bhadradri Kothagudem - Sakshi

ఫుడ్‌ పాయిజన్‌తో 84 మంది విద్యార్థినులకు అస్వస్థత? 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నర్సాపురంలో ఘటన 

జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్‌ పాయిజన్‌ కారణంగానే ఇలా జరిగిందని విద్యార్థినులు అంటుండగా, ఉపాధ్యాయులు మాత్రం కాదని చెబుతున్నారు. విద్యార్థినులకు ఆదివారం చికెన్, సోమవారం ఉదయం కిచిడీ, మధ్యాహ్నం దోసకాయ, సాయంత్రం వంకాయ కూరలతో భోజనం వడ్డించారు.

ఈ క్రమంలో సోమవారం రాత్రి 29 మంది విద్యార్థినులకు కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు కావడంతో జూలూరుపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. మంగళవారం ఉదయం మరో 55 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, ఇప్పుడు విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగానే ఉందని మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. ఈ పరిస్థితికి ఫుడ్‌ పాయిజన్, ఇతర అనారోగ్య సమస్యలు కారణం కావొచ్చని చెప్పారు.

అయితే, ఉపాధ్యాయులు మాత్రం శని, ఆదివారాలు సెలవులు రావడంతో కొందరు పిల్లలు ఇంటికి వెళ్లిరాగా, మరికొందరికి తల్లిదండ్రులు ఇళ్ల నుంచి భోజనం తీసుకొచ్చి వడ్డించారని చెబుతున్నారు. కాగా, పాఠశాలలోని వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలంటూ 46 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తుండటంతో పాఠశాల యాజమాన్యం దినసరి కూలీలతో వంటలు చేయిస్తోంది. సరైన రీతిలో తయారు కాని భోజనం ఆరగించడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఐటీడీఏ డీడీ రమాదేవి మాట్లాడుతూ పాఠశాలలో మొత్తం 525 మంది విద్యార్థినులు ఉన్నారని, కొందరు జ్వరం, దగ్గు, జలుబు వల్ల బాధపడుతుండటంతో ఈ సమస్య ఎదురై ఉంటుందన్నారు. 

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top