జగిత్యాల జిల్లా తిమ్మాపూర్‌లో ఒకే కుటుంబంలో 50 మంది వంటగాళ్లు
వంటల నారాయణ, ఆయన సోదరులు, వారి పిల్లలు అంతా ఇదే వృత్తి
నిజాం కాలం నుంచి వంటనే ఉపాధి
తెలంగాణ, మహారాష్ట్రల్లో వంటల ఆర్డర్స్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: శుభకార్యాల్లో వంట చేయడం అంటే వందలాది మంది కడుపు నింపడం. రుచిగా వండి, ప్రేమగా వడ్డిస్తే ఎక్కడ శుభకార్యాలు జరిగినా.. ప్రజలే ఆప్యాయంగా మరీ మరీ పిలుస్తారు. ఎంతో చేయి తిరిగిన వంటగాళ్లకు దక్కే ఈ అరుదైన గుర్తింపు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఓ కుటుంబానికి దక్కింది. వంట చేయడాన్ని వారు వృత్తిగా కాక, బాధ్యతగా నిర్వహించడమే ఇందుకు కారణం.
ఆ ఊర్లో రాజేశుని నారాయణ అంటే పెద్దగా తెలియక పోవచ్చు కానీ, వంటల పెద్ద నారాయణ అంటే తెలియనివారు లేరు. నిజాం హయాంలో మొదలైన ఆయన వంటల ప్రస్థానం ఉమ్మడి ఏపీతోపాటు, తెలంగాణ ఏర్పడినా నిరాటంకంగా సాగుతోంది. నిజాం కాలంలోని హైదరాబాద్ రాష్ట్రంలో పెద్ద నారాయణ తొలుత జమీందార్లు, ధనికుల ఇళ్లలో వంట చేసేవారు. ఆయన చేతి రుచి తెలిశాక చుట్టుపక్కల పది ఊళ్లలో పెద్ద నారాయణనే అన్ని శుభకార్యాలకు పిలిచేవారు.
ఇలా అనేక మంది వంటలకు పిలవడంతో ఆయన తనకు తోడుగా తమ్ముళ్లు గంగారం, భోజన్న, రాములు, చిన్నగంగారం, భూమన్నలను తీసుకెళ్లి వారిని కూడా చేయి తిరిగిన వంటగాళ్లుగా తీర్చిదిద్దారు. ఇపుడు వారి కుమారులు అంతా కలిసి 50 మంది వరకు వంటలన్నలుగా ఎదిగారు. ఇలా వీరంతా ఇప్పుడు తెలంగాణ, మహారాష్ట్రలో ప్రముఖుల ఇంట శుభకార్యాల్లో తమ చేతివంట రుచి చూపిస్తున్నారు.
నాన్‌వెజ్ వెరైటీల్లో సిద్ధహస్తులు..: నారాయణ, ఆయన సోదరులు చేసే వంటలు తెలంగాణ అంతటా ప్రసిద్ధి చెందాయి. అందుకే, గతంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో జరిగిన పలు కార్యక్రమాలకు నారాయణ కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా పిలిపించి వంటలు చేయించేవారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీఎం కాకముందు నిజామాబాద్ పాదయాత్రకు వచ్చినపుడు నారాయణ కుటుంబమే వంటలు చేసింది. వారి వంటలను రుచి చూసిన సీఎం రేవంత్‌రెడ్డి నారాయణ సోదరులను ప్రశంసించారని చెపుతున్నారు.
అలా ఈ కుటుంబం సీఎంల చేత శభాష్ అనిపించుకుంది. నారాయణ కుటుంబ సభ్యులు ముఖ్యంగా మటన్ కూర, వేపుళ్లు, చికెన్, బగారా, బోటీ పటాకులు, చేపలు, రొయ్యలు, ఇతర నాన్‌వెజ్ వెరైటీలను వండడంలో సిద్ధహస్తులు. శాఖాహార వంటను కూడా వీరు ఎంతో రుచికరంగా వండుతారని పేరుంది. అయ్యప్ప పూజల సీజన్ వచ్చిందంటే అవి పూర్తయ్యే వరకు వీరికి డైరీలో ఖాళీ ఉండదని చెపుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలలో వీరు వంట చేయని ఇళ్లు లేవు. మహారాష్ట్రలో స్థిరపడ్డ తెలుగువారి కోసం కూడా వీరు అక్కడకు వెళ్లి వంటలు చేస్తున్నారు. వీరిచేత వంటలను చేయించుకోవాలంటే కనీసం 40 రోజుల ముందే సంప్రదించాలంటే వీరికి ఉన్న డిమాండ్ ఎంతో అర్థం అవుతోంది.
పెద్దలు నేర్పిన విద్య
మా తండ్రి రాజేశుని పెద్ద నారాయణ వద్ద వంటలు నేర్చుకున్నాను. 1997 నుంచి వంటలు చేస్తున్నాను. పెద్దలు నేరి్పన విద్య. ఇప్పటివరకు ఐదువేల శుభకార్యాలకు వంటలు చేశాను. శుభ కార్యాలకు వంటలు చేయడం మాకు ఆచారంగా వస్తోంది. – రాజేశుని ప్రణీత్‌కుమార్
ఎవరమూ ఖాళీగా ఉండం
నేను ఆరు సంవత్సరాల నుంచి వంటలు చేస్తున్నాను. ఇప్పటివరకు సుమారుగా 550 శుభకార్యాలకు వంటలు చేశాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి ఆర్డర్లు వస్తుంటాయి. మా కుటుంబంలో 50 మందిమి ఎవరం కూడా ఖాళీగా ఉండం. – రాజేశుని దేవేందర్


