బదిలీలకు వేళాయె! 

Transfers started in land administration department Telangana - Sakshi

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భూపరిపాలన శాఖలో మొదలైన ట్రాన్స్‌ఫర్లు 

జూలై నెలాఖరు కల్లా తహసీల్దార్లు కూడా.. 

రాష్ట్రవ్యాప్తంగా 70 శాతం మందికి స్థాన చలనం కలిగే చాన్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర భూపరిపాలన (ల్యాండ్‌ రెవెన్యూ) శాఖ పరిధిలో భారీ ఎత్తున బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో ప్రత్యక్ష, పరోక్ష సంబంధముండే అధికారుల బదిలీలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆదేశించిన మేరకు ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. ఇటీవలే ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని రెవెన్యూ డివిజనల్‌ అధికారుల (ఆర్డీవో) బదిలీలు జరిగాయి.

ఈక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్డీవోల బదిలీలకు సర్వం సిద్ధమైందని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్వరలో ఉత్తర్వులు వెలువడతాయని సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాలు జరుగుతుండటంతో.. ఈ కార్యక్రమాలు ముగిశాక బదిలీలు ఉంటాయని భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. తహసీల్దార్ల బదిలీలపై కొంత కసరత్తు జరిగిందని.. సీఈసీ ఆదేశించిన విధంగా జూలై నెలాఖరుకల్లా ఆ ప్రక్రియ కూడా పూర్తవుతుందని అంటున్నాయి. 

70 శాతం తహసీల్దార్లకు బదిలీ! 
గత లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తహసీల్దార్ల బదిలీలు జరగలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా విధుల్లో చేరినవారు, 317 జీవో ద్వారా స్థానికత ప్రాతిపదికన సర్దుబాటైనవారు మినహా 70% తహసీల్దార్లకు ట్రాన్స్‌ఫర్లు ఉంటాయని అంచనా. రాష్ట్రంలో తహసీల్దార్లు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అసిస్టెంట్‌ ఎలక్షన్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు (ఏఈఆర్‌వో)గా పనిచేస్తున్నారు.

ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యే అధికారులను అక్టోబర్‌ 4న ఓటర్ల తుది జాబితా ప్రచురించే వరకు.. అదే స్థానాల్లో పనిచేయించుకోవాలని, అనివార్యంగా బదిలీ చేయాల్సి వస్తే తమ అనుమతి తీసుకోవాలని ఎన్నికల సంఘం వెల్లడించింది. ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటు మేరకు అవసరమైతే దశాబ్ది ఉత్సవాల తర్వాత బదిలీలు ఉంటాయని.. లేదంటే అక్టోబర్‌ 4 వరకు ఆగాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోంది. 

పదోన్నతులిస్తేనే సజావుగా ఎన్నికల విధులు 
రెవెన్యూ శాఖలో పదోన్నతులు కల్పిస్తేనే ఎన్నికల విధుల నిర్వహణ సజావుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌వో)గా విధులు నిర్వహించడం కోసం 119 మంది డిప్యూటీ కలెక్టర్‌ (ఆర్డీవో) స్థాయి అధికారులు కావాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 74 మంది డిప్యూటీ కలెక్టర్లు మాత్రమే డివిజన్లలో పనిచేస్తున్నారు. ఇందులోనూ 19 ఖాళీలున్నాయి.

అయితే ఈ 19 ఖాళీలకుగాను 19 మంది తహసీల్దార్లు, సెక్షన్‌ అధికారులు, సూపరిండెంట్లకు పదోన్నతులు కల్పించారు. వీరితోపాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో 14 మంది డిప్యూటీ కమిషనర్లు కూడా రిటర్నింగ్‌ అధికారి బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. వీరిని కలిపినా మరో 50 మంది వరకు ఆర్‌వోల కొరత ఉంటుంది. ఇక డిప్యూటీ కలెక్టర్ల హోదాలో ఉన్న పలువురు ఇతర శాఖల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు.

వారిని రిటర్నింగ్‌ అ«ధికారులుగా నియమిస్తే.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిసేదాకా దాదాపు ఏడాది పాటు ఆయా శాఖల్లో పనులకు ఆటంకం కలగనుంది. ఈ క్రమంలో తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు ఇవ్వడం ద్వారా రిటర్నింగ్‌ అధికారుల కొరత ఏర్పడకుండా ఉంటుందని రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) అంటోంది. 

19 మందికి ఆర్డీవోగా పదోన్నతులు 
రెవెన్యూ శాఖలో తహసీల్దార్లు, సెక్రటేరియట్‌లో సెక్షన్‌ ఆఫీసర్లు, సీసీఎల్‌ఏ కార్యాలయంలో సూపరింటెండెంట్లుగా పనిచేస్తున్న 19 మందికి డిప్యూటీ కలెక్టర్లు (ఆర్డీవో)లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తహసీల్దార్లు కె.మహేశ్వర్, ఎం.సూర్యప్రకాశ్, మురళీకృష్ణ, కె.మాధవి, ఎల్‌.అలివేలు, బి.శకుంతల, కె.సత్యపాల్‌రెడ్డి, వి.సుహాసిని, భూక్యా బన్సీలాల్, బి.జయశ్రీ, ఎం.శ్రీనివాసరావు, డి.దేవుజా, డి.ప్రేమ్‌రాజ్, ఉప్పల లావణ్య, డి.చంద్రకళ పదోన్నతులు పొందారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top