ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? 

High Court on Pratap Resort land dispute - Sakshi

అధికారుల తీరుపైహైకోర్టు తీవ్ర ఆగ్రహం 

సుప్రీంకోర్టు ఉత్తర్వులన్నా లెక్కలేదా? 

 ‘ప్రతాప్‌ రిసార్ట్‌’ భూవివాదంపై ఉన్నత న్యాయస్థానం 

సాక్షి, హైదరాబాద్‌: భూ వివాదంలో ఓ రిసార్టు యాజమాన్యం హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం పొందినా స్పందించని అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇక సామాన్య ప్రజలు ఎక్కడికి పోతారు? ఎలా న్యాయం పొందుతారు? అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులన్నా ఇంత లెక్కలేనితనమా? ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగి న్యాయం పొందినా అధికారులకు జాలి, దయ లాంటి ఏవీ ఉండవా? తదుపరి విచారణ నాటికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్డీవో, గండిపేట తహసీల్దారు సదరు భూమికి సంబంధించిన పాస్‌ పుస్తకంతో కోర్టుకు హాజరుకావాలి. ఆ పాస్‌ పుస్తకాన్ని పిటిషనర్‌కు కోర్టే నేరుగా అందిస్తుంది. బుక్‌తో రాకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది’అని హైకోర్టు హెచ్చరించింది.

విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.  రంగారెడ్డి జిల్లా గండిపేట్‌ మండలం ఖానాపూర్‌లో ప్రతాప్‌ జంగిల్‌ రిసార్టుకు 20 ఎకరాల భూమి ఉంది. భూములను ధరణిలో అప్‌లోడ్‌ చేయడం, కొత్త పాస్‌ పుస్తకాలు ఇచ్చే సయమంలో ఈ భూమి ప్రభుత్వానిదంటూ రెవెన్యూ అధికారులు వివాదానికి తెరతీశారు. దీనిపై రిసార్టు యాజమాన్యం 2019లో హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి... ఆ భూమి రిసార్టుదేనని ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై అదే సంవత్సరం ప్రభుత్వం ద్విసభ్య ధర్మాసనం వద్ద అప్పీల్‌ చేసినా ఎదురుదెబ్బే తగిలింది.

అనంతరం ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా 2021లో రిసార్టు యాజమాన్యానికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. అయినా అధికారులు పాస్‌ పుస్తకం ఇవ్వకపోవడంతో రిసార్టు యాజమాన్యం 2022లో హైకోర్టులో ధిక్కరణ కేసు దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడం లేదని, ఉద్దేశపూర్వకంగానే ఉత్తర్వులపై నిర్లక్ష్యం వహిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణకు కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్‌ అంతా పాసు పుస్తకంతో హాజరుకావాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top