అసెంబ్లీ ఎన్నికలపైనే బీఆర్‌ఎస్‌ ఫోకస్‌!  

BRS focus on assembly elections - Sakshi

2023 ముగిశాకే జాతీయ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించే యోచన 

జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతపై ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయం 

కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం పాటిస్తామనే సంకేతాలిచ్చే ఆలోచన 

రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో గ్రాఫ్‌ పెరుగుతుందనే భావన 

పూర్తిగా పార్టీ కార్యకలాపాలపైనే కేసీఆర్‌ దృష్టి 

సాక్షి, హైదరాబాద్‌:  జాతీయ స్థాయిలో విస్తరణ కోసం పార్టీని భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మార్చినా.. ప్రస్తుతానికి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైనే దృష్టి కేంద్రీకరించాలని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నట్టు తెలిసింది. మహారాష్ట్రలో పార్టీ కార్యకలాపాల విస్తరణ చేపట్టినా.. అంతకన్నా ముందు తెలంగాణలో పార్టీ కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల్లో వరుసగా తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన నేతగా ఇప్పటికే గుర్తింపు పొందిన కేసీఆర్‌.. మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్‌ ఘనతను సొంతం చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

ఆత్మీయ సమ్మేళనాల పేరిట ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఎన్నికల సన్నద్ధతను ప్రా రంభించిన కేసీఆర్‌.. తాజాగా ప్రారంభమైన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను కూడా బీఆర్‌ఎస్‌ ఎన్నికల వ్యూహంలో అంతర్భా గం చేస్తున్నారు. 21 రోజుల పాటు జరిగే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో బీఆర్‌ఎస్‌ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేస్తూ.. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఆకట్టుకోవడం దిశగా అడుగులు వేస్తున్నారు.

దశాబ్ది ఉత్సవాలు పూర్తికాగానే పూర్తిస్థాయిలో ఎన్నికల సమరానికి కార్యాచరణ ప్రకటించేందుకు కేసీఆర్‌ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో సభలు, సమావేశాల ద్వారా ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించి.. అక్టోబర్‌ 10న వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభతో ఎన్నికల సన్నద్ధతను పతాక స్థాయికి తీసుకెళ్లే యోచనలో కేసీఆర్‌ ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

జాతీయ స్థాయిలో గ్రాఫ్‌ పెంచుకునేందుకూ.. 
రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారం చేపట్టడం ద్వారా జాతీయస్థాయిలో గ్రాఫ్‌ పెంచుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు తెలిసింది. ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తే.. 2024 ఆరంభంలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి ఆకర్షణ పెరుగుతుందని సీఎం లెక్కలు వేస్తున్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలలోని సుమారు 20 లోక్‌సభ స్థానాలపై కేసీఆర్‌ దృష్టి కేంద్రీకరించే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అవసరమైతే పొరుగున ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్‌ లేదా ఔరంగాబాద్‌ నుంచి కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అవకాశముందని మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

అప్పటిదాకా విపక్షాలకు దూరమే! 
జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్‌.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు విపక్ష పార్టీల ఐక్యత కోసం జరుగుతున్న ప్రయత్నాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు తెలిసింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు తాము సమ దూరమనే సంకేతాలు ఇవ్వకుంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు జాతీయ పార్టీలు బీఆర్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకుంటాయనే అభిప్రాయంలో పార్టీ అధినేత ఉన్నారని బీఆర్‌ఎస్‌ వర్గాలు వివరిస్తున్నాయి.

ఇటీవల ప్రగతిభవన్‌లో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో జరిగిన భేటీ సందర్భంగా కూడా జాతీయ రాజకీయాల్లో తమదైన శైలిలో ముందుకు వెళ్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారని అంటున్నాయి. భావసారూప్య పార్టీలతో స్నేహభావంతో వ్యవహరిస్తామని చెప్తూనే.. జాతీయస్థాయిలో విపక్షాల ఐక్యతపై ఆచితూచి అడుగులు వేయాలని సీఎం భావిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడ్డాకే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్ల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్‌ ఉన్నారని అంటున్నాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top