న్యూస్‌రీల్
అక్టోబరు 2 నుంచి అమల్లోకి మహిళా పథకం
అధికారులతో సీఎం విజయ్ సమీక్ష
అమెరికా సంస్థతో కీలక ఒప్పందం
నేటి నుంచి అమల్లోకి.. అల్పాహారం విస్తరణ పథకం
తమిళనాడులో మహిళల కోసం
అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం మరింత విస్తృతం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం అత్యంత
ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వెట్రి పయనం (విజయపు ప్రయాణం) పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా సీఎం విజయ్ ఈ పథకాన్ని లాంఛనంగాప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రోజూ సుమారు 84.32 లక్ష మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందనున్నారు.
సాక్షి, చైన్నె: వెట్రి పయనం పథకం అమలుకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు, ప్రణాళికలపై సీఎం విజయ్ అధ్యక్షతన సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ పథకం విస్తరణలో భాగంగా ఇప్పటివరకు కేవలం పట్టణ ప్రాంతాల్లోని సాధారణ బస్సుల్లో మాత్రమే అమల్లో ఉన్న మహిళల ఉచిత ప్రయాణ సదుపాయాన్ని... ఇకపై మరింత విస్తరించనున్నారు. ఈ కొత్త పథకం ద్వారా ఎక్స్‌ప్రెస్, ఎల్‌ఎస్‌ఎస్, డీలక్స్ బస్సులు, మఫిషియల్ సాధారణ బస్సులు, 40 కి.మీ మించిన ఘాట్ రోడ్డు బస్సులలో కూడా ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తింపజేయనున్నారు. రాష్ట్రంలోని 7 ప్రభుత్వ రవాణా సంస్థల పరిధిలోని మొత్తం 18,413 బస్సుల్లో, దాదాపు 12,692 బస్సులు (69 శాతం) ఈ పథకం కింద అందుబాటులోకి రానున్నాయి. ఈ పథకం వల్ల సుదూర ప్రాంతాల్లోని కళాశాలలకు వెళ్లే విద్యార్థినులు, ఉద్యోగానికి వెళ్లే మహిళలు, వైద్య అవసరాల నిమిత్తం ప్రయాణించే ప్రతి ఒక్కరూ ఎంతో లబ్ధి పొందనున్నారు.
ముమ్మరంగా ఏర్పాట్లు:
పథకం ప్రారంభానికి సంబంధించి ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషిన్ల అనుసంధాన పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈనెల 25 నాటికి అన్ని పరిశీలనా పనులు పూర్తి చేసి, 27న విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. అక్టోబరు 2 నుంచి ఈ పథకం అమల్లోకి తీసుకొచ్చే దిశగా ఈ సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో రవాణా శాఖ మంత్రి విజయ్ పార్థిబన్, ప్రధాన కార్యదర్శి సాయికుమార్, ఆర్థిక శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సిద్ధిక్ తదితరులు పాల్గొన్నారు.
చైన్నెలో స్టార్‌బక్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్
అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచ ప్రఖ్యాత కాఫీ దిగ్గజం స్టార్‌బక్స్ సంస్థ చైన్నెలో తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం ద్వారా సుమారు 800 మంది టెక్నాలజీ నిపుణులకు అత్యధిక వేతనంతో కూడిన ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ఒప్పందం సీఎం విజయ్ సమక్షంలో సోమవారం సచివాలయంలో జరిగింది. తమిళనాడు ప్రభుత్వ పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహం , వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో... రాష్ట్ర ప్రభుత్వ గైడెన్స్ సంస్థతో స్టార్‌బక్స్ ప్రతినిధులు ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం మేరకు స్టార్‌బక్స్ సంస్థ భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా తమిళనాడులో తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుండటం విశేషం. భారతదేశంలో రిటైల్ వ్యాపారం కోసం టాటా కన్స్యూమర్ ప్రొడెక్ట్స్‌తో కలిసి పనిచేస్తున్న ఈ సంస్థ, ఈ టెక్నాలజీ సెంటర్ విషయంలో మాత్రం స్వతంత్రంగా వ్యవహరించనుంది. చైన్నెలో ఉన్న అద్భుతమైన మౌలిక వసతులు, అత్యుత్తమ టెక్ నిపుణులు దీర్ఘకాలికంగా సంస్థతో కలిసి పనిచేసేందుకు దోహదపడతాయని స్టార్‌బక్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆనంద్ వరదరాజన్ తెలిపారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ మాట్లాడుతూ... ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్టార్‌బక్స్ సంస్థ తమ రాష్ట్రాన్ని ఎంచుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. తమిళనాడు యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు కల్పించే ఈ ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన, ప్రధాన కార్యదర్శి సాయికుమార్, గైడెన్స్ సంస్థ ఎండీ దీపక్ జాకబ్ పాల్గొన్నారు.
సచివాలయంలో సీఎం విజయ్ ఈశాన్య రుతుపవనాల ముందస్తు చర్యలు, రాష్ట్రవ్యాప్తంగా విజృంభిస్తున్న డెంగీ నియంత్రణ చర్యలపై అత్యవసర ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. తుఫాను, వరద ముప్పు పొంచివున్న తీర ప్రాంతాలు, డెల్టా జిల్లాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉండాలని, రోడ్లు, వంతెనలు, నీటి పరివాహక ప్రదేశాలను ఎప్పటికప్పుడుడ్రోన్ల ద్వారా పర్యవేక్షించి, శాటిలైట్ ఫోన్లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో డెంగీ వ్యాప్తిని అరికట్టేందుకు ఇంటింటి సర్వేలు, దోమల నిర్మూలన చర్యలను ముమ్మరం చేయాలని వైద్య శాఖను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని మందులు, వైద్య పరీక్షా పరికరాలు,ప్రత్యేక వార్డులు సిద్ధంగా ఉండాలని వివరించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ప్రత్యక్షంగానూ, పలు జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని తమ నివేదికలను సమర్పించారు. కాగా ఈ ఏడాది అక్టోబర్ 3 లేదా 4వ వారంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్న తరుణంలో, ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందస్తుగా అప్రమత్తం చేసేందుకు ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది . అలాగే, గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో డెంగీ స్వైర వివాహరం నేపథ్యంలో కట్టడి చర్యలపై సీఎం విజయ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
వర్షాల అలర్ట్.. జ్వరాల కట్టడికి విస్తృత చర్యలు
పోలీసు కస్టడీలో వీరమణి
ఆగిన ఎలక్ట్రిక్ బస్సులు
ఇలావెనిల్ వలరివన్‌కు అభినందనలు
జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ విభాగంలో రజత పతకం గెలిచిన భారత మహిళా జట్టులో భాగం కావడంతో పాటు, వ్యక్తిగత విభాగంలోనూ రజత పతకం సాధించిన ఇలావెనిల్ వలరివన్‌కు సీఎం విజయ్ అభినందనలు తెలియజేశారు.
అల్పాహారం విస్తరణ
తమిళనాడులోని అన్ని ప్రభుత్వ , ప్రభుత్వ సహకారంతో నడిచే పాఠశాలల్లో 6 నుండి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కూడా కామరాజర్ అల్పాహార పథకం అమలుకు నిర్ణయించారు. ఈ పథకాన్ని మంగళవారం చైన్నె తిరువాన్నీయూరులో సీఎం విజయ్ ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,454 పాఠశాలల్లో 6 నుండి 8వ తరగతి వరకు చదువుతున్న దాదాపు 15.30 లక్షల మంది విద్యార్థులు అదనంగా లబ్ధి పొందే విధంగా తీర్చిదిద్దారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విస్తరణ పథకం కోసం అదనంగా రూ. 217.63 కోట్లు , ఇది వరకే అమల్లో ఉన్న పథకం లబ్దిదారులైన విద్యార్థుల కోసం మొత్తంగా రూ. 724 కోట్లు కేటాయించారు. అలాగే, మేనమామ బంగార ఉంగరం పథకం ఈనెల 28వ తేదీన మదురై ఉసిలం పట్టి ప్రభుత్వ ఆస్పత్రిలో సీఎం విజయ్‌ప్రారంభించనున్నారు. ఇందు కోసం ఆ ఆస్పత్రికి 1106 బంగారు ఉంగారులు ప్రత్యేక ప్యాకెట్లలో పొందు పరిచి చేర్చారు. కాగా ఈనెల 27వ తేదీన సీఎం విజయ్ కరూర్‌లో పర్యటించనున్నారు. ఇక్కడి వేలుస్వామి పురంలో గతంలో తన పర్యటన సందర్భంగా తొక్కి సలాట జరిగిన ఘటనలో మరణించిన వారికి స్మారకంగా స్తూపం ఆవిష్కరించనున్నారని సమాచారం.


