సాక్షి, చైన్నె : వీ ది లీడర్స్ సంస్థ ప్రజాసంబంధాలు , ప్రచార కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నియామకం జరిగింది. ఈ సంస్థ పబ్లిక్ రిలేషనన్స్ జనరల్ సెక్రటరీగా ఆస్పైర్ కె. స్వామినాథన్‌ను నియమిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు అన్నామలై సోమవారం ప్రకటించారు. సంస్థ చేపడుతున్న వివిధ సామాజిక కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ సేవల లక్ష్యాలను మీడియా , సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే బాధ్యతను స్వామినాథన్ నిర్వర్తించనున్నారు. మీడియా సంస్థలు, ప్రజలతో సమన్వయం చేసుకుంటూ సంస్థ సమాచార మార్పిడి వ్యవస్థను ఆయన మరింత సమర్థవంతంగా ముందుకు నడిపిస్తారని అన్నామలై ఆశాభావం వ్యక్తం చేశారు.మీడియా రంగంలో స్వామినాథన్‌కు ఉన్న అపారమైన అనుభవం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు సంస్థ గొంతుకను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు దోహదపడతాయని తెలిపారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన స్వామినాథన్‌కు సంస్థ నాయకులు, కార్యకర్తలు అందరూ పూర్తి సహకారం అందించాలని అన్నామలై కోరారు.
రాష్ట్రంలో రూఫ్‌టాప్ సోలార్ సబ్సిడీ పథకం ప్రారంభం
మంత్రి నిర్మల్ కుమార్ వెల్లడి
సాక్షి, చైన్నె : మార్చి 2027 నాటికి లక్ష గృహాలను రూఫ్‌టాప్ సౌర విద్యుత్‌కు అనుసంధానించాలనే లక్ష్యంతో విద్యుత్‌శాఖ మంత్రి సి.టి.ఆర్. నిర్మల్ కుమార్ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించారు. తమిళనాడు రూఫ్‌టాప్ సోలార్ సబ్సిడీ పథకాన్ని చైన్నెలోని విద్యుత్ బోర్డు ప్రధాన కార్యాలయంలో ప్రారంభించినానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతి ఇంటిలో హరిత విద్యుత్, స్వయం సమృద్ధిగల హరిత తమిళనాడు లక్ష్య సాధనలో భాగంగా తమిళనాడు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు.. దీని ద్వారా ప్రజలు సబ్సిడీ వివరాలు తెలుసుకోవడం, దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం అవుతుందన్నారు.
ప్రత్యేక అదనపు సబ్సిడీ
తమిళనాడులో రూఫ్‌టాప్ సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి సీఎం ప్రత్యేక అదనపు సబ్సిడీ కింద రూ. 50 కోట్లు కేటాయించారన్నారు. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యక్ష సబ్సిడీ కూడా లభిస్తుంది.రూ. 35 వేలు, రూ. 70 వేలు , రూ. లక్ష చొప్పున కేటగిరి వారీగా సబ్సిడీ అందజేస్తామన్నారు. తిరుప్పూర్ , చెంగల్పట్టు జిల్లాలో ఉప ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దృష్ట్యా, అక్కడ మాత్రం ఈ పథకం పెండింగ్‌లో పెట్టామని, ఎన్నికల అనంతరం అమలు చేస్తామన్నారు.


