సాక్షి, చైన్నె : సీఎం కార్యాలయం సముద్ర తీరాన్ని ఆనుకుని ఉండాలన్న జ్యోతిష్యుడి మాటల కోసమే పట్టినం బాక్కం ప్రాంతాన్ని సచివాలయం కోసం ఎంపిక చేశారని, ఒకరి వ్యక్తిగత ఆశ, కోరిక కోసం వేలాది మంది మత్స్యకారుల జీవనోపాధిని బలిపెట్టడాన్ని సహించేది లేదని డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ మండిపడ్డారు. పట్టినంబాక్కంలో కొత్త సచివాలయం నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరాటాలు ఉధృతమైన విషయం తెలిసింది. ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న సీపీఎం, సీపీఐ సైతం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరుబాట పట్టాయి. ఈ పరిస్థితులలో జాలర్ల సంఘాల ప్రతినిధులు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో సోమవారం అన్నా అరివాలయంలో సమావేశమయ్యారు. తమ గోడును వెళ్లగక్కుతూ డీఎంకే మద్దతు కోరారు. అనంతరం స్టాలిన్ ఈ వ్యవహారంపై స్పందించారు. సచివాలయం నిర్మించడానికి నగరంలో ఎన్నో స్థలాలు అందుబాటులో ఉన్నాయని, కావాలంటే గతంలో సచివాలయంగా ఉపయోగించిన ఓమందూరార్ ఎస్టేట్ కాంప్లెక్స్‌ను వాడుకోవచ్చని సూచించారు. అలా కాకుండా కేవలం జ్యోతిష్యుల మాటలు విని పట్టినంబాక్కంను ఎంపిక చేయడం సరికాదన్నారు.
సీఎంకు తెలియకుండానే జీవో ఎలా వచ్చింది..
కొత్త సచివాలయం ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకోలేదని మంత్రి ఆదవ్ అర్జున చెప్పడం సమంజసం కాదని, ఒకవేళ సీఎంకు తెలియకపోతే ఆ ప్రాంతం కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఎలా వెలువడ్డాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం ప్రశ్నించారు. చైన్నెలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. సీఎంకు తెలియకుండా ఎలా జీవో జారీ అయిందని ప్రశ్నిస్తూ, ఇది పూర్తి తప్పిదం అని వెంటనే ఆ స్థలాన్ని మార్చాలని తాము ప్రత్యామ్నాయ ప్రాంతాలను కూడా సూచించామని తెలిపారు. ఇది ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం కాదని, మత్స్యకారుల జీవనోపాధిని కాపాడాలని కోరుతూ ప్రజా ప్రయోజనం కోసం లేవనెత్తిన డిమాండ్ అని షణ్ముగం స్పష్టం చేశారు. చైన్నెలో బోలెడన్ని ప్రత్యామ్నాయ స్థలాలు అందుబాటులో ఉన్నప్పుడు, మత్స్యకారులను బలవంతంగా ఖాళీ చేయించి అక్కడ సచివాలయం కట్టడం సరికాదని ఆయన హితవు పలికారు. కాగా, ఈ వ్యవహారంలో సీపీఎంను నిందిస్తూ ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నే త బాల భారతి తీవ్రంగానే స్పందించారు. తమిళనాడు ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న సీపీఎం.. విమానాశ్రయాన్ని ప్రైవేట్ పరం చేయాలని కేంద్రానికి లేఖ రాయడం వంటి అంశాలపై ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.
జాలర్లకు అండగా డీఎంకే..
పట్టినంబాక్కం చుట్టూ ముళ్లికుప్పం, శ్రీనివాసపురం, రాజీవ్ గాంధీ నగర్, భవానీ కుప్పం,నొచ్చి కుప్పం సహా దాదాపు 12 జాలర్ల నివాస ప్రాంతాలు కేవలం ఒక కిలోమీటరు పరిధిలోనే ఉన్నాయని స్టాలిన్ గుర్తుచేశారు. ఇక్కడ సచివాలయం నిర్మిస్తే వేలాది మంది మత్స్యకారులు రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో పాఠశాలలు, రద్దీ ఉండే రహదారులు ఉన్నాయని, దీనివల్ల ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు మత్స్యకారులతో కలిసి పోరాడుతామని స్టాలిన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ కూటమిలోని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.


