● సీఎం విజయ్ తీరుపై ఆగ్రహం
సాక్షి, చైన్నె : అసెంబ్లీ వేదికగా మిసా చట్టంలో స్టాలిన్ అరెస్టు వ్యవహారం తీవ్రంగా కించ పరిచే రీతిలో, సర్కారియా కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కరుణానిధిని టార్గెట్ చేస్తూ అవినీతి ఆరోపణలతో సీఎం విజయ్, మంత్రి నిర్మల్‌కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పిలుపు నిచ్చారు. దీంతో డీఎంకే వర్గాలు రాష్ట్రవ్యాప్తంగా కదం తొక్కాయి. అసెంబ్లీలో సీఎం విజయ్ ప్రసంగాన్ని ఖండిస్తూ తమిళనాడు వ్యాప్తంగా డీఎంకే వర్గాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. చైన్నెతో పాటు శివారు జిల్లాలైన కాంచీపురం, చెంగల్పట్టు తదితర జిల్లాల్లో జరిగిన ఈ ఆందోళనల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కార్యదర్శులు, పార్టీ నిర్వాహకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో అరైస్టె జైలు జీవితం అనుభవించిన ఎం.కె. స్టాలిన్ త్యాగాలను సీఎం విజయ్ అవమానించారని డీఎంకే నేతలు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగం రాజకీయ మర్యాదలకు విరుద్ధంగా ఉందని విమర్శిస్తూ, ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. అన్ని రెవెన్యూ జిల్లాల పరిధిలో భారీ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీకి చెందిన యూనియన్, నగర, పట్టణ, జిల్లా స్థాయి కార్యదర్శులు, నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, యువజన విభాగం కార్యకర్తలు, ఇతర అనుబంధ సంస్థల ప్రతినిధులు పాల్గొని సీఎం విజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంచీపురం దక్షిణ జిల్లా డీఎంకే ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం సమీపంలోని కావలన్ గేట్ ప్రాంతంలో నిరసన చేపట్టారు. ఎంపీ టీఆర్‌బాలు ,మాజీ మంత్రి అన్బరసన్ తదితరులు జిల్లా పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చెంగల్పట్టు పాత బస్టాండ్ సమీపంలో జిల్లా డీఎంకే ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. జిల్లా కార్యదర్శి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో తాంబరం, పల్లవరం, తిరుపోరూర్, చెంగల్పట్టు, శ్రీపెరుంబుదూర్, శోలింగనల్లూర్ తదితర నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నిరసన సందర్భంగా సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డీఎంకే నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇదే తరహాలో నిరసనలు కొనసాగాయి. ఇక చైన్నెలోనూ పలు చోట్ల నిరసనలు కొనసాగాయి. మాజీ మంత్రి శేఖర్‌బాబు నేతృత్వంలో జరిగిన నిరసనలో సీఎం విజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు.
కేఎన్ నెహ్రూ ఫైర్..
తిరుచ్చిలో జరిగిన భారీ నిరసనలో డీఎంకే డిప్యూటీ ప్రధానకార్యదర్శి కేఎన్ నెహ్రూ మాట్లాడుతూ,డీఎంకేను విమర్శించే సీఎం విజయ్, ఒక్కసారైనా బీజేపీ పేరును ఉచ్చరించారా? అని ప్రశ్నించారు. టీవీకే కార్యకర్తలు రాహుల్ గాంధీయే ప్రధాని అని గట్టిగా మాట్లాడితే చాలు, మరుసటి రోజే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రంగంలోకి దిగుతుందనే భయం విజయ్‌కు ఉందని ఎద్దేవా చేశారు. డీఎంకేపై అవినీతి ఆరోపణలు చేసే సీఎం, తాము ఆధారాలు అడిగితే పాత కమిషన్, ఈడీ కేసులు, మీసా చట్టం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా కేవలం సినిమా డైలాగులు చెబుతున్నారని విమర్శించారు. అసెంబ్లీలో డీఎంకే సభ్యులు చక్కగా మాట్లాడితే కెమెరాలు తమ వైపు తిరగవని, కేవలం ప్రతిఘటించినప్పుడు మాత్రమే తమను తప్పుగా చూపించేందుకు కెమెరాలను తమ వైపు తిప్పుతారని ఆరోపించారు. డీఎంకే ఎప్పుడూ తన కూటమి పార్టీలను గౌరవిస్తుందని, పార్టీ నుంచి వెళ్లిన వాళ్లకు డీఎంకే ఎప్పటికీ కారణం కాదని స్పష్టం చేశారు. తమ పార్టీ ఎప్పుడూ మిత్రపక్షాలను విడిచిపెట్టబోదని తేల్చిచెప్పారు. రానున్న ఉపఎన్నికల్లో తమ కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక, మాజీమంత్రి అన్బిల్ మహేశ్ స్పందిస్తూ, మంత్రి నిర్మల్ కుమార్ ఇప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్ భక్తుడిలాగే ప్రవర్తిస్తున్నారని, టీవీకే ప్రభుత్వాన్ని ఏ ప్రజలైతే అధికారంలోకి తెచ్చారో, అదే ప్రజలు త్వరలోనే గద్దె దింపుతారని అని డీఎంకే మాజీ మంత్రి అన్బిల్ మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సినిమా సెట్టింగ్‌గా అసెంబ్లీ
అసెంబ్లీకి వస్తున్న టీవీకే సభ్యులు ఏవీఎం స్టూడియోకు వెళ్లే మైండ్‌సెట్‌తో వస్తున్నారని ఎద్దేవా చేశారు. అబద్ధాలనే పదే పదే చెబితే అదే నిజమవుతుందనే గోబెల్స్ సిద్ధాంతం ప్రకారం టీవీకే ప్రభుత్వం పనిచేస్తున్నట్టు మండిపడ్డారు. ఎప్పుడో ముగిసిపోయిన సర్కారియా కమిషన్ వివాదాన్ని మళ్లీ ఇప్పుడు విజయ్ తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. కరుణానిధిపై ఎలాంటి తప్పూ లేదని తేలినా ఆయనపై విమర్శలు చేస్తున్నారు. నిర్మల్ కుమార్ ఒక కేడీ మంత్రి అని, ఇంకా చెప్పాలంటే, ఆయన ఆర్‌ఎస్‌ఎస్ జెండా మోస్తున్న భక్తుడు అని ఎద్దేవా చేశారు. నిరసనలో ఎంపీ రాజ మాట్లాడుతూ, త్యాగులను అవమానించడం విచారకరం అని, అయితే సీఎంగా కాకుండా కనీసం మనిషిగా మారండి అని హితవు పలికారు.మాజీ మంత్రి రఘుపతి స్పందిస్తూ, కరూర్‌కేసులో విజయ్‌పై తొలి కేసు నమోదు చేయాలని స్టాలిన్ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన మానవత్వంతో ఆ సమయంలో వ్యవహరించారని మండిపడ్డారు. కాగా, డీఎంకే నిరసనను టీవీకే ఐటీ విభాగం తీవ్రంగా ఖండించింది. వారి నిజస్వరూపం బయటపడటంతో ఆందోళనతో నిరసనలకు దిగారని ఎద్దేవా చేశారు.


