సాక్షి, చైన్నె: పర్యావరణపరంగా అత్యంత కీలకమైనవి తాబేళ్లు సంతానోత్పత్తి చేసే ప్రాంతాలైన పట్టినం బాక్కం, నీలాంకరై సముద్రతీరాల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వీలు లేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. వినాయక చవితి ఉత్సవాల సమయంలో నీటి వనరులలో విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల జరిగే కాలుష్యాన్ని అరికట్టాలని కోరుతూ చైన్నె పుదుపేటకు చెందిన హరిహరన్ అనే వ్యక్తి 2023లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సౌత్ జోన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు ట్రైబ్యునల్ జ్యుడీషియల్ మెంబర్ పుష్ప సత్యనారాయణ, టెక్నికల్ మెంబర్ ప్రశాంత్ గార్గవ సమక్షంలో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సమర్పించిన నివేదికలలో, చైన్నెలోని కాశీమేడు, తిరువొత్తియూరు, ఎన్నూర్, పట్టినం బాక్కం, నీలాంకరై తీరాలను విగ్రహాల నిమజ్జనానికి అనువైన ప్రాంతాలుగా గుర్తించినట్లు అందులో వివరించారు.
బ్రేక్ వేస్తూ నిర్ణయం
పట్టినంబాక్కం, నీలాంకరై తీరాలలో తాబేళ్ల సంతానోత్పత్తి జరుగుతోందని, అంతేకాకుండా ఆ ప్రాంతాలు కోస్టల్ రెగ్యులేషన్ జోన్–1 పరిధిలోకి వస్తాయని, ఈ దృషాట్య, అక్కడ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అనుమతించకూడదని పిటిషనర్ వాదించారు. పర్యావరణ ప్రాధాన్యత కలిగిన ఆ ప్రాంతాలకు తరలించే విగ్రహాలను వేరే ప్రత్యామ్నాయ ప్రాంతాలకు ఎందుకు మళ్లించకూడదని ట్రిబ్యునల్ సభ్యులు ప్రశ్నించారు. ఇతర ప్రాంతాలకు మార్చడం విషయమై శాంతిభద్రతలు, జన సంచారం, , మతపరమైన సున్నితమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని, దీనిపై అధికారులతో చర్చించి నిర్ణయం తెలపడానికి గడువు కావాలని తమిళనాడు ప్రభుత్వ న్యాయవాది కోరారు.
గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు
ప్రభుత్వ విజ్ఞప్తిని అంగీకరించిన ట్రిబ్యునల్ ధర్మాసనం, పర్యావరణ ప్రాధాన్యత కలిగిన నీలాంకరై, పట్టినంబాక్కం తీరాలలో విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అనుమతి లేదని ఆదేశించారు. అఆగే, ఈ రెండు ప్రాంతాలలో నిమజ్జనం చేయాల్సిన విగ్రహాలను మిగిలిన 4 ప్రాంతాలకు ఎలా తీసుకెళ్లాలో అన్న దానిపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, ప్రభుత్వ తుది నిర్ణయాన్ని 16వ తేదీలోపు సమర్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.


