సాక్షి, చైన్నె : మధురాంతకం, ధారాపురం ఉప ఎన్నికలను నిలిపి వేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో శనివారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఏప్రిల్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఆరుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి అధికార పార్టీలో చేరినవిషయం తెలిసిందే. ఇందులో మధురాంతకం, ధారాపురం నియోజకవర్గాలకు సంబంధించి ఎలాంటి కేసులు పెండింగ్‌లో లేని దృష్ట్యా, ఉప ఎన్నికల నిర్వహనకు ఎన్నికల యంత్రాంగం నచర్యలు తీసుకుంది. ఈ మేరకు ప్రస్తుతం నామినేషన్ల దాఖలు సాగుతోంది. డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకేలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల నుంచిబయటకు తీసి పరిశీలించే పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల నిలిపివేత కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం గమనార్హం.
కోర్టులో పిటిషన్
ఈ ఉప ఎన్నికలకు దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ, కేవలం స్వార్థ రాజకీయ కారణాలతో ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడం, మళ్లీ ప్రజాధనంతో ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చినట్టు కోర్టుకు పిటిషనర్‌వివరించారు. రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యేలు మరకతం కుమారవేల్, సత్యభామల నామినేషన్లను ఎన్నికల సంఘం స్వీకరించకుండా నిరోధించాలని కోరారు. ఉప ఎన్నికల ఖర్చులను రాజీనామా చేసిన అభ్యర్థుల నుంచే వసూలు చేసేలా ఒక విధానాన్ని రూపొందించాలని కోరారు.ప్రజల తీర్పును విస్మరించి పదవులకు రాజీనామా చేసేవారిని నిర్దిష్ట కాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించే చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపి, తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్, న్యాయవాది సుధన్ మద్రాస్ హైకోర్టును కోరారు.ఈ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
టీవీకేలో ఎన్నికల ఇన్‌చార్జ్‌లు
అక్టోబర్ 6న జరగనున్న మధురాంతకం, ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల పర్యవేక్షణ కోసం టీవీకే తరపున ప్రత్యేక బృందాలను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం విజయ్ రంగంలోకి దించారు. టీవీకే తరపున ఆ నియోజకవర్గాలలో పదవులకు రాజీనామాచేసిన మరగతం కుమర వేల్, సత్యభామా పోటీ చేస్తున్నారు. వీరి గెలుపు లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టేందుకు ప్రత్యేక బృందాన్ని, ఇన్‌చార్జ్‌లను రంగంలోకి దించారు. ఈమేరకు ఉప ఎన్నికల పనులను పర్యవేక్షించడానికి మంత్రులు ఆనంద్, సెంగోట్టయ్యన్, నిర్మల్ కుమార్‌లను పరిశీలకులుగా నియమించారు. అలాగే మధురాంతకం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా మంత్రి ఆధవ్ అర్జున, కో– ఇన్‌చార్జ్‌లుగా పి. రాజ్‌కుమార్, తెన్నరసు, వినోద్, డిప్యూటీ ఇన్‌చార్జ్‌లుగా పలువురు ఎమ్మెల్యేలు ,స్థానిక జిల్లా కార్యదర్శులను నియమించారు. ధారాపురంతారాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా మంత్రి అరుణ్‌రాజ్,కో–ఇన్‌చార్జ్‌లుగా మంత్రులు విజయ్ బాలాజీ, విజయలక్ష్మి, లోకేష్ తమిళసెల్వన్, డిప్యూటీ ఇన్ చార్జ్‌లుగా పలువురు ఎమ్మెల్యేలను నియమించారు. పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేసి, ఉప ఎన్నికల చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదయ్యే విధంగా టీవీకే అభ్యర్థులను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించి కొత్త చరిత్ర సృష్టించాలని పిలుపు నిచ్చారు. త్వరలోనే ఈ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.


