రాధాత్రి నేత్రాలయ అద్భుత విజయం | - | Sakshi
Sakshi News home page

రాధాత్రి నేత్రాలయ అద్భుత విజయం

Sep 13 2026 7:40 AM | Updated on Sep 13 2026 7:40 AM

– మూడేళ్ల చిన్నారికి చూపు పునరుద్ధరణ

సాక్షి, చైన్నె: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తిరుపతికి చెందిన ఓ పేద కుటుంబానికి చెందిన మూడేళ్ల చిన్నారికి, చైన్నెలోని రాధాత్రి నేత్రాలయ వైద్యులు క్లిష్టమైన కంటి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి చూపును మళ్లీ ప్రసాదించారు. వివరాలు.. చిన్నారి పుట్టినప్పుడు నెలలు నిండకపోవడం వల్ల వచ్చే ప్రాణాంతక కంటి వ్యాధి ‘రెటినోపతి ఆఫ్‌ ప్రీమెచ్యూరిటీ’ బారిన పడింది. అప్పట్లో రాధాత్రి నేత్రాలయ గురుప్రియ విజన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ద్వారా ఉచితంగా ఇంజెక్షన్లు, లేజర్‌ చికిత్స అందించారు. అయితే తదుపరి పరీక్షలకు తల్లిదండ్రులు రాకపోవడంతో, మూడేళ్ల వయసు వచ్చేసరికి ఆ పాపకు అకస్మాత్తుగా చూపు కోల్పోయి, వస్తువులను ఢీకొనే పరిస్థితి తలెత్తింది. చిన్నారిని మళ్లీ ఆసుపత్రికి తీసుకురావడంతో పరీక్షించిన వైద్యులు, రెండు కళ్లలోనూ రక్తస్రావం, రెటీనా వేరుపడినట్లు గుర్తించారు. వెంటనే డాక్టర్‌ వసుమతి వేదాంతం ఆధ్వర్యంలో ఎలాంటి కుట్లు లేని, ఆధునిక కటకాన్ని కాపాడే విట్రెక్టమీ శస్త్రచికిత్సను రెండు కళ్లకు విజయవంతంగా నిర్వహించారు. హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌ సహకారంతో ఈ ఖరీదైన శస్త్రచికిత్సలన్నీ పూర్తిగా ఉచితంగా నిర్వహించారు. ప్రస్తుతం చిన్నారి మళ్లీ వస్తువులపై దృష్టి కేంద్రీకరిస్తూ స్పష్టంగా చూడగలుగుతోంది. ఈ వివరాలను శనివారం రాధాత్రి నేత్రాలయ స్థానికంగా ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement