28న విడుదలకు సన్నాహాలు
హాజరు కానున్న సీఎం విజయ్
సీఎం విజయ్ పర్యటన
ముఖ్యమంత్రి విజయ్ నేరుగా మేట్టూరుకు వెళ్లి సాగునీటిని విడుదల చేయనున్నారు. ఈనెల 28వ తేదీన సీఎం విజయ్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేపట్టారు. డ్యామ్ కుడి గట్టు, పైస్థాయి స్లూయిస్ (మదగు) విద్యుత్ మోటార్ల విభాగం తదితర ప్రాంతాలను పరిశీలించి, అధికారులు ముందస్తు ఏర్పాట్లులో నిమగ్నమయ్యారు. జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సెల్వరాజ్, అసిస్టెంట్ ఇంజనీర్లు సతీష్, ప్రశాంత్, డిఎస్పీ షణ్ముగసుందరం ఈ పరిశీలనలో ఉన్నారు. తాగునీటి అవసరాల కోసం ప్రస్తుతం సెకనుకు 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం 88.43 అడుగులు కాగా, నీటి నిల్వ 50.87 టీఎంసీలుగా ఉంది.
మేట్టూరు డ్యాం వద్ద అధికారుల పరిశీలన
సాక్షి, చైన్నె : రాష్ట్రంలోని డెల్టా జిల్లాలకు మేట్టూరు జలాశయం వర ప్రదాయినిగా ఉన్న విషయం తెలిసిందే. సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ 12న కావేరీ నదిలోకి డెల్టా సాగు నిమిత్తం మేట్టూరు డ్యామ్ గేట్లు తెరచుకుంటాయి. సేలం, ఈరోడ్, నామక్కల్, తిరుచ్చి, తంజావూరు, తిరువారూర్ సహా 12 జిల్లాల్లోని దాదాపు 17 లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుంది. గత ఐదారేళ్లుగా నిర్ణీత జూన్ 12వ తేదీన డ్యాం నుంచి నీటిని విడుదల చేశారు. అయితే ఈ ఏడాది డ్యాంలో సరి పడ్డ నీటి నిల్వల లేక పోవడంతో గేట్ల తెరచుకోలేదు. దీంతో డెల్టాలో ఈ ఏడాది కరువై సాగుబడి దెబ్బతింది. బారు బావుల మీద ఆధార పడ్డ రైతులు కొంత మేరకు పంటలపై దృష్టి పెట్టారు. కురువై సాగు కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజి సైతం ప్రకటించింది. అదే సమయంలో తమను ఆదుకోవాలని రైతులు పోరాటాలు చేస్తూ వస్తున్నారు. కర్ణాటక నుంచి కావేరి జలాలలు సంవృద్ధిగా దక్కాలన్న ఎదురు చూపులలో ఉంటూ వచ్చిన అన్నదాతకు తాజాగా డ్యాంలోకి నీటి రాక కొంత మేరకు పెరగడంతో ఊరట దక్కింది. ప్రస్తుతం కావేరీ తీరంలో కురుస్తున్న వర్షాల వల్ల మేట్టూరు డ్యామ్‌కు ఇన్–ఫ్లో (నీటి రాక) గణనీయంగా పెరిగి, నీటిమట్టం 88 అడుగులకు చేరింది. త్వరలోనే ఇది 90 అడుగులకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇటీవలే అసెంబ్లీలో డ్యామ్ నీటి విడుదలపై ప్రశ్నలు రాగా, త్వరలోనే మంచి వార్త ప్రకటిస్తామని జలవనరుల శాఖ మంత్రి ఎన్.ఆనంద్ వెల్లడించారు.
ఏర్పాట్లలో అధికారులు
మేట్టూరు డ్యామ్ నుండి 28న సాగుకు నీటిని సీఎం విడుదల చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. సేలం జిల్లా కలెక్టర్ ఇలంబగవత్, వెస్ట్ జోన్ ఐజీ రమ్యా భారతి, డీ ఐజీ సంతోష్ ఎస్పీ కుత్తాలింగం బుధవారం మేట్టూరు డ్యామ్‌ను సందర్శించి ముందస్తు ఏర్పాట్లు, భద్రతా చర్యలను సమీక్షించారు. అలాగే ముఖ్యమంత్రి భద్రతా విభాగం సిబ్బంంది డ్యామ్ కుడి, ఎడమ గట్లు, 16 కన్నుల స్లూయిజ్ గేట్లు, సభా ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నీటి విడుదల కార్యక్రమానికి సంబంధించి జలవనరుల శాఖ అధికారులు పనులను ముమ్మరం చేశారు: డ్యామ్ గేట్లు, పరిసరాలకు రంగులు వేసే పనులు, స్లూయిజ్ గేట్ల విద్యుత్ మోటార్ల పనితీరును సరిచూసే ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. నీరు ప్రవహించే కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలు, పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు. రోడ్డు మార్గంలో ఆక్రమణలు, పొదలను తొలగించడమే కాకుండా డివైడర్లకు రంగులు వేస్తూ, పాత పోస్టర్లను తొలగిస్తూ మేట్టూరు పరిసర ప్రాంతాలను సుందరీకరిస్తున్నారు. డ్యాం నుంచి నీటి విడుదల కానున్న సమాచారంతో రైతులు పొలం బాటకు సన్నద్దం అవుతున్నారు. అదే సమయంలో కావేరి తీరంలో వర్షాలు మరింత సంవృద్ధిగా పడాలని, డ్యాం పూర్తిగా నిండాలని రైతులు ప్రార్థిస్తున్నారు.
సాగుకు మేట్టూరు డ్యాం నుంచి నీరు


