సాక్షి, చైన్నె : ఈశాన్య రుతు పవనాలు ఈ ఏడాది రాష్ట్రంలో ఆశాజనకంగా ఉండే అవకాశాలు ఉన్నా యని వాతావరణ పరిశోధకులు పేర్కొంటున్నారు. దీంతో ముందు జాగ్రత్తలలో అధికారులునిమగ్నమయ్యారు. ఎల్‌నినో ప్రభావం పుణ్యమా ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలో ముఖంచాటేశాయి. అయితే, రానున్న రోజులలో వర్షం తీవ్ర పెరిగే అవకాశాలు ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. గత రెండు మూడు రోజులుగా చైన్నె, శివారులలో అక్కడక్కడ చెదరు ముదురుగా వర్షం పడుతూవస్తున్నది. ఇది రానున్న రోజులలో మరింతగా పెరగవచ్చు అని ప్రైవేటు పరిశోధకులు పేర్కొంటున్నారు.
చైన్నెకి వరద ప్రమాదం
అక్టోబర్, నవంబర్ డిసెంబర్‌లో ఈశాన్య రుతుపవనాల సమయంలో చైన్నె , దాని శివారు ప్రాంతాల్లో చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని పరిశోధకలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తక్షణమే ముందస్తు అప్రమత్తతా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈశాన్య రుతుపవనాల ముందస్తు పనులకు రూ. 42 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో చైన్నె, కాంచీపురం సహా 5 జిల్లాలకు ఏర్పాట్లు విస్తృతం చేయనున్నారు. గతంలో డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాల హయాంలో ఈ పనులకు రూ. 25 కోట్ల వరకు నిధులు ఇవ్వగా, ఈ ఏడాది ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యధికంగా రూ. 42 కోట్లను జలవనరుల శాఖకు కేటాయించింది.ఈ నిధులతో అడయార్, కూవం, బకింగ్‌హామ్ కెనాల్, కుశస్థలి నదులలో పూడికతీత పనులతో పాటు, 202 ప్రాంతాల్లో డ్రైనేజీ పునరుద్ధరణ, దెబ్బతిన్న వర్షపునీటి కాలువ పనులు చేపడుతున్నారు.
ఒక్క చోట కూడా నీరు నిలవకూడదు
రాబోయే వర్షాకాలం , ఈశాన్య రుతుపవనాల దృష్ట్యా చైన్నె నగరంలో ఎక్కడా వర్షపు నీరు నిలిచిపోకుండా ముందస్తు చర్యలు వేగవంతం చేయాలని సీఎం విజయ్ ఆదేశించినట్లు జలవనరుల శాఖ మంత్రి ఎన్. ఆనంద్ వెల్లడించారు. మంత్రి ఎన్. ఆనంద్ అధ్యక్షతన చైన్నె సెక్రటేరియట్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జలవనరుల శాఖ కార్యదర్శి . సీనియర్ ఇంజనీర్లు తదితర అధికారులు పాల్గొన్నారు. చైన్నెలోని ఏ ఏ ప్రాంతాల్లో వర్షపు నీరు ఎందుకు నిలుస్తుందో అధ్యయనం చేసి, తక్షణ పరిష్కారం చూపడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. రహదారులపై తెరిచి ఉన్న విద్యుత్ పెట్టెలు, ప్రమాదకరమైన గుంతలను వెంటనే గుర్తించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ మరమ్మత్తు పనులను వర్షాలు ప్రారంభమయ్యేలోపే పూర్తి చేయాలని ఆదేశించారు.


