తమిళ మాధ్యమ రిజర్వేషన్‌ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం! | - | Sakshi
Sakshi News home page

తమిళ మాధ్యమ రిజర్వేషన్‌ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం!

Aug 27 2026 3:11 AM | Updated on Aug 27 2026 3:11 AM

సాక్షి, చైన్నె : ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో తమిళ మాధ్యమం ద్వారా చదువుకున్న అభ్యర్థులకు ఇచ్చే 20 శాతం ప్రాధాన్యత,రిజర్వేషన్‌ చట్ట సవరణ బిల్లుకు రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.వి. ఆర్లేకర్‌ ఆమోదం తెలిపారు ప్రభుత్వ ఉద్యోగాల్లో తమిళంలో చదివిన వారికి 20 శాతం ప్రాధాన్యత ఇచ్చేందుకు 2010లో తమిళ ప్రాధాన్యతా చట్టం తీసుకొచ్చారు. అయితే, యూనిఫాం సర్వీసెస్‌ (పోలీస్‌ శాఖ) సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ నియామకాలలోని 20 శాతం డిపార్ట్‌మెంటల్‌ కోటాలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు ఈ ప్రాధాన్యత వర్తించడంలో చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఈ సమస్యను సరిదిద్దడానికి 2026 జనవరి 3న శాసనసభలో సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సవరణ చట్టం ఇకపై భర్తీ చేయబడే కొత్త ఉద్యోగ నియామకాలకు మాత్రమే వర్తిస్తుంది. 1వ తరగతి నుండి ఉద్యోగానికి నిర్దేశించిన విద్యార్హత (డిగ్రీ/పీజీ మొదలైనవి) వరకు పూర్తిస్థాయిలో తమిళ మాధ్యమంలోనే చదివిన వారికి మాత్రమే ఈ 20% రిజర్వేషన్‌ లభిస్తుంది.వేరే మీడియంలో చదువుకొని, కేవలం పరీక్షలు మాత్రమే తమిళంలో రాసిన వారు ఈ రిజర్వేషన్‌కు అనర్హులు. విద్యా హక్కు చట్టం కింద 2 నుండి 8వ తరగతిలో నేరుగా చేరి తమిళ మాధ్యమంలో చదివిన వారు, అలాగే ఇతర రాష్ట్రాల్లో తమిళంలో చదివి ఆపై తమిళనాడులో విద్యను కొనసాగించిన వారు ఈ రిజర్వేషన్‌కు అర్హులుగా ప్రకటించారు. 10, 11, 12 తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయి, ఆ తర్వాత సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాసైనప్పటికీ... వారు పాఠశాల, కళాశాల విద్యను తమిళంలోనే పూర్తి చేసి ఉంటే ఈ ప్రాధాన్యత పొందేందుకు అర్హులే అని ప్రకటించారు. అభ్యర్థులు తమ ప్రాథమిక విద్య నుండి చివరి విద్యార్హత వరకు చదివిన అన్ని విద్యాసంస్థల నుండి తమిళ మాధ్యమ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొంది గవర్నర్‌ ఆమోదానికి వెళ్లింది. దీంతో బుధవారం అర్లేకర్‌ బిల్లుపై సంతకం చేయడంతో చట్టంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement