– త్వరలో ‘వెట్రి తమిళనాడు సూపర్ యాప్’
సాక్షి, చైన్నె: ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా, దాదాపు 500 రకాల ప్రభుత్వ సేవలను నేరుగా తమ మొబైల్ ఫోన్ల ద్వారానే పొందేలా టీవీకే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.5 కోట్ల వ్యయంతో ‘వెట్రి తమిళనాడు సూపర్ యాప్’ పేరిట దీనిని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ వివరాలను రాష్ట్ర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజిటల్ సేవల శాఖ మంత్రి కుమార్ ప్రకటించారు. జనన ధ్రువీకరణ పత్రాలు , రేషన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ ఆధునీకరణ వంటి సుమారు 500 రకాల కీలక ప్రభుత్వ సేవలను ప్రజలు తమ చేతిలోని మొబైల్ నుంచే సులభంగా పొందేందుకు రూ.5 కోట్ల ఖర్చుతో ఈ సూపర్ యాప్‌ను రూపొందిస్తున్నారు. అలాగే ప్రజలు ప్రభుత్వానికి తమ సలహాలు, సూచనలు అందించడానికి, సంక్షేమ పథకాలపై తమ అభిప్రాయాలను పంచుకోవడానికి రూ. కోటి వ్యయంతో ‘వెట్రి తమిళనాడు పోర్టల్,వెబ్‌సైట్’ను సైతం తీర్చిదిద్దుతున్నారు.
స్టార్టప్‌లకు ఉచిత ఏఐ సేవలు
రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (అఐ) ఆధారిత ఉత్పత్తులు, సాంకేతికతను ప్రోత్సహించేందుకు రూ.10 కోట్ల అంచనా వ్యయంతో ‘తమిళనాడు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఉచిత ఏఐ సేవలు అనే ప్రత్యేక పథకాన్ని అమలు చేయనున్నారు. తమిళనాడు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో ‘వెట్రి తమిళనాడు ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఆర్ కుమార్ వివరించారు.


