క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Aug 27 2026 3:11 AM | Updated on Aug 27 2026 3:11 AM

ఎర్నావూరులో లారీ దగ్ధం కల్లకురిచి సమూహంపై ఎస్పీకి ఫిర్యాదు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని వినతి రోడ్డుపై సంచరించిన పశువుల పట్టివేత టిప్పర్‌ ఢీకొని మాజీ పంచాయతీ అధ్యక్షుడి మృతి

తిరువొత్తియూరు: చైన్నె ఎర్నావూరు సత్యమూర్తి నగర్‌ ప్రాంతంలో లారీలను రిపేర్‌ చేసే మెకానిక్‌ షాప్‌ ఒకటి ఉంది. దీని పక్కనే కలైవాణి అనే మహిళ కు చెందిన ఒక టైలర్‌ లారీ రిపేర్‌ కోసం నిలిపి ఉంచారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి హఠాత్తుగా, రిపేర్‌ కోసం నిలిపి ఉంచిన ఆ లారీ వెనుక వైపు టైరు మంటల్లో చిక్కుకుని తగలబడిపోయింది. సమాచారం అందిన వెంటనే ఎన్నూర్‌, మణలి ఫైర్‌ బ్రిగేడ్‌ సిబ్బంది వేగంగా తరలివచ్చి, లారీ టైరుకు అంటుకున్న మంటలను ఆర్పివేశారు. లారీకి దుండగులు ఎవరైనా నిప్పు పెట్టారా? అనే కోణంలో సాత్తాంకాడు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

కొరుక్కుపేట: కల్లకురిచి ఆగస్టు 25–కల్లకురిచి జిల్లాలోని ఉలుతయేట్టైలో జరిగిన విడుదలై సిరుతైగళ్‌ పార్టీ సమావేశంలో గుమిగూడిన జనసమూహం ఒక పథకం ప్రకారం జరిగిన కుట్ర అని, నాయకుడు తిరుమావళవన్‌పై దాడి చేసేందుకు ప్రయత్నం జరిగిందని ఆరోపిస్తూ వి.సి.కె. సభ్యులు ఎస్పీ జిల్లా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అక్కడ గందరగోళం నెలకొంది.17వ తేదీన కల్లకురిచి జిల్లా, ఉలుందూరుపేటలో వీసీకే తరపున తమిళ జాతీయ ఉద్యమ సదస్సు జరిగింది. ఈ సదస్సు సందర్భంగా వేదికపై భారీ జనసందోహం నెలకొంది. ఈ పరిస్థితిలో, వీసీ చెంగల్పట్టు డాక్యుమెంటేషన్‌ సెంటర్‌ జిల్లా ఆర్గనైజర్‌ అయిన రాజా నేతత్వంలోని వీసీ సభ్యులు స్వయంగా కల్లకురిచి జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

తిరువొత్తియూరు: మదురాంతకం పరిసర ప్రాంతాల్లోని రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వివిధ రకాల పథకాలు అమలు చేయబడుతున్నాయి. సబ్సిడీతో కూడిన వ్యవసాయ పరికరాలు, పంటల బీమా, కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌, బిందు సేద్యం (డ్రిప్‌ ఇరిగేషన్‌) మరియు వ్యవసాయ యంత్రాలు మొదలైన పలు రకాల పథకాల ద్వారా రైతులు లబ్ధి పొందే అవకాశం ఉంది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చాలా మంది రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటిని పొందడానికి ఉండాల్సిన అర్హతలు, దరఖాస్తు చేసుకునే విధానాలపై సరైన అవగాహన లేని పరిస్థితి నెలకొంది.ఈనేపథ్యంలో మదురాంతకం ప్రాంత వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల వారీగా ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించి, ప్రభుత్వ వ్యవసాయ సంక్షేమ పథకాలన్నింటి గురించి రైతులకు వివరంగా తెలియజేయాలని కోరుతున్నారు.

తిరువళ్లూరు: రాత్రి సమయంలో రాకపోకలకు అంతరాయం కలిగించేలా సంచరిస్తున్న పశువులను పట్టుకుని మున్సిపల్‌ కార్యాలయానికి తరలించారు. తిరుపతి–చైన్నె జాతీయ రహదారిలో రాత్రి సమయంలో పశువుల సంచారం ఎక్కువైయ్యింది. దీంతో పాటు పశువులు రోడ్డుపైనే పడుకోవంతో రాత్రి సమయంలో వేగంగా వచ్చే ద్విచక్ర వాహనాలు పశువులను డీకొని ప్రమాదాలకు గురవుతున్నారు. ఈక్రమంలోనే రోడ్డుపై సంచరించే పశువులను స్వాధీనం చేసుకుని యజమానులపై జరిమాన విధించాలని ప్రజలు కోరారు. ఇదే విషయంపై కలెక్టర్‌, ఎస్పీ సహా పలువురికి వినతి పత్రం సమర్పించారు. ఈక్రమంలోనే రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించే సంచరించే పశువులను పట్టుకోవాలని కలెక్టర్‌ కవిత మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే మంగళవారం రాత్రి మున్సిపల్‌ సిబ్బంది రోడ్డుపై సంచరిస్తున్న సుమారు 29 పశువులను పట్టుకుని మున్సిపల్‌ కార్యాలయానికి తరలించారు. పశువుల యజమానులు రెండు రోజుల్లో మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చి జరిమాన చెల్లించడంతో పాటు ఇకపై రోడ్డుపై పశువులను వదలబోమని రాతపూర్వకంగా వినతులు ఇవ్వాలని లేని పక్షంలో పశువులను గోశాలకు తరలిస్తామని ప్రకటించారు.

పళ్ళిపట్టు: ఆర్కేపేట యూనియన్‌లోని సహస్రపద్మాపురం గ్రామానికి చెందిన సుబ్రమణి(60) మాజీ పంచాయతీ అధ్యక్షుడు. అతను బుధవారం సాయంత్రం షోళింగర్‌ నుంచి సహస్రపద్మాపురంలోని ఇంటికి బైకులో వెళ్లాడు. గ్రామానికి సమీపంలోని బస్‌ షెల్టర్‌ వద్ద వేచివున్న అదే గ్రామానికి చెందిన సుమతి(35) లిప్ట్‌ అడిగి బైకులో పయనించింది. గ్రామానికి బైకు వెళ్లుతున్న క్రమంలో ఎం సేండ్‌తో గ్రామానికి వెళ్లిన టిప్పర్‌ బైకును ఓవర్‌టేక్‌ చేసి ప్రయత్నంలో ఢీకొంది. ప్రమాదంలో తీవ్ర గాయలైన ఇద్దరిని ఆ ప్రాంతం వాసులు కాపాడి 108 అంబులన్స్‌ సాయంతో తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలించగా మార్గంమధ్యలోనే సుబ్రమణి మృతి చెందాడు. షోళింగర్‌ ప్రభుత్వాసుపత్రిలో ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం సుమతిని అడుక్కుంపారై ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement