కోనేరును తెరిచే అంశాన్ని పరిశీలించండి | - | Sakshi
Sakshi News home page

కోనేరును తెరిచే అంశాన్ని పరిశీలించండి

Aug 27 2026 3:11 AM | Updated on Aug 27 2026 3:11 AM

● కాంచీపురం ఆలయ

యాజమాన్యానికి కోర్టు సూచన

సాక్షి, చైన్నె: ఆవణి అవిట్టం (శ్రావణ పౌర్ణమి) పండగను పురస్కరించుకుని కాంచీపురం వరదరాజ పెరుమాళ్‌ కోవెలలోని అత్తివరదర్‌ ‘ఆనంద సరస్సు’ పుష్కరిణి తెరవాలని కోరుతూ దాఖలైన వినతిపై నిర్ణయం తీసుకోవాలని కాంచీపురంలోని ఆలయ యాజమాన్యానికి మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. కాంచీపురం వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలోని ఆనంద సరస్సు కోనేరు మధ్యలో ఉన్న మండపంలో అత్తివరదర్‌ అనంత శయన భంగిమలో నీటి అడుగున ఉంటారు. ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఆయనను బయటకు తీసి, 48 రోజుల పాటు భక్తుల దర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత తిరిగి పుష్కరిణి మండపంలో నిమజ్జనం చేస్తారు. అనంతరం ఆ పుష్కరిణిలోకి ఎవరినీ అనుమతించరు. ఈ నేపథ్యంలో, చిన్న కాంచీపురానికి చెందినశ్రీదత్తా దేశిక తిరువంశత్తార్‌ సభ మద్రాస్‌ హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేసింది. ఆగస్టు 27న ప్రారంభమయ్యే ఆవణి అవిట్టం వేడుకల్లో భాగంగా పవిత్ర స్నానాలు, వేద పారాయణాలు, ఇతర సాంప్రదాయ పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి తమ సభ సభ్యులను, స్థానికులను అనుమతించేలా, అన్ని పవిత్ర రోజుల్లో ఆనంద సరస్సు పుష్కరిణి తెరిచేలా ఆలయ యాజమాన్యాన్ని ఆదేశించాలని పిటిషనర్‌ కోరారు.ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి కృష్ణన్‌ రామస్వామి ధర్మాసనం విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ వాదన

ముఖ్యమైన పర్వదినాల్లో పుష్కరిణిని తెరవాలని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, ఆలయ యాజమాన్యం దానిని మూసివేసి తమ ప్రాథమిక మతపరమైన హక్కులను భంగపరుస్తోందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. పవిత్ర స్నానాల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, భద్రతా కారణదృష్ట్యా ఆనంద సరస్సు పుష్కరిణిని తెరవడం సాధ్యం కాదని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

హైకోర్టు తీర్పు

ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... పవిత్ర రోజుల్లో ఆనంద సరస్సును తెరిచే అంశంపై 2020 జూన్‌ నెలలో మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన గత ఉత్తర్వులను గుర్తుచేశారు. ఈ విషయంలో పిటిషనర్‌ సభ అందజేసిన వినతిపత్రాన్ని నిశితంగా పరిశీలించి, తగిన ఆదేశాలు జారీ చేయాలని కాంచీపురంలోని సంబంధిత ఆలయ యాజమాన్యాన్ని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement