స్నేహితుడి బైక్ ఢీకొని
కాలేజీ విద్యార్థి మృతి
తిరువొత్తియూరు: చైన్నె పుళల్ సమీపం పెరియమాత్తూరు, అత్తికుళం వీధికి యువకుడు మాణిక్యం మణి (19). ఇతను చైన్నె మాధవరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీకామ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇతను మంగళవారం సాయంత్రం స్నేహితులతో కలిసి విడివిడిగా బైక్‌లపై మదురవాయల్ – పుళల్ బైపాస్ సైకిల్ షాప్ ఫ్లైఓవర్ మలుపు గుండా వెళ్తున్నారు.అప్పుడు, ఆ రోడ్డు మలుపులో మాణిక్యం మణి నడుపుతున్న బైక్‌ను, అతని స్నేహితుడైన కొడుంగైయూర్‌కు చెందిన లోకేష్ (20) అనే యువకుడు నడుపుతున్న బైక్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. వెంటవెంటనే బైక్‌లు ఒకదానికొకటి ఢీకొనడంతో నియంత్రణ కోల్పోయి కిందపడిపోవడంతో, కాలేజీ విద్యార్థి మాణిక్యం మణి తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని తోటి స్నేహితులు కాపాడి, చికిత్స నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ అతనికి తీవ్రమైన చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా మంగళవారం అర్ధరాత్రి కాలేజీ విద్యార్థి మాణిక్యం మణి మరణించాడు. దీనిపై కొలత్తూరు ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ విభాగం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
శవయాత్రలో
ఇరువర్గాల ఘర్షణ
– టీవీకే నేత హత్య
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ పుదుమావిలంగై అగరం గ్రామానికి చెందిన రమణి(55). మంగళవారం అనారోగ్యం కారణంగా మృతి చెందారు. ఈమె అంత్యక్రియలకు కసవనల్లాత్తూరు గ్రామానికి చెందిన కార్తీక్ హాజరయ్యారు. ఈ సమయంలో కార్తీక్‌కు, అగరం గ్రామానికి చెందిన టీవీకే నేత మణిగండన్‌కు మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ సమయంలో ఇరువర్గాలు తీవ్రంగా ఘర్షణపడగా టీవీకే నేత మణిగండన్ కత్తిపోటుకు గురై మరణించాడు. కాగా మణిగండన్‌ను హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ స్తానికులు రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు మణిగండన్ తండ్రి వద్ద ఫిర్యాదను స్వీకరించి కేసు దర్యాప్తును చేస్తున్నారు.
29న ప్రత్యేక ఈకేవైసీ
నమోదుకు ప్రత్యేక శిబిరం
కొరుక్కుపేట:తమిళనాడులోని అన్ని రేషన్ దుకాణాల్లో ఈ–కేవైసీ నమోదు కోసం ఒక ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ విషయంలో, జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 ప్రకారం, ఎలక్ట్రానిక్ రేషన్ కార్డుకు అనుసంధానించబడిన లబ్ధిదారులందరి ప్రాధాన్యత ఆధార్ వివరాలను అంత్యోయోద అన్న యోజన రేషన్ కార్డులను ధృవీకరించడానికి వేలిముద్ర ఆధారిత ధవీకరణ (ఇ –కె వైసి) చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొంటూ తమిళనాడు ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
బస్సు అద్దాన్ని పగలగొట్టిన
యువకుడి అరెస్ట్
తిరువొత్తియూరు: చైన్నె అంబత్తూరుకు చెందిన ఓరకడమ్ ప్రాంతం నుండి మంగళవారం సాయంత్రం 30 మందికి పైగా ప్రయాణికులతో కోయంబేడు బస్సు నిలయం వైపు ఒక ప్రభుత్వ బస్సు వెళ్తోంది. మంగళవారం రాత్రి అంబత్తూరు బస్టాండ్ నుండి ఆ బస్సు బయలుదేరినప్పుడు, ఎదురుగా ఒక యువకుడు పరుగెత్తుకుంటూ వచ్చి బస్సును ఆపమని చెప్పాడు. అయితే, బస్సు డ్రైవర్ సతీష్ (50) బస్సును ఆపకుండా అలాగే నడుపుకుంటూ వెళ్లాడు.దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ యువకుడు, ప్రభుత్వ బస్సు ముందు భాగంలో ఉండే ఆటోమేటిక్ తలుపుపై బలంగా గుద్దాడు. దీనివల్ల ఆ తలుపుకు ఉన్న అద్దాలు పగిలి ముక్కలయ్యాయి. ఈ ఘటనలో ఆ యువకుడి చేతికి కూడా గాయాలయ్యాయి. ఆ తర్వాత బస్సును అక్కడే నిలిపివేసి, అందులోని ప్రయాణికులందరినీ వేరే బస్సుల్లో పంపించి వేశారు. అలాగే, బస్సు అద్దాన్ని పగలగొట్టిన యువకుడికి అక్కడి ఒక ప్రైవేట్ క్లినిక్‌లో చికిత్స అందించారు. ఈ సంఘటనపై అంబత్తూరు పోలీస్ స్టేషన్‌లో బస్సు డ్రైవర్ సతీష్ (50) ఫిర్యాదు చేశారు. అద్దాన్ని పగలగొట్టిన తిరువేర్కాడు ప్రాంతానికి చెందిన ప్రకాష్ (27) అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
కట్టెల పొయ్యి మంటల్లో
చిక్కుకుని మహిళ మృతి
అన్నానగర్: ఉత్తిర మేరూరు సమీపంలోని ఎల్.ఎండత్తూరు గ్రామానికి చెందిన తిరుకుమారన్. ఇతను ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతని భార్య విమల (34). వీరికి ధన్సిక (9), యష్మిక (7) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ స్థితిలో మంగళవారం రాత్రి విమల కట్టెల పొయ్యి మీద వంట చేస్తోంది. ఆ సమయంలో మంట సరిగ్గా మండకపోవడంతో, కిరోసిన్ పోసింది. దాంతో మంట వేగంగా వ్యాపించి, చీరకు నిప్పంటుకుంది. వెంటనే శరీరమంత మంటలు వ్యాప్తించడంతో విమల కేకలు వేసింది. శబ్దం విని ఆమె భర్త తిరుకుమారన్, ఇరుగు పొరుగు వారు పరుగెత్తుకుంటూ వచ్చి మంటలను ఆర్పి ఉత్తిరమేరూరు ప్రభుత్వ అస్పత్రిలో చేర్పించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం చెంగల్పట్టు ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. అక్కడ తీవ్ర చికిత్స అందించినప్పటికి, ఫలించక బుధవారం ఉదయం విమల మృతి చెందింది.


