‘తమిళనాడు నేల పరిరక్షణ ఉద్యమం’ కింద అనేక కీలక పథకాలను బడ్జెట్‌లో మంత్రి వినోద్ ప్రకటించారు. ఇందులో భాగంగా 20 వేల ఎకరాల్లో సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.4,000 చొప్పున ప్రత్యేక ప్రోత్సాహకం అందజేయనున్నట్లు తెలిపారు.
రూ.600 కోట్లతో 5 ఏళ్ల ప్రణాళిక
మట్టిలో సూక్ష్మజీవులను పెంచడం, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడం మరియు ప్రకృతి,సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఐదేళ్ల కాల పరిమితితో రూ.600 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది.
● సేంద్రీయ రైతులకు ప్రత్యేక నజరానాగా 20,000 ఎకరాల్లో సేంద్రీయ పద్ధతులను పాటించే రైతులకు ఎకరానికి రూ. 4,000 చొప్పున ప్రత్యేక ప్రోత్సాహకం.
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూ.6.16 కోట్ల ఖర్చుతో ’ఫార్మర్ ఐడీ ఉన్న 3 లక్షల మంది రైతులకు నేల ఆరోగ్య పరీక్షల సేవలు.
పచ్చిరొట్ట ఎరువులు – దుక్కి సబ్సిడీ
నేల సారాన్ని పునరుద్ధరించేందుకు 1 లక్ష ఎకరాలకు పచ్చిరొట్ట విత్తనాలు, 22,000 ఎకరాలకు బహుళ ధాన్యపు విత్తనాలు సబ్సిడీపై పంపిణీ. పచ్చిరొట్ట పైర్లను భూమిలో కలియదున్నడానికి ఎకరానికి రూ.3,000 చొప్పున దుక్కి సబ్సిడీ (మొత్తం కేటాయింపు: రూ.63.50 కోట్లు). రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడానికి రూ.4.50 కోట్లతో ద్రవ జీవ ఎరువులు, రూ.12.38 కోట్లతో పైరు ఉత్ప్రేరకాల పంపిణీ.
చిరుధాన్యాల మిషన్
చిరుధాన్యాల సాగు విస్తీర్ణం రెట్టింపునకు రూ.7 కోట్లతో తమిళనాడు చిరుధాన్యాల మిషన్‌ను వ్యవసాయ బడ్జెట్‌లో ప్రకటించారు. సామై (సామలు), తిణై (కొరల్రు), వరగు (అరికలు), కుదిరైవాలి (ఉదలు), పనివరగు (సజ్జలు/అండుకొర్రలు) వంటి చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని రెట్టింపు చేసేందుకు రూ.7.01 కోట్లతో ‘తమిళనాడు చిరుధాన్యాల మిషన్’ ( అమలు చేయనున్నట్లు వివరించారు. తమిళనాడులో తక్కువ నీటితో, కరువును తట్టుకుని పెరిగే సామలు, కొరల్రు, అరికలు మొదలైన చిరుధాన్యాల సాగును పెంచడానికి రాష్ట్రంలోని 29 జిల్లాల్లో రూ.7.01 కోట్ల బడ్జెట్‌తో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
‘మిల్లెట్ మిషన్’ విస్తరణ
జొన్నలు, సజ్జలు, రాగుల సాగు విస్తీర్ణం, దిగుబడిని పెంచేందుకు రూ.63.81 కోట్ల కేంద్ర, రాష్ట్ర నిధులతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. దీని కింద రైతు సమూహాల ఏర్పాటు, ప్రత్యామ్నాయ పంటల సబ్సిడీ, ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాలు , యంత్రాల అద్దె కేంద్రాలను అందుబాటులోకి తెస్తారు.ఈ పథకం ద్వారా 11.80 లక్షల ఎకరాల్లో సాగు చేసే 4.75 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు.
పోషకాహార ధాన్యాల కొత్త ప్రదర్శన క్షేత్రాలు
ప్రోటీన్లు, పీచుపదార్థాలు, క్యాల్షియం, ఐరన్ అధికంగా ఉండి.. గ్లూటెన్ లేని క్వినోవా( సీమై తిణై), బక్‌వీట్ (పాప్పరై), బ్రన్‌టాప్ మిల్లెట్ ( కులసామై) వంటి పోషకాహార ధాన్యాలను రాష్ట్రంలో పరిచయం చేయనున్నారు. అనుకూలమైన వాతావరణం ఉన్న నీలగిరి, దిండిగల్, కృష్ణగిరి, సేలం జిల్లాల్లో రూ.30 లక్షల వ్యయంతో ప్రత్యక్ష సాగు ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయనున్నారు.
ఉళవర్ ఏఐ ప్రాజెక్ట్..
రైతులకు సరికొత్త ఆధునిక సాంకేతిక సేవలు అందించడానికి రూ. 2 కోట్ల అంచనా వ్యయంతో ఉళవర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. సరైన సమయంలో రైతుకు అందే సమాచారం వేళకు కురిసే వర్షంతో సమానమనే దార్శనికతతో ఈ ప్రాజెక్ట్‌ను రూపుదించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మెషిన్ లెర్నింగ్ సాంకేతికతలను మేళవించి రైతులకు అవసరమైన సేవలను అందిస్తారు. ఈమేరకు వాతావరణ సమాచారం – ముందస్తు హెచ్చరికలు,
మట్టి సారం, నేల ఆరోగ్య పరీక్షల వివరాలు, పైర్లలో పురుగులు, తెగుళ్ల నివారణ యాజమాన్యం, వాతావరణ మార్పులకు తగిన పంటల ఎంపిక (విత్తనం నాటే స్థాయి నుండి కోత వరకు సమగ్ర సలహాలు), మార్కెట్ ధరల వివరాలు, వాయిస్ ఆధారిత వ్యవసాయ సేవలు పొంద వచ్చురు. రైతులు తమ స్మార్ట్‌ఫోన్ల ద్వారానే ఈ సమాచారాన్ని సులభంగా పొందేలా 2026–27 సంవత్సరంలో రూ. 2 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
పప్పుధాన్యాలు, నూనెగింజల స్వయం సంవృద్ధి కమిషన్..
తమిళనాడు రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిలో స్వయంసంవృద్ధి సాధించడమే లక్ష్యంగా మొత్తం రూ. 203.64 కోట్ల కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్య నిధులతో ఈ మిషన్ ప్రారంభించబడుతోంది. పప్పుధాన్యాల సాగు విస్తరణ రూ. 65.28 కోట్లు కేటాయించారు. ఇందులో మినప, కంది, పెసర, అలసంద వంటి పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని 15.19 లక్షల ఎకరాల నుండి 24.70 లక్షల ఎకరాలకు పెంచడం లక్ష్యంగ ఆనిర్ణయంచారు. ఉత్పత్తిని 3.88 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 7.72 లక్షల మెట్రిక్ టన్నులకు రెట్టింపు చేయనున్నారు. నూనెగింజల సాగు విస్తరణకు రూ. 138.36 కోట్లు కేటాయిస్తూ, వేరుశనగ, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్), ఆముదం సాగు విస్తీర్ణాన్ని 9.26 లక్షల ఎకరాల నుండి 14.89 లక్షల ఎకరాలకు విస్తరించడం. వార్షిక ఉత్పత్తిని 8.77 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 16.14 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడమే లక్ష్యంగా నిర్ణయించారు.
వర్మీ కంపోస్ట్ – సర్టిఫికేషన్
వర్మీ కంపోస్ట్ (వానపాముల ఎరువు) యూనిట్ల శాశ్వత నిర్మాణానికి రూ.10 కోట్లు. సేంద్రీయ రైతులకు ఉచితంగా సేంద్రీయ ధృవీకరణ పత్రాలు పంపిణీ. సారవంతం లేని నేలలను ఎంపిక చేసి బాగుచేసే ప్రదర్శనల కోసం రూ.2 కోట్లు. తమిళనాడు రాష్ట్ర విత్తనాభి వృద్ధి సంస్థ ద్వారా 7,730 మెట్రిక్ టన్నుల సర్టిఫైడ్ వరి విత్తనాల ఉత్పత్తి, 14,570 మెట్రిక్ టన్నుల విత్తనాల సబ్సిడీ పంపిణీకి గాను రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.34.72 కోట్లు కేటాయింపు.


