సాక్షి, చైన్నె : తమిళనాడు వ్యవసాయ బడ్జెట్ 2026–27లో ప్రముఖ ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త ‘నమ్మాళ్వార్’ పేరిట కొత్తగా ప్రభుత్వ సేంద్రీయ వ్యవసాయ కళాశాలను ప్రకటించడం పై ‘నెల్ జయరామన్ సాంప్రదాయ వరి పరిరక్షణ కేంద్రం’ ఘనంగా స్వాగతం పలికింది.ఈ మేరకు ఆ సంస్థ రాష్ట్ర సమన్వయకర్త రాజీవ్ హర్షం వ్యక్తం చేశారు.
విజ్ఞప్తికి తక్షణ స్పందన..
తిరువారూర్ జిల్లా తిరుత్తురైపూండిలో జరిగిన జాతీయ వరి పండుగ సందర్భంగా, నమ్మాళ్వార్ పేరిట ప్రభుత్వ వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి వినతిపత్రం అందజేశామని తెలిపారు. ఆ విజ్ఞప్తిని తక్షణమే స్వీకరించి బడ్జెట్‌లో ప్రకటన చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు.
రూ.5 కోట్లతో చారిత్రాత్మక నిర్ణయం..
తంజావూరు జిల్లా శాకోటైలో రూ. 5 కోట్ల అంచనా వ్యయంతో ’నమ్మాళ్వార్ సేంద్రీయ వ్యవసాయ డిప్లొమా కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించడం చారిత్రాత్మకమైన నిర్ణయమని పేర్కొన్నారు. ఈ నిర్ణయం నమ్మాళ్వార్ కీర్తిని చాటడమే కాకుండా, రాబోయే తరాలకు విషరహిత ప్రకృతి వ్యవసాయాన్ని నేర్పించే ఒక కీలక కేంద్రంగా ఈ కళాశాల నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దివంగత నెల్ జయరామన్ మార్గంలో సాంప్రదాయ వరి రకాలను కాపాడుతున్న తమ ప్రయత్నాలకు తమిళనాడు ప్రభుత్వ ఈ ప్రకటన ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందని, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కి, వ్యవసాయ శాఖ మంత్రి వినోద్‌కి ప్రకృతి రైతుల తరఫున రాజీవ్ కృతజ్ఞతలు తెలిపారు.


