ధైర్యం ఉంటే సమాధానం ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

ధైర్యం ఉంటే సమాధానం ఇవ్వండి

Aug 7 2026 1:56 AM | Updated on Aug 7 2026 1:56 AM

కావేరి వివాదంపై సీఎం విజయ్‌కు ఉదయనిధి సవాల్‌

సాక్షి, చైన్నె: తమిళనాడు శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్‌పై ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బడ్జెట్‌ ప్రసంగం మొత్తం ముఖ్యమంత్రి విజయ్‌ భజనకే సరిపోయిందని, రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని విమర్శించారు. కావేరి, మేఘా దాతు వివాదాలపై అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని ఆయన సవాల్‌ విసిరారు. అసె ంబ్లీకి నల్ల చొక్కాలు ధరించి వచ్చిన ఉదయ నిధి స్టాలిన్‌ డీఎంకే ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు.

నల్ల చొక్కాలతో నిరసన

రైతుల హక్కుల కోసం, టీవీకే ప్రభుత్వంలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు మద్దతుగా డీఎంకే సభ్యులమంతా నల్ల చొక్కాలు ధరించి సభకు హాజరయ్యామని తెలిపారు. ఇది వ్యవసాయ బడ్జెట్‌ ప్రసంగంలా లేదు, పూర్తిగా ముఖ్యమంత్రికి భజన కొడుతూ పొగిడే కార్యక్రమంలా ఉంది. సభా సంప్రదాయాలను పక్కన పెట్టి మంత్రి వినోద్‌ వ్యవహరించారు. డీఎంకే హయాంలో తెచ్చిన పథకాలకే పేర్లు మార్చి కొత్త పథకాలుగా ప్రకటించారు అని విమర్శించారు.

పంట రుణాల మాఫీ హామీ ఏమైంది?

ఎన్నికల సమయంలో 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు రూ.5 లక్షల వరకు ఉన్న పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని సీఎం విజయ్‌ హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక ఆ మాట తప్పి రైతులను దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. మేఽఘదాతు ప్రాజెక్ట్‌, కావేరీ నీటి వివాదంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం కర్ణాటక వెళ్తానని అంటుంటే, అక్కడి సీఎం వద్దని అంటున్నారని, ఈ విషయంలో సీఎం విజయ్‌ సరైన సమాధానం చెప్పడం లేదని విమర్శించారు.

నేడు వాయిదా తీర్మానం

కావేరీ వివాదం, కురువై సాగు చేయలేక రైతులు పడుతున్న వేదనలపై చర్చించేందుకు సభాధ్యక్షుడికి వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో రైతుల సమస్యలపై ప్రశ్నలు అడుగుతాం. చేతనైతే, ధైర్యముంటే సీఎం విజయ్‌ సభలో నోరు విప్పి సమాధానం చెప్పాని సవాల్‌ విసిరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement