సాక్షి, చైన్నె : తమిళనాడు బ్యాడ్మింటన్ అసోసియేషన్, భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక యోనెక్స్ సన్‌రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్–2026 శనివారం చైన్నెలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది. ఈనెల 23వ తేదీ వరకు జరిగే ఈ మెగా టోర్నమెంట్‌లో దేశవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి క్రీడాకారులు జాతీయ ర్యాంకింగ్ పాయింట్ల కోసం తలపడుతున్నారు. దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ సీనియర్ జాతీయ ర్యాంకింగ్ టోర్నమెంట్ మళ్లీ తమిళనాడుకు రావడం క్రీడా వర్గాల్లో పెద్ద మైలురాయిగా నిలిచింది. చివరిగా 2021లో చైన్నె ఈ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చింది.
రికార్డు స్థాయిలో 1,452 ఎంట్రీలు
ఈ ఏడాది టోర్నమెంట్‌కు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన లభించింది. మొత్తం 1,452 ఎంట్రీలు రాగా, అందులో ఒక్క మెన్స్ సింగిల్స్ కేటగిరీలోనే 700కు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో జరిగిన ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్లలోనే ఇది అతిపెద్ద రికార్డు. తమిళనాడు స్టార్ క్రీడాకారులు, మాజీ వరల్డ్ జూనియర్ నంబర్–1 శంకర్ ముత్తుస్వామి, ఆసియా అండర్–17 ఛాంపియన్ ఎస్.ఆర్. దీక్ష, మాజీ వరల్డ్ టాప్–50 ప్లేయర్ సతీష్ కుమార్ ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
క్రీడా రంగానికి కొత్త ఊపు
– మంత్రి ఆదవ్ అర్జున
ఉదయం జరిగిన ప్రారంభోత్సవ వేడుకలకు తమిళనాడు బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ అన్బుమణి రామదాస్ అధ్యక్షత వహించారు.రాష్ట్ర ప్రజాపనుల, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఆదవ్ అర్జున ముఖ్య అతిథిగా విచ్చేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆదవ్ అర్జున మాట్లాడుతూ, సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలో రాష్ట్రాన్ని భారతదేశ క్రీడా రాజధాని గా మార్చేందుకు గట్టి సంకల్పంతో ఉన్నామన్నారు.ఇందుకోసం రానున్న 3 ఏళ్లలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక వసతులను కల్పించబోతున్నట్లు ప్రకటించారు. ఒలింపిక్స్ 125 ఏళ్ల చరిత్రలో తమిళనాడు నుండి ఇంతవరకు ఎవరూ మెడల్ సాధించలేదని, 2036 ఒలింపిక్స్ నాటికి రాష్ట్రం నుండి కనీసం 15 ఒలింపిక్ పతకాలు సాధించడమే లక్ష్యంగా అంతర్జాతీయ కోచ్‌లతో శిక్షణ ఇప్పిస్తామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రం వెలుపల జరిగే పోటీల్లో పాల్గొనే తమిళనాడు అథ్లెట్లకు ఇకపై విమాన ప్రయాణ వసతి కల్పిస్తామన్నారు. చైన్నె నెహ్రూ స్టేడియంలో ఒలింపిక్ భవన్, ప్రత్యేక స్పోర్ట్స్ అకాడమీలతో పాటు ధర్మపురి, తిరునెల్వేలి, తూత్తుకుడి, నాగపట్నం జిల్లాల్లో కొత్త అకాడమీలను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు.


